'పెద్ది' ఈవెంట్: చరణ్ బాడీగార్డ్ మీద పడుతున్న ప్యాన్స్.. వ్వాటే క్రేజ్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా `పెద్ది` గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా `పెద్ది` గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతుండటంతో రామ్ చరణ్ ఎక్కడ ఉన్నా అక్కడ ఒక విలక్షణమైన బాడీ బిల్డర్ కం ఫైటర్ ప్రత్యక్షమవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడు రామ్ చరణ్ కొత్త పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంట. ఇటీవలి కాలంలో చరణ్ పాల్గొంటున్న`పెద్ది` చిత్ర ప్రమోషన్స్.. ఇంటర్వ్యూలలో అతడికి నిరంతరం క్లోజ్ ప్రొటెక్షన్ కల్పిస్తూ కెవిన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాడు.
కేవలం 27 ఏజ్ కుర్రాడైన ఈ డ్యాషింగ్ బాడీగార్డ్ అసలు పేరు అబ్దుల్ కాదిర్ సోవ్. వెస్ట్ ఆఫ్రికా దేశమైన గాంబియాలో 1998లో జన్మించిన ఇతడు ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో నివసిస్తున్నారు. కెవిన్‌కు అంతర్జాతీయంగా విఐపి సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా మంచి గుర్తింపు ఉంది. కేవలం బాడీగార్డ్ మాత్రమే కాకుండా ఆయన ఇటలీకి చెందిన ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ (MMA - మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైటర్ కూడా కావడం విశేషం. ఎమ్ఎమ్ఏ రింగ్‌లో `మామా లామిన్ ఆఫ్ బర్రా`గా పిలవబడే కెవిన్ మిడిల్‌వెయిట్ కేటగిరీలో ఇటలీ నేషనల్ ఎమ్ఎమ్ఏ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ప్రతిష్టాత్మక `కొలోసియం ఛాంపియన్ బెల్ట్`ను కూడా కైవసం చేసుకున్నారు.
కెరీర్ పరంగా అంతర్జాతీయ సెలబ్రెటీలు- హై-ప్రొఫైల్ క్లయింట్లకు ఎలైట్ సెక్యూరిటీ సేవలను అందించే కెవిన్, రామ్ చరణ్ కోసం చేసే ప్రొటెక్షన్ టూర్లకు భారీగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం. లోకల్ మీడియా కథనాల ప్రకారం గ్లోబల్ స్టార్‌కు రక్షణ కల్పించినందుకు కెవిన్ రోజుకు 2 లక్షల నుండి 4 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నాడని ప్రచారంలో ఉంది. ఇటీవల ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ కూడా కెవిన్‌పై వస్తున్న అటెన్షన్ గురించి సరదాగా స్పందిస్తూ.. రామ్ చరణ్ గురించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం కోసం జనాలు కెవిన్‌కు లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించవచ్చంటూ సరదాగా జోక్ చేశారు.
అయితే తాజాగా `పెద్ది` ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ విజయవాడ వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. కెవిన్ పర్సనాలిటీ, హాలీవుడ్ నటుడిని తలపించే అతని లుక్స్ చూసి విజయవాడ ఈవెంట్‌లో జనాలు చరణ్ కంటే కెవిన్ వైపే ఎక్కువగా ఆకర్షితులయ్యారు. సెల్ఫీల కోసం చరణ్‌ను పక్కనబెట్టి కెవిన్‌పైనే జనం ఒక్కసారిగా ఎగబడ్డారట. రామ్ చరణ్‌తో పాటు సమానంగా ఇప్పుడు కెవిన్‌కు కూడా తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత క్రేజ్, ఫాలోయింగ్ పెరిగిపోయింది. విజయవాడ జనం అతనిపై పడటం.. సెల్ఫీల కోసం విరుచుకుపడటం చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో `చివరికి బాడీగార్డ్‌కే మరో బాడీగార్డ్ కావాలేమో` అంటూ విపరీతంగా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా స్టార్ హీరోల చుట్టూ ఉండే బాడీగార్డులు కేవలం రక్షణ కోసమే పరిమితమవుతారు. కానీ కెవిన్ కుంట తన ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ బ్యాక్‌గ్రౌండ్ -హాలీవుడ్ రేంజ్ కటౌట్‌తో తానే ఒక సెలబ్రెటీగా మారిపోయారు.`పెద్ది` సినిమా ప్రమోషన్లలో రామ్ చరణ్ లుక్స్‌తో పాటు కెవిన్ ఉనికి కూడా సినిమాకు ఒక అదనపు అట్రాక్షన్‌గా నిలిచింది. ఒక అంతర్జాతీయ ఫైటర్ టాలీవుడ్ గ్లోబల్ స్టార్‌కు రక్షణగా నిలవడం.. అతడికి ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం సినీ వర్గాల్లో ఒక సరికొత్త ట్రెండ్‌గా మారింది. ఆసక్తికరంగా ఒక ఎంఎంఏ ఫైటర్ ని రక్షకుడిగా నియమించుకున్న చరణ్ కు ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ లో క్రేజ్ మరింత పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.