ట్రాక్‌లో పడుతున్న రాజమౌళి శిష్యులు

రాజమౌళి దగ్గర పని చేసిన వాళ్లలో కొందరు సింగిల్ సిట్టింగ్ లో అవకాశాలు అందుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా వాళ్లలో ఎవరికీ మొదటి నుంచే పెద్ద హీరోల సినిమాలు దక్కలేదు.

Update: 2026-08-23 18:34 GMT

రాజమౌళి దగ్గర పని చేసిన వాళ్లలో కొందరు సింగిల్ సిట్టింగ్ లో అవకాశాలు అందుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా వాళ్లలో ఎవరికీ మొదటి నుంచే పెద్ద హీరోల సినిమాలు దక్కలేదు. రాజమౌళి టీమ్ నుంచి దర్శకుడు వస్తున్నాడంటే ఆటోమేటిక్‌గా భారీ బజ్ వస్తుందనే పరిస్థితి కూడా ఇప్పటివరకు లేదు. ఆయనతో కలిసి వందల కోట్ల సినిమాల మీద పని చేసిన అనుభవం ఉన్నా, బయటకు వచ్చాక మాత్రం చాలా మంది చిన్న సినిమాలతోనే మొదలుపెట్టాల్సి వచ్చింది.

పేట త్రికోటి ఇందుకు ఉదాహరణ. రాజమౌళి దగ్గర కెరీర్ మొదటి నుంచి పనిచేసిన ఆయన ‘దిక్కులు చూడకు రామయ్య’తో దర్శకుడయ్యారు. తర్వాత ‘జువ్వ’, ‘అహో విక్రమార్క’ చేశారు. సినిమాలు వచ్చాయి కానీ స్టార్ హీరోల దగ్గరకు మాత్రం వెళ్లలేకపోయారు. అలాగే ‘ఈగ’, ‘బాహుబలి’ సమయంలో రాజమౌళి టీమ్‌లో ఉన్న అశ్విన్ గంగరాజు ‘ఆకాశవాణి’తో దర్శకుడిగా వచ్చారు. ఆ సినిమాకు మంచి పేరు వచ్చినా కమర్షియల్‌గా పెద్ద స్థాయికి వెళ్లలేదు.

ఇప్పుడు అశ్విన్ దగ్గరే లెక్క మారుతోంది. ‘కాంతార’ తర్వాత దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ తెచ్చుకున్న రిషబ్ శెట్టితో పెద్ద సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తోంది. రాజమౌళి దగ్గర నుంచి వచ్చిన దర్శకుడికి ఇంత పెద్ద మార్కెట్ ఉన్న హీరో దొరకడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. కథ కూడా పీరియడ్ యాక్షన్ జోన్‌లో ఉండటంతో అశ్విన్‌కు ఇది ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే చాలా పెద్ద కాన్వాస్.

ఇక ఇప్పుడు మరో శిష్యుడి పేరు అజిత్‌తో వినిపిస్తోంది. ఒక భారీ కథను అజిత్‌కు చెప్పగా, పూర్తి నేరేషన్ వినాలని ఆయన అడిగినట్లు టాక్ నడుస్తోంది. ఇంకా సినిమా ఫిక్స్ కాలేదు. దర్శకుడి పేరు కూడా బయటకు రావాల్సి ఉంది. కానీ అజిత్ లాంటి స్టార్ దగ్గరకు రాజమౌళి టీమ్ నుంచి వచ్చిన దర్శకుడి కథ వెళ్లడం మాత్రం ఈ మధ్య కనిపిస్తున్న మార్పుకు మరో ఉదాహరణ. ఇక్కడ అసలు పాయింట్ కూడా అదే. గతంలో రాజమౌళి దగ్గర పని చేశారనే పేరు ఉన్నా వాళ్లు తమ సినిమాలకు తామే దారి చేసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు మాత్రం వాళ్లు ఎంచుకుంటున్న కథల స్కేల్ పెరుగుతోంది. రిషబ్ శెట్టి సినిమా ఇప్పటికే ముందుకెళ్లగా, అజిత్‌తో చర్చల వరకు మరో కథ వెళ్లింది. చిన్న హీరోతో మొదలుపెట్టి నెమ్మదిగా పైకి రావడం కాకుండా, పెద్ద మార్కెట్‌కు సరిపోయే కథలను ముందే సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజమౌళి టీమ్‌లో పనిచేసిన వాళ్లు మాత్రం మొదటి నుంచే భారీ సెట్స్, వీఎఫ్‌ఎక్స్, పెద్ద యాక్షన్ బ్లాక్స్ ఎలా నడుస్తాయో దగ్గరగా చూశారు. ఇప్పుడు వాళ్లకు పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్లు దొరికితే ఆ అనుభవం నిజంగా ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.

Tags:    

Similar News