నెలకు రూ.12 వేలు.. ఆ ఫ్యామిలీకి అండగా పవన్..

సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా తన పవర్ ఏంటో చూపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటు సీనియర్ హీరోగా.. ఇటు ఏపీ డిప్యూటీ సీఎంగా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు.;

Update: 2026-02-15 13:06 GMT

సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా తన పవర్ ఏంటో చూపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటు సీనియర్ హీరోగా.. ఇటు ఏపీ డిప్యూటీ సీఎంగా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. రెండు రంగాల్లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే పవన్ మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు అవసరం ఉన్న వారికి సహాయం చేస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.

అందుకు సంబంధించిన పలు విషయాలు ఇప్పటికే బయటకు రాగా.. ఇప్పుడు మరో రెండు సంఘటనలు ఆయన మానవత్వంపై మరిన్ని ప్రశంసలు కురిపించేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, ప్రస్తుతం 48 మంది అనాథ పిల్లలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సంరక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పిల్లలందరికీ ఆయన తన సొంత జీతం నుంచే ప్రతినెల రూ.5,000 చొప్పున నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారట.

కేవలం డబ్బు సహాయం మాత్రమే కాకుండా, కొందరికి నివాస సదుపాయాలు కల్పించడం, వారి చదువు పూర్తయ్యే వరకు అన్ని విధాలా అండగా నిలవడం వంటి బాధ్యతలను పవన్ తీసుకున్నారు. కేవలం ఒక లీడర్ గా కాకుండా.. పేరెంట్ గా నిలుస్తారని చెప్పాలి. ముఖ్యంగా వాటి భవిష్యత్తుపై నమ్మకం కల్పించడం ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది. దీంతో అనాథల జీవితాల్లో వెలుగు నింపుతున్న పవన్ పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ చంద్ర తాజాగా మరో విషయాన్ని పంచుకున్నారు. ఇటీవల కాకినాడలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక డ్రైవర్ తనను కలిసినట్టు సోషల్ మీడియాలో తెలిపారు. ఆ డ్రైవర్ కుమార్తె అరుదైన వ్యాధితో బాధపడుతోందని, 50 లక్షల్లో ఒకరికి మాత్రమే వచ్చే సమస్య అని వివరించారు. చికిత్స కోసం ఎన్నో చోట్ల సహాయం కోరినా ఫలితం లేకపోయిందట.

చివరికి ఆ తండ్రి ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ ను ఆపి తన కష్టాన్ని వివరించాడట. పరిస్థితిని ఓర్పుగా విన్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. ఆ చిన్నారిని హైదరాబాద్‌ లోని ఏఐజీ హాస్పిటల్ కు పంపించి వైద్య పరీక్షలు చేయించారు. అంతేకాకుండా, ఆ కుటుంబానికి తన వ్యక్తిగత ఖాతా నుంచే ప్రతినెల రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ చికిత్సకు అండగా నిలుస్తున్నారు.

దీంతో ఆ విషయం తెలిసి.. పవన్ మంచి మనసును వర్ణించలేమని నెటిజన్లు అంటున్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వెంటనే స్పందించడం ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. పదవులు, హోదాలు పక్కన పెట్టి అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం వల్లే ఆయనకు ప్రజల్లో ప్రత్యేక స్థానం ఏర్పడిందని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మానవత్వంతో ప్రజల హృదయాల్లో పవన్ స్థానం సంపాదించుకోవడం మాత్రం విశేషం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని అంతా అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News