పాత ఎఫైర్ల గురించి గుచ్చి గుచ్చి అడగొద్దు!
బాలీవుడ్ నటి పూజా బేడీ తన వ్యక్తిగత జీవితం- నటుడు ఆదిత్య పంచోలితో ఉన్న రిలేషన్‌షిప్‌పై తాజాగా స్పందించారు.
బాలీవుడ్ నటి పూజా బేడీ తన వ్యక్తిగత జీవితం- నటుడు ఆదిత్య పంచోలితో ఉన్న రిలేషన్‌షిప్‌పై తాజాగా స్పందించారు. గతం గురించి పదే పదే మాట్లాడటం మంచి పద్ధతి కాదని.. ఇకపై ఆ అంశంపై ఎలాంటి చర్చకు తావులేదని స్పష్టం చేశారు. చాలా కాలం క్రితం ముగిసిపోయిన ఆ విషయాలను మళ్లీ తెరపైకి తేవడం వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. ఆదిత్య పంచోలికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజా బేడీ వెల్లడించారు. తండ్రి గతం గురించి పదే పదే సోషల్ మీడియాలో .. వార్తల్లో చదవడం ఆ పిల్లలకు ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం వారి గౌరవం కోసమే తాను ఈ పాత విషయాలపై మాట్లాడటానికి నిరాకరిస్తున్నట్లు ఆమె తేల్చి చెప్పారు.
సినీ పరిశ్రమలో ఎదురుపడినప్పుడు ఎలా ప్రవర్తిస్తారనే? దానిపై కూడా పూజా మాట్లాడారు. ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడటం సహజమని అయితే అలాంటప్పుడు సంయమనం పాటించి, ఎవరి దారిన వారు వెళ్లిపోవడమే ఉత్తమమని తెలిపారు. పాత విషయాలను మనసులో పెట్టుకుని ప్రయాణించడం కంటే వాటిని వదిలేసి ముందుకు సాగడమే మంచిదని పేర్కొన్నారు.
జీవితంలో ప్రతి అనుభవం ఒక పాఠాన్ని నేర్పుతుందని పూజా బేడీ తెలిపారు. ఆదిత్య పంచోలితో తన అనుబంధాన్ని ఒక జ్ఞాపకంగా మాత్రమే చూస్తానని.. దాని నుంచి తాను ఎంతో పరిణతిని సాధించానని చెప్పారు. గతం తాలూకు చేదు అనుభవాలను పదే పదే చర్చించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని.. మనిషిని మరింత బలహీనులను చేస్తుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు పూజాబేడీ వివాహం ... రిలేషన్‌షిప్‌ల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహ బంధంలో నమ్మకం, విధేయత చాలా ముఖ్యమని, ప్రస్తుత భాగస్వామి మేనెక్ కాంట్రాక్టర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం తనకు లేదని స్పష్టం చేశారు. చట్టపరమైన కాగితాల కంటే పరస్పర అంగీకారమే బంధాన్ని మరింత గట్టిగా నిలబెడుతుందని నమ్ముతానన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉంటాయని..అయితే వాటిని గౌరవించి హద్దులో ఉండటం అందరి బాధ్యతని ఈ ఉదంతం ద్వారా తెలుస్తోంది. పాత వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని భావిస్తున్న పూజా బేడీ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.