రాజశేఖర్.. ఇదే కంటిన్యూ చేస్తే..

టాలీవుడ్‌ లో ఒకప్పుడు యాక్షన్ హీరోగా బాక్సాఫీస్‌ ను షేక్ చేసిన సీనియర్ యాక్టర్ రాజశేఖర్‌ ప్రస్తుతం తన కెరీర్‌ లో కొత్త స్టేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి.;

Update: 2026-04-03 10:00 GMT

టాలీవుడ్‌ లో ఒకప్పుడు యాక్షన్ హీరోగా బాక్సాఫీస్‌ ను షేక్ చేసిన సీనియర్ యాక్టర్ రాజశేఖర్‌ ప్రస్తుతం తన కెరీర్‌ లో కొత్త స్టేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. గతంలో వరుస హిట్లతో స్టార్‌ డమ్‌ అందుకోగా.. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది. ముఖ్యంగా పీఎస్వీ గరుడ వేగ సినిమా తర్వాత రాజశేఖర్ నుంచి మరో స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ వస్తుందని అభిమానులు ఆశించారు.

ఆ అంచనాలను నిలబెట్టే విధంగా తదుపరి ప్రాజెక్టులు రాకపోవడంతో ఆయన కెరీర్ కొంత స్లో అయింది. అదే సమయంలో ఇతర సీనియర్ హీరోలు జగపతిబాబు, శ్రీకాంత్‌ వంటి వారు విలన్ పాత్రల్లో సక్సెస్‌ ఫుల్‌ గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ రాజశేఖర్ మాత్రం ఆ దిశగా పూర్తిగా స్థిరపడలేకపోయారు. అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్‌లో కనిపించినప్పటికీ, అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

2023లో విడుదలైన ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఆయన చేసిన ప్రత్యేక పాత్ర కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఈ నేపథ్యంలో సరైన కథ, స్ట్రాంగ్ రోల్ కోసం కొంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. తాజాగా శర్వానంద్ హీరోగా తెరకెక్కిన బైకర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో ఆయన పోషించిన బుల్లెట్ సునీల్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా తండ్రిగా, కోచ్‌ గా కనిపించిన ఆయన పాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అనుభవజ్ఞుడైన నటుడిగా తన ఎమోషన్స్ ను నేచురల్ గా వ్యక్తపరిచిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా రాజశేఖర్ నటనపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఆయనకు సరైన పాత్ర దొరికిందని, ఇదే తరహా పాత్రలు కొనసాగిస్తే మరోసారి ఆయన కెరీర్ పుంజుకునే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా తండ్రి, కోచ్, లేదా గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయనకు మంచి స్కోప్ ఉందని చెబుతున్నారు. అయితే ప్రస్తుత ట్రెండ్‌ కు అనుగుణంగా పాత్రలను ఎంపిక చేసుకుంటే రాజశేఖర్ కు మళ్లీ విజయాలు సాధ్యమేనని అభిప్రాయపడుతున్నారు. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో కీలక పాత్రలు చేస్తే ఆయన నటనకు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని అంటున్నారు.

గతంలో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా కొత్త ఇన్నింగ్స్ విషయంలో సరైన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి బైకర్ సినిమా ద్వారా వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌ ను కొనసాగించగలిగితే.. రాజశేఖర్ కెరీర్ మళ్లీ ట్రాక్‌ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అభిమానులు కూడా ఆయన నుంచి ఇలాంటి స్ట్రాంగ్ రోల్స్ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News