పాతాళ భైరవి @75 .. లెజెండరీ ఏఎన్నార్ అలా మిస్!
ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన తోట రాముడు పాత్ర ధైర్య సాహసాలకు మారుపేరు. పేదవాడైన రాముడు రాకుమారి ఇందూమతిని (కె. మాలతి) పెళ్లాడటం కోసం చేసే పోరాటం అద్భుతంగా ఉంటుంది.;
తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జానపద చిత్రం `పాతాళ భైరవి`. ఈ అద్భుత దృశ్యకావ్యం విడుదలై 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ఈ క్లాసిక్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు .. నట శిఖరం ఏఎన్నార్ ఈ అవకాశాన్ని ఎలా మిస్ చేసుకున్నారో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాటి మేధావులు నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన `పాతాళ భైరవి` చిత్రానికి తొలుత హీరోగా అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్)నే కథానాయకుడు అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఏఎన్నార్ గడ్డం పెంచి `సంసారం` అనే సినిమాలో నటిస్తున్నారు. `పాతాళ భైరవి`లోని తోట రాముడు పాత్రకు కండపుష్టి ఉన్న యువకుడు కావాలని దర్శకుడు కేవీ రెడ్డి భావించారు. ఏఎన్నార్ అప్పటికే బిజీగా ఉండటం అలాగే శారీరక దారుఢ్యం విషయంలో `పల్లెటూరి పిల్ల`లో తీరుగ్గా మెరిసిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) అయితే ఈ జానపద వీరుడి పాత్రకు ప్రాణం పోస్తారని దర్శకుడు గట్టిగా నమ్మారు. అలా కేవీ రెడ్డి పట్టుబట్టి మరీ ఎన్టీఆర్‌ను ఎంపిక చేయడంతో ఏఎన్నార్ ఒక గొప్ప క్లాసిక్‌ను మిస్ చేసుకున్నారు. కానీ ఇదే సినిమా ఎన్టీఆర్‌ను తిరుగులేని మాస్ హీరోగా.. జానపద చిత్రాల చక్రవర్తిగా నిలబెడుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ గొప్ప అవకాశాన్ని ఏఎన్నార్ అలా మిస్ చేసుకోవాల్సి వచ్చింది.
75 వసంతాలు.. సాంకేతిక విలువలకు గౌరవం:
1951లో విడుదలైన ఈ సినిమా నేటికీ తెలుగు సినిమాకు ఒక పాఠ్యపుస్తకం లాంటిది. కె.వి. రెడ్డి దర్శకత్వ ప్రతిభకు, పింగళి నాగేంద్రరావు అద్భుతమైన సంభాషణలు, పాటలకు ఈ చిత్రం ఒక నిలువుటద్దం. 75 ఏళ్లు గడుస్తున్నా `సాహసం సేయరా డింభకా`, `నరకానికి నిచ్చెన వేస్తాను` వంటి డైలాగులు నేటికీ తెలుగు ప్రజల నాలుకలపై నానుతూనే ఉన్నాయి. ఘంటసాల సంగీతం, మార్కస్ బార్ట్ లే ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించిన తొలి తెలుగు సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే సోషియో ఫాంటసీ సినిమాలకు `పాతాళ భైరవి` ఒక మార్గదర్శిగా నిలిచింది.
తోట రాముడు వర్సెస్ మాంత్రికుడు:
ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన తోట రాముడు పాత్ర ధైర్య సాహసాలకు మారుపేరు. పేదవాడైన రాముడు రాకుమారి ఇందూమతిని (కె. మాలతి) పెళ్లాడటం కోసం చేసే పోరాటం అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ చిత్రానికి మరో ప్రధాన బలం ఎస్వీ రంగారావు పోషించిన నేపాళ మాంత్రికుడు పాత్ర. క్రూరత్వం, తెలివితేటలు కలగలిసిన ఆ పాత్రలో ఎస్వీఆర్ పరకాయ ప్రవేశం చేశారు. తోట రాముడిని తన మాయాజాలంతో లోబర్చుకోవాలని చూసే మాంత్రికుడి గంభీర స్వరం, హావభావాలు ఇప్పటికీ ప్రేక్షకులను భయపెడుతుంటాయి. అప్పటికే కొన్ని వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న ఎస్వీఆర్ కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. ఇక ఎస్వీఆర్ లోని లెజెండరీ నటుడిని గుర్తించింది మాత్రం కేవీ రెడ్డి. మరో విశేషమేమిటంటే.. `పాతాళ భైరవి` చిత్రంలో బాలకృష్ణ (ఒకప్పటి ప్రముఖ హాస్య నటుడు.. నందమూరి బాలకృష్ణ కాదు) `అంజి` అనే పాత్రలో తోట రాముడి స్నేహితుడిగా నటించి తనదైన హాస్యంతో అలరించారు.
కెరీర్ మలుపులు..
`పాతాళ భైరవి` సినిమా ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో పారితోషికాల సమీకరణాలను కూడా మార్చేసింది. 1951లో `పాతాళ భైరవి` చిత్రంలో నటించినందుకు ఎన్టీఆర్ నెలకు 500 రూపాయల చొప్పున పారితోషికం అందుకున్నారు. ఆ రోజుల్లో విజయా ప్రొడక్షన్స్ సంస్థ నటీనటులను నెలవారీ జీతం ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకునేది. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఆయనకు ఈ జీతం లభించింది. సినిమా అఖండ విజయం సాధించిన తర్వాత ఆనందంతో నిర్మాతలు ఆయనకు అదనంగా కొంత మొత్తాన్ని బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు.
లక్షల్లో పారితోషికానికి పట్టిన సమయం..
ఎన్టీఆర్ తన పారితోషికాన్ని లక్షల్లోకి చేర్చడానికి సుమారు పదేళ్ల కాలం పట్టింది. 1950ల చివరలో 1960ల ప్రారంభంలో ఆయన క్రేజ్ ఆకాశాన్ని తాకింది. మాయాబజార్ (1957) వంటి చిత్రాల తర్వాత ఆయన డిమాండ్ విపరీతంగా పెరిగింది. 1960వ దశకం నాటికి ఆయన ఒక్కో సినిమాకు లక్ష రూపాయలకు పైగా పారితోషికం వసూలు చేసే స్థాయికి చేరుకున్నారు. అప్పట్లో ఒక నటుడు లక్ష రూపాయల పారితోషికం అందుకోవడం అనేది ఒక సంచలనం. ఈరోజుల్లో 10 కోట్లు అంతకుమించిన పారితోషికానికి ఇది సమానంగా చూడొచ్చు.
ఎన్టీఆర్ కోటి రూపాయల పారితోషికం అందుకున్నారా?
ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి నటుడిగా రికార్డు సృష్టించారు. 1990 సమయంలో ఆయన రాజకీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోను ఆయనకు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కోటి మొత్తాన్ని చెల్లించారు. మేజర్ చంద్రకాంత్ (1993) సినిమా కోసం ఎన్టీఆర్ ఒక కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారని అప్పట్లో చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చ జరిగింది. అప్పటి వరకు ఏ దక్షిణాది నటుడు కూడా అందుకోని భారీ మొత్తాన్ని ఆయన అందుకోవడం ద్వారా తన నట సార్వభౌమ హోదాను మరోసారి నిరూపించుకున్నారు. అడవి రాముడు (1977) చిత్రానికి 10-15 లక్షలు అందుకున్నారు.