బిగ్ ఛాన్సుల కోసం వెయిటింగ్.. రీల్ తో అట్రాక్ట్ చేసినట్లేనా?
ఒకప్పుడు ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఒకప్పుడు ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి కారణం సినిమా కాదు. 1930ల కాలం నాటి యువతిలా కనిపించే వింటేజ్ లుక్ లో ఆమె రిలీజ్ చేసిన ఇన్ స్టా రీల్. ఆ వీడియో చూసిన తర్వాత అభిమానుల్లో పాయల్ కేవలం ట్రెండింగ్ కోసం రీల్ చేశారా? లేక తనలోని మరో యాంగిల్ ను ఇండస్ట్రీకి చూపించే ప్రయత్నమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు పాయల్ అంటే ఇప్పటికీ ఆర్ ఎక్స్ 100 హీరోయిన్‌గానే గుర్తుంటుంది. తొలి సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఆమె కెరీర్ అనుకున్న స్థాయిలో పరుగులు పెట్టలేదు. వెంకీ మామ, డిస్కో రాజా వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు మాత్రం దక్కలేదు. దీంతో పాయల్ జర్నీ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ స్టోరీలు, ప్రయోగాత్మక పాత్రల వైపే మళ్లింది.
ఇటీవల మంగళవారం సినిమాతో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో గ్లామర్ కంటే నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అదే సమయంలో పాయల్ కూడా తనకు యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలపై ఆసక్తి ఎక్కువగా ఉందని పలు సందర్భాల్లో చెప్పింది. ప్రస్తుతం ఆమె చేతిలో వెంకటలచిమ్మి వంటి లేడీ ఓరియంటెడ్ మూవీ ఉంది. అలాగే లీడర్ వంటి ప్రాజెక్టుల్లోనూ నటిస్తోంది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం పాయల్ ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే ఉంది. తాజాగా వైరల్ అవుతున్న వింటేజ్ రీల్ కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది. 1930ల కాలం నాటి అమ్మాయిలా కనిపించేలా చేసిన స్టైలింగ్, హెయిర్ డిజైన్, కాస్ట్యూమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాధారణంగా గ్లామర్ ఫొటోలతో కనిపించే పాయల్.. ఈసారి క్లాసిక్ లుక్ లో కనిపించడంతో నెటిజన్లు కూడా ఆసక్తిగా రెస్పాండ్ అవుతున్నారు.
ఇండస్ట్రీలో ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉంది. ప్రతి శుక్రవారం కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. ఇలాంటి సమయంలో నటీమణులు సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే పాయల్ వింటేజ్ రీల్ ఒక తెలివైన ప్రయత్నంగా కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు, గతంలో అవకాశాల విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా పాయల్ బహిరంగంగానే మాట్లాడింది.
టాలెంట్ ఉన్నా పెద్ద ఛాన్సులు అందరికీ ఒకేలా రావని, తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా కెరీర్ లో ముందుకు వెళ్తోంది. ఏదేమైనా పాయల్ వింటేజ్ రీల్ కేవలం ఒక సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే కాదు.. నటిగా తనలోని మరో యాంగిల్ ను గుర్తు చేసే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ఇక ఆ అట్రాక్టివ్ ప్రెజెన్స్ ఆమెకు మరోసారి పెద్ద ఛాన్సులు తీసుకొస్తుందా? లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం వింటేజ్ లుక్ రీల్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.