పెద్ది చుట్టూ మూడు 'సవాళ్లు'.. ఏం జరుగుతుందో?
ముఖ్యంగా ఏప్రిల్ 30న విడుదల నేపథ్యంలో మూడు విషయాలు ఆ చిత్రానికి సవాళ్లుగా నిలుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. అసలేమైంది? అవేంటి?;
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ఆ సినిమాపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చగా మారింది. ముఖ్యంగా ఏప్రిల్ 30న విడుదల నేపథ్యంలో మూడు విషయాలు ఆ చిత్రానికి సవాళ్లుగా నిలుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. అసలేమైంది? అవేంటి?
మొదటిది.. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఇజ్రాయెల్- అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం. యుద్ధ వాతావరణం కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే రవాణా ఖర్చులు పెరగడం వల్ల సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇదే పరిస్థితి నెల రోజులు కొనసాగితే, పెద్ది సినిమా థియేట్రికల్ కలెక్షన్లపై కూడా ఆ ఎఫెక్ట్ పడొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో రెండో సవాల్ విషయానికొస్తే.. బాలీవుడ్ చిత్రం ధురంధర్ 2. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు సాధిస్తూ, ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ఖర్చు సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది.
ఫిబ్రవరిలో సంక్రాంతి సినిమాలపై భారీగా ఖర్చు చేసిన ప్రేక్షకులు తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నట్లు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడవచ్చని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో బ్యాండ్ మేళం, డెకాయిట్, బైకర్, స్వయంభూ వంటి చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఏప్రిల్ చివరికి ప్రేక్షకుల ఖర్చు కోసం ఆలోచించే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఇప్పుడు మూడో సవాల్.. ఐపీఎల్. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆ టోర్నీ క్రేజ్ హై లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు కొత్త యజమానులతో భారీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి, తమ జట్లను మరింత అట్రాక్టివ్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నాయి. దీంతో ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా క్రికెట్ పైనే ఉంటోంది.
టెలివిజన్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఐపీఎల్ మ్యాచ్ లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండటంతో, సినిమాలకు తగిన స్పేస్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. అలా మూడు సవాళ్ల మధ్య పెద్ది రిలీజ్ అవుతోంది. అయినప్పటికీ రామ్ చరణ్ స్టార్ డమ్, సినిమాపై ఉన్న అంచనాలు, కంటెంట్.. అన్నీ కలిసి ఆ అడ్డంకులను అధిగమించగలవా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. పెద్ది ఎలా రాణిస్తుందోననేది హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకుల రెస్పాన్స్, మౌత్ టాక్, ఓపెనింగ్ కలెక్షన్లే సినిమా ఫ్యూచర్ ను డిసైడ్ చేయనున్నాయనే చెప్పాలి.