'పవన్ కల్యాణ్' అనే పేరు వెనక.. 'పురుష' నిర్మాత షాకింగ్ ట్విస్ట్!
ఈ సినిమాను మే 22న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
వ్యక్తిగత నేపథ్యం?
నా పేరు బత్తుల కోటేశ్వరరావు. మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. నాకు సినిమా ఫీల్డుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడకు వచ్చాక అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలోకి రావడం మంచి పరిణామంగా అనిపిస్తోంది.
మీ అబ్బాయికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టారు.. ఎందుకలా?
`గోకులంలో సీత` చూసిన తరువాత పవన్ కళ్యాణ్ గొప్ప స్థాయికి వెళ్తారని అనిపించింది. ఆ వయసులో నన్ను నేను ఆయనలో చూసుకున్నాను. ఆయన అభిమానిగా మారిపోయాను. నాకు కొడుకు పుడితే పవన్ పేరే పెట్టుకోవాలని అనుకున్నాను. అనుకున్నట్టుగానే మాకు `తమ్ముడు` సినిమా టైంలో అబ్బాయి పుట్టాడు. ఆయన పేరు పెట్టాను.
హీరో అవ్వాలనే ఆలోచన ఎవరిది?
సినిమా ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. మా అబ్బాయికి సిగ్గు, బిడియం ఎక్కువ. హీరో అవ్వాలన్న నా కలని మా అబ్బాయి ద్వారా నెరవేర్చుకున్నాను. మా అబ్బాయికి ఉన్న సిగ్గు, బిడియం కూడా ఈ సినిమాల వల్ల పోతుంది. అందుకే మా కొడుకుని హీరోగా చేశాను.
దర్శకుడి గురించి?
వీరు గారితో సినిమా కంటే ముందు ఓ దర్శకుడితో సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. ఆ తరువాత సతీష్ ముత్యాల గారు వీరు గారిని పరిచయం చేశారు. కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. మా కన్‌స్ట్రక్షన్ ఆఫీస్‌నే సినిమా ఆఫీస్‌గా మార్చాం.
`పురుష`లో మీకు నచ్చిన ఎలిమెంట్స్?
‘పురుష:’ కథ చాలా బాగుంటుంది. ఆయన నెరేషన్ ఇచ్చిన తీరు కూడా డిఫరెంట్‌గా ఉంది. ఇందులోని లవ్ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఏదో ఒక భారీ సినిమా తీసేయాలనే కోరిక అయితే నాకు లేదు. మా అబ్బాయికి ఉన్న బిడియం, సిగ్గుని పోగొడితే చాలు అని నాకు అనిపించింది. డబ్బుల కోసం అయితే మూవీ తీయలేదు. లాభాలు ఆశించడం లేదు.
`పురుష`లోని పాత్రల గురించి?
వీటీవీ గణేష్ పాత్ర అందరినీ నవ్విస్తుంది. ఆయన మాకు ఎంతో సహకరించారు. డేట్స్ విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. వెన్నెల కిషోర్ గారి వల్లే కథలో సంఘర్షణ వస్తుంది. సప్తగిరి అద్భుతంగా నటించారు. కసిరెడ్డి గారు చక్కగా నటించారు. మా హీరోయిన్లు అందంగా కనిపించడమే కాకుండా తెరపై చక్కగా నటించారు. అనంత శ్రీరామ్ గారి పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. మా అబ్బాయి గురించి నేను చెప్పను. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ చెప్పాలి. ఈ చిత్రానికి శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా కోసం కీరవాణి గారు కూడా ఓ పాట పాడారు. అది మా అదృష్టం. ఇప్పటికే మా సినిమాలోని పాటలకు మంచి స్పందన లభించింది. సినిమాని మొత్తంగా మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మే 21 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నాం. థియేటర్లో హాయిగా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.
నిర్మాతగా ఈ ప్రయాణంపై?
‘పురుష’ షూటింగ్ కి అందరూ సహకరించారు. కారు డ్రైవర్లు, లైట్ మెన్స్ నుంచీ ప్రతీ ఒక్కరూ మాకు సహకరించారు. ఓ పది రూపాయలు మిగిల్చేలానే చూశారు. అంతే కానీ నన్ను ఎక్కడా పీడించి డబ్బులు వసూల్ చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రయాణం నాకెంతో సాఫీగా సాగినట్టు అనిపించింది. బయట చెప్పినట్టుగా ఇండస్ట్రీలో చెడు వాతావరణం నాకు కనిపించలేదు.
నెక్ట్స్ సినిమాలేవి?
మా అబ్బాయికి నేను ముందుగానే మాట ఇచ్చాను. మూడు సినిమాలు చేస్తానని చెప్పానని. అప్పటి వరకు మా వాడు నిరూపించుకుని హీరోగా నిలబడితే ఓకే. లేదంటే మళ్లీ మా ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలని ముందే చెప్పాను. అలా నేను మా వాడితో కచ్చితంగా నాకున్న స్థోమతలో మూడు సినిమాలు అయితే చేస్తాను.