నార్త్ అమెరికా మార్కెట్ పై `పెద్ది` గురి!
ఇలాంటి పరిస్థితుల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిత్రం `పెద్ది` పై ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు సినిమా మార్కెట్ పరిధిని నిర్దేశించడంలో ఓవర్సీస్.. ముఖ్యంగా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకప్పుడు అదనపు ఆదాయ వనరుగా ఉన్న యూఎస్ఏ మార్కెట్ నేడు ప్రతిష్టాత్మక చిత్రాల వాణిజ్య విజయాలను శాసించే స్థాయికి చేరుకుంది. అయితే గత కొంతకాలంగా ఇక్కడ టాలీవుడ్ చిత్రాల వసూళ్ల సరళిని గమనిస్తే విభిన్నమైన ట్రెండ్ కనిపిస్తోంది. పాత రోజుల్లోలా ప్రతి పెద్ద సినిమాకూ ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం లేదు. ఇక్కడి మార్కెట్ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
`బాహుబలి 2`, `ఆర్ఆర్ఆర్`, `కల్కి 2898 AD`, `పుష్ప 2` వంటి చిత్రాలు ఉత్తర అమెరికాలో కళ్లు చెదిరే వసూళ్లతో సరికొత్త రికార్డులను సృష్టించాయి. కానీ ఈ భారీ విజయాల వెనుక ఒక నిగూఢ సత్యం దాగి ఉంది. ఈ తరహా మైలురాయి చిత్రాల మినహా మిగిలిన టైర్ వన్ హీరోల పెద్ద సినిమాలు అక్కడ ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతున్నాయి. ఓవర్సీస్ ప్రేక్షకులు కంటెంట్ విషయంలో మరింత సెలెక్టివ్‌గా మారడం, టికెట్ ధరల వ్యూహాలు మారడం వల్ల సాధారణ పెద్ద చిత్రాలకు మునుపటి లాంటి లాంగ్ రన్ రావడం కాస్త కష్టతరంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిత్రం `పెద్ది` పై ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. `ఆర్ఆర్ఆర్` సాధించిన అంతర్జాతీయ గుర్తింపు తర్వాత రామ్ చరణ్ నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కావడంతో చరణ్ సోలో మార్కెట్ స్టామినాను నిరూపించుకోవడానికి ఇదొక పరీక్షగా మారింది. మందగించిన ఉత్తర అమెరికా టాలీవుడ్ మార్కెట్‌కు ఈ చిత్రం మళ్లీ పూర్వ వైభవాన్ని తెస్తుందని పరిశ్రమ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
వ్యాపార కోణంలో చూస్తే `పెద్ది` ముందు చాలా పెద్ద లక్ష్యాలే ఉన్నాయి. ఉత్తర అమెరికాలో ఈ సినిమా సురక్షితమైన బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 6 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఓవర్సీస్ టార్గెట్ 9 మిలియన్ డాలర్లుగా నిర్దేశించారు. ఈ అంకెలు వినడానికి భారీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ క్రేజ్ సినిమాకున్న అంతర్జాతీయ బజ్ దృష్ట్యా సరైన టాక్ వస్తే ఈ మైలురాయిని అందుకోవడం అసాధ్యమేమీ కాదనేది విశ్లేషకుల అంచనా.
బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్ వంటి క్రేజీ నటులు సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. 1980ల నాటి విజయనగ వాతావరణం, భావోద్వేగాలతో కూడిన స్పోర్ట్స్ ఎలిమెంట్స్ ఎప్పుడూ ఓవర్సీస్ ప్రేక్షకులను, ప్రవాసాంధ్రులను అలరించే అంశాలే. ప్రచార చిత్రాలు ..పాటలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతుండటంతో వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తంగా `పెద్ది` బాక్సాఫీస్ ప్రయాణం ఒక సినిమా విజయానికే పరిమితం కాలేదు. ఉత్తర అమెరికాలో తెలుగు సినిమాల మార్కెట్ పునరుజ్జీవనానికి కీలక మలుపు కానుంది. ఈ సినిమా గనుక అక్కడ అనుకున్న లక్ష్యాన్ని చేరి భారీ లాభాలను తెచ్చిపెడితే భవిష్యత్తులో రాబోయే ఇతర పెద్ద చిత్రాల ఓవర్సీస్ వ్యాపారానికి .. కొనుగోలుదారులకు కొండంత నమ్మకం లభిస్తుంది. మరి జూన్ 4న రాబోతున్న `పెద్ది` టాలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్‌ను ఏ స్థాయిలో పుంజుకునేలా చేస్తుందో చూడాలి.