'వారణాసి' బ్యూటీ గ్లోబల్ బ్రాండ్స్‌తో ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

ఇక సినిమాల విషయానికి వస్తే... రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్ల వరకు భారీ పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్.

Update: 2026-06-24 00:30 GMT

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. జక్కన్న సినిమాల్లో నటించిన హీరోయిన్లలోనే అత్యంత `కాస్ట్‌లీ` హీరోయిన్‌గా పీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ అత్యధిక పారితోషికం అందుకునే భారతీయ నటిగా గ్లోబల్ రేంజ్‌లో దూసుకుపోతోంది.

ఇటీవల ప్రియాంక చోప్రా ఇన్‌స్టా ఫీడ్ పరిశీలిస్తే.. త‌న‌ రేంజ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లగ్జరీ బ్రాండ్లయిన `రోలెక్స్`, `బుల్గారీ`లతో పీసీ అరుదైన ఒప్పందాలను కుదుర్చుకుంది. సాధారణంగా ఇలాంటి అగ్రశ్రేణి లగ్జరీ హౌస్‌లు ఒకే సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడానికి ఇష్టపడవు. కానీ ప్రియాంక గ్లోబల్ ఇమేజ్, క్రేజ్ దృష్ట్యా రోలెక్స్ సంస్థ త‌న‌ను తమ రోలెక్స్ టెస్టిమోనీగా ప్రకటించింది. అలాగే 2021 నుండి బుల్గారీ గ్లోబల్ అంబాసిడర్‌గా కూడా కొనసాగుతోంది. ఈ రెండు మెగా బ్రాండ్స్ కోసమే ఏడాది కాంట్రాక్ట్ విలువ ఒక్కొక్క దానికి సుమారు రూ.15 కోట్ల‌ నుండి రూ. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఇవే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతోను ప్రియాంక చోప్రా భారీగా ఆర్జిస్తోంది. అనామలీ హెయిర్‌కేర్, బియాండ్ టైప్1, బాండ్‌స్ట్రీట్ వంటి ఎన్నో అంతర్జాతీయ కార్పొరేట్ బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తోంది. సాధారణంగా పీసీ ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు దాదాపు రూ. 5 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్స్, కమర్షియల్ యాడ్స్ కోసం ర‌క‌ర‌కాల‌ గ్లోబల్ బ్రాండ్స్ తో ఏడాది కాంట్రాక్టుల ద్వారానే ప్రతి సంవత్సరం రూ. 60 నుండి రూ. 80 కోట్ల వరకు భారీ ఆదాయం లభిస్తోందని మార్కెట్ వర్గాల అంచ‌నా.

ఇక సినిమాల విషయానికి వస్తే... రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్ల వరకు భారీ పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. హాలీవుడ్‌లో ఒక్కో సినిమా లేదా సిరీస్ ఎపిసోడ్‌కు కోట్లల్లో డిమాండ్ చేస్తుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను లైన్‌లో పెడుతున్న పీసీ... సినిమాల రూపంలోనే ఏడాదికి రూ. 40 నుండి రూ. 50 కోట్ల వరకు సంపాదిస్తోంది. ఈ విధంగా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సినిమాల రెమ్యూనరేషన్, సొంత ప్రొడక్షన్ హౌస్ ప‌ర్పుల్ పెబ‌ల్ పిక్చ‌ర్స్ ఆదాయం స‌హా ఇతర వ్యాపారాల పెట్టుబడులను కలుపుకుంటే ప్రియాంక చోప్రా సంవత్సరానికి రూ. 100 కోట్ల‌ నుండి రూ. 130 కోట్ల వరకు ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ భామ‌ మొత్తం నికర ఆస్తి విలువ సుమారు రూ. 620 కోట్ల నుండి రూ. 650 కోట్ల వరకు (సుమారు 75-80 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా.

2026లో ప్రియాంక చోప్రా డైరీ ఫుల్ బిజీగా ఉంది. ఒకవైపు రాజమౌళి `వారణాసి` చివరి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటూనే... హాలీవుడ్‌లో ఓర్లాండో బ్లూమ్‌తో కలిసి నటిస్తున్న `రీసెట్` చిత్రం గురించి జోరుగా ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా హాలీవుడ్ అగ్రనటి ఏంజెలీనా జోలీతో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు కూడా పీసీ అధికారికంగా ధృవీకరించింది. మరోవైపు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో అనుకున్న బాలీవుడ్ మూవీ `జీ లే జరా` స్క్రిప్ట్ మార్పుల వల్ల అంతకంతకూ లేట్ అవుతోంది. ప్రస్తుతానికి రాజమౌళి `వారణాసి` మినహా ప్రియాంక చోప్రా మరే ఇతర దక్షిణాది సినిమాలకు సంతకం చేయలేదు.

Tags:    

Similar News