క్రికెటా లేక కుస్తీనా? పెద్ది గ్లింప్స్‌తో బుచ్చిబాబు మైండ్ గేమ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉండటంతో, ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ లేటెస్ట్ బర్త్ డే వీడియోలో చరణ్ కండలు తిరిగిన దేహంతో, గద పట్టుకుని ఒక పక్కా పహిల్వాన్‌లా కనిపించడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అయోమయానికి గురవుతున్నారు. అసలు ఈ సినిమా ఏ క్రీడ చుట్టూ తిరుగుతుందనే సందేహం ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ విషయంలో చాలా తెలివిగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమాలో చరణ్ పాత్ర ఒక ‘ఆట కూలి’ అని సమాచారం. అంటే కేవలం ఒకే ఆటకు పరిమితం కాకుండా, డబ్బుల కోసం ప్రాణాలకు తెగించి ఏ ఆట ఆడటానికైనా సిద్ధపడే మొండి ఘటం అన్నమాట. అందుకే ఒకవైపు క్రికెట్ ఆడుతూనే, మరోవైపు కుస్తీ పోటీల్లోకి కూడా దిగుతుంటాడు. ఇలా అన్ని ఆటల్లోనూ దూరి చరణ్ ఏం సాధించాలనుకుంటున్నాడు? ఆ క్యారెక్టర్‌కు అంత డబ్బు ఎందుకు అవసరం పడింది? అనే అంశాలే ఈ సినిమాకు అసలు సిసలైన ఎమోషనల్ పాయింట్స్ కానున్నాయి.
ఈ గ్లింప్స్‌లో చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూస్తుంటే ఆ పాత్రలో ఎంత ధైర్యం ఉందో అర్థమవుతోంది. ఒక స్పోర్ట్స్ పర్సన్ కంటే కూడా, కష్టాల్లో ఉన్న ఒక యోధుడిలా అతని లుక్ ఉంది. కేవలం ఒక క్రీడ మీద సినిమా తీస్తే ఉండే పరిమితులను దాటి, ఇలా మల్టీ స్పోర్ట్స్ ఎలిమెంట్‌ను జోడించడం వల్ల కథలో వైవిధ్యం పెరిగే అవకాశం ఉంది. సినిమా యూనిట్ ఇప్పటివరకు క్రికెట్ మీదనే హైప్ క్రియేట్ చేసి, సడన్‌గా కుస్తీ పాయింట్‌ను బయటపెట్టడం ద్వారా ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచింది.
ఒక సామాన్యమైన వ్యక్తి తన అవసరాల కోసం ఎన్ని రకాలుగా పోరాడతాడో ఈ సినిమాలో పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారని తెలుస్తోంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో ఉండటంతో, వారి పాత్రలు ఈ ఆట కూలి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయనేది ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా, బుచ్చిబాబు తన స్ట్రాటజీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒకే సినిమాలో ఇన్ని రకాల యాక్షన్ ఎమోషన్స్ ఉండటం సినిమాకు అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. చరణ్ తన కెరీర్‌లో చేస్తున్న అత్యంత వైవిధ్యమైన పాత్రగా ‘పెద్ది’ నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు చరణ్ ఇన్ని ఆటలు ఎందుకు ఆడాల్సి వచ్చిందో, లక్ష్యం ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 30న థియేటర్లలో బొమ్మ పడేవరకు ఆగాల్సిందే.