ఇల్లును ముక్కలు చేసే తల్లిగా ఎప్పుడూ భావించలేదంది!
సోనీ రజ్దాన్ తన తండ్రి మహేష్ భట్ జీవితంలోకి వచ్చినప్పుడు నిలకడైన సంసారాన్ని ముక్కలు చేశాననే తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారని పూజ గుర్తు చేసుకున్నారు.
చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు,వారి కుటుంబ సంబంధాలు తరచూ బహిరంగ చర్చలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా వైవాహిక బంధాలలో వచ్చే మార్పులు, వాటి చుట్టూ ఉండే భావోద్వేగాలు ఎంతో సంక్లిష్టంగా ఉంటాయి. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ వ్యక్తిగత జీవితం కూడా అలాంటి ఓ సుదీర్ఘమైన చర్చనీయాంశమే. ఆయన మొదటి భార్య కిరణ్ భట్, రెండో భార్య సోనీ రజ్దాన్‌ల మధ్య ఉన్న సంబంధాలు, వారి పిల్లల మధ్య ఉన్న అనుబంధం గురించి తాజాగా పూజా భట్ పంచుకున్న విషయాలు సామాజికంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకరి వైవాహిక జీవితంలోకి మరొకరు ప్రవేశించినప్పుడు ఏర్పడే నేరభావన గురించి పూజా భట్ ఎంతో ఓపెన్ గా మాట్లాడారు.
సోనీ రజ్దాన్ తన తండ్రి మహేష్ భట్ జీవితంలోకి వచ్చినప్పుడు నిలకడైన సంసారాన్ని ముక్కలు చేశాననే తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారని పూజ గుర్తు చేసుకున్నారు. ఒక స్త్రీగా మరొకరి జీవితాన్ని ఇబ్బంది పెట్టాననే ఆ వేదన సోనీని చాలా కాలం పాటు వెంటాడిందన్నారు. అయితే కాలక్రమేణా ఆ పరిస్థితులు ఎలా మారాయో కూడా వివరించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు సవతి తల్లిపై ద్వేషాన్ని పెంచుకోవడం సహజం. కానీ పూజా భట్ మాత్రం ఆ విషయంలో ఎంతో పరిణతిని ప్రదర్శించారు. తన తండ్రి బలవంతంగా ఏ బంధంలోనూ ఉండలేదని ఆయన స్వచ్ఛందంగానే సోనీ వైపు అడుగులు వేశారని చిన్న వయసులోనే పూజ గ్రహించానన్నారే. అందుకే సవతి తల్లి అయిన సోనీని ఇల్లు ముక్కలు చేసే స్త్రీగా తానెప్పుడూ చూడలేదన్నారు.
ఆమె కూడా ఒక మనిషేనని, ఆమెకు కూడా భావోద్వేగాలు ఉంటాయని తామంతా అర్థం చేసుకున్నామని పూజ పేర్కొన్నారు. మహేష్ భట్- సోనీ రజ్దాన్‌ల కుమార్తెలైన అలియా భట్, షాహీన్ భట్‌లతో పూజా భట్‌కు ఉన్న అనుబంధం నేడు బాలీవుడ్‌లో ఎంతో ఆదర్శం. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా? కాలక్రమేణా ఇరు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు తొలిగిపోయాయి. పరస్పర గౌరవం, అవగాహనలతో ఒకే కుటుంబంగా రూపాంతరం చెందారు. పాత గాయాలను మర్చిపోయి.. ఒకరికొకరు తోడుగా నిలబడటంలో వీరంతా చూపిన చొరవ ప్రశంసనీయం.
మానవ బంధాలను తప్పు-ఒప్పు అనే నలుపు తెలుపు కోణంలో చూడలేమని పూజా భట్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. జీవితంలో కొన్ని నిర్ణయాలు పరిస్థితుల ప్రభావం వల్ల జరుగుతాయని వాటి వెనుక ఉన్న నైతిక సంఘర్షణలను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. సోనీ రజ్దాన్ పడిన ఆనాటి ఆవేదన, నేడు వారి కుటుంబంలో ఉన్న ప్రశాంతత.. మనుషులు కాలంతో పాటు ఎలా పరిణతి చెందుతారో తెలియజేస్తాయి. కుటుంబ సంక్షోభాలను ఎదుర్కోవడంలో భట్ కుటుంబం సరికొత్త దృక్పథాన్ని సమాజానికి పరిచయం చేసింది. ద్వేషం - పగలతో బంధాలను మరింత క్లిష్టతరం చేసుకునే బదులు, సానుభూతి , దయాగుణంతో ముందుకు సాగితే ఎలాంటి జటిలమైన సమస్యలైనా సమసిపోతాయని వీరి ప్రయాణం నిరూపిస్తుంది. నేడు అలియా భట్ సాధిస్తున్న విజయాలలో పూజా భట్ చూపిస్తున్న ఆదరణ, ప్రోత్సాహమే ఇందుకు సజీవ సాక్ష్యం.