ఎన్టీఆర్ ఇన్‌పుట్స్ ఇవ్వకపోతే డ్రాగన్ స్క్రిప్ట్ లేనే లేదా?
అయితే తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్ వెనుక దాగి ఉన్న కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న లార్జర్-దేన్-లైఫ్ యాక్షన్ డ్రామా `డ్రాగన్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ 11 జూన్ 2027 న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్ వెనుక దాగి ఉన్న కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఒకవేళ ఎన్టీఆర్ తన ఆలోచనలను, ఇన్‌పుట్స్‌ను పంచుకోకపోయి ఉంటే ఈ `డ్రాగన్` స్క్రిప్ట్ అసలు ఈ రూపంలో వచ్చేదే కాదా అనే రేంజ్‌లో నీల్ సంచలన విషయాలను తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.
ఈ ప్రాజెక్ట్ కోసం తాము దాదాపు ఐదేళ్ల పాటు స్క్రిప్ట్‌పై శ్రమించామని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తాను కథ రాయడం ప్రారంభించిన మొదటి రెండేళ్ల వరకు ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి రైటర్స్ లేరు. ఆ సుదీర్ఘమైన రెండేళ్ల కాలంలో ప్రశాంత్ నీల్ కేవలం జూనియర్ ఎన్టీఆర్‌తో మాత్రమే నిరంతరం కథా చర్చలు జరిపారు. ఎన్టీఆర్ కేవలం ఒక హీరోగా కాకుండా, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో ఒక భాగస్వామిగా మారి అందించిన సరికొత్త ఆలోచనలు, ఇన్‌పుట్స్ ఈ కథ అత్యంత ఉత్తమంగా రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణమయ్యాయి.
ముఖ్యంగా సినిమాలో వచ్చే భావోద్వేగాల ఎలివేషన్ విషయంలో ఎన్టీఆర్ ఇచ్చిన ఐడియాలు అద్భుతంగా పనిచేశాయని ప్రశాంత్ నీల్ ప్రశంసించారు. ఎన్టీఆర్‌కు ఎమోషనల్ డ్రామాపై ఉన్న అపారమైన పట్టును తాను ఎంతగానో నమ్ముతానని.. అందుకే ఆయన ఒక నమ్మకమైన ప్రేక్షకుడి స్థానంలో నిలబడి కథలోని నాటకీయతను బెటర్ మెంట్ చేయడానికి ఎన్నో అద్భుతమైన సూచనలు చేశారని నీల్ వివరించారు. కేవలం సాధారణ స్క్రిప్ట్ మార్పులకే పరిమితం కాకుండా..సినిమా క్లైమాక్స్ సన్నివేశానికి కూడా ఎన్టీఆర్ స్వయంగా కీలకమైన ఇన్‌పుట్స్ ఇచ్చి ఆ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లాయని తెలిపారు.
తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ - డీప్ `డార్క్ షేడ్` (చీకటి కోణం) ఉన్న ఒక నెగెటివ్ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారు. ఇలాంటి ఒక నెగెటివ్ డార్క్ షేడ్ పాత్రను అంగీకరించేందుకు ఏ ఇతర హీరో ముందుకు రారు. కానీ ఈ కథలో కాంప్లికేషన్స్ ని అర్థం చేసుకుని తారక్ ఓకే చెప్పారు. ఈ సాహసానికి ఒడికట్టారని నీల్ చెప్పారు.
కథా చర్చల చివరి దశలో.. ఎన్టీఆర్ ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో రాసుకున్న ఆ బలమైన క్లైమాక్స్ సన్నివేశం హీరోలో వంద శాతం నమ్మకాన్ని నింపింది. ఆ పాత్ర పూర్తి ఎమోషనల్ ఆర్క్ అర్థమయ్యాక- నా ఇమేజ్‌కు ఇది కొంత రిస్క్ అయినా చేసేద్దాం..ముందుకు వెళ్దామని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రశాంత్ నీల్ గుర్తుచేసుకున్నారు. చిత్ర కథానాయకుడు, దర్శకుల మధ్య జరిగిన ఈ లోతైన ఐదేళ్ల సృజనాత్మక ప్రయాణమే `డ్రాగన్` చిత్రాన్ని భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక సరికొత్త యాక్షన్ సంచలనంగా మార్చబోతోందని ఇప్పుడు విశ్లేషించవచ్చు.