పంచాయత్ రిటర్న్స్ సీజన్ 5.. అసంతృప్తిలో ఫ్యాన్స్.. కారణం?

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ 'పంచాయత్' ఇప్పుడు ఐదో సీజన్‌కు సిద్ధమైంది.;

Update: 2026-04-04 06:43 GMT

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ 'పంచాయత్' ఇప్పుడు ఐదో సీజన్‌కు సిద్ధమైంది. ఫులేరా గ్రామం, అక్కడి మనుషులు, ఆ సరదా గొడవలతో ఆరేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సిరీస్ కొత్త సీజన్ షూటింగ్ మొదలైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ అప్‌డేట్ ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తున్నా, మరోవైపు ఫ్యాన్స్‌లో కొన్ని సందేహాలను, అసంతృప్తిని కూడా రేకెత్తిస్తోంది. గత సీజన్ల రిజల్ట్ చూశాక, ఈసారి కథ ఎలా ఉండబోతుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..

మళ్ళీ మొదలైన ఫులేరా ప్రయాణం.. షూటింగ్ స్టార్ట్:

పంచాయత్ సీజన్ 5 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన బిహైండ్ ద సీన్స్ ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆరేళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఐదో అడుగు వేయబోతుండటం విశేషం. గతేడాది వచ్చిన నాలుగో సీజన్ ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచే ఐదో సీజన్ కథ మొదలుకానుంది. అభిషేక్ (సచివ్ జీ), ప్రధాన్ జీ, వికాస్ వంటి పాత్రలు మళ్లీ మనల్ని పలకరించబోతున్నాయి. ఈ అప్‌డేట్ చూసిన అభిమానులు తమ ఫేవరెట్ క్యారెక్టర్లను మళ్లీ చూడబోతున్నందుకు ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నారు.

ట్విస్ట్‌లు ఉన్నాయి కానీ.. ఫ్యాన్స్‌లో భయం ఎందుకు:

గత సీజన్ క్లైమాక్స్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. క్రాంతి దేవి టీమ్ విజయం సాధించడంతో, సచివ్ జీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కొత్త పరిణామాలు సీజన్ 5లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. అయితే, గత రెండు సీజన్ల మీద ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తి ఉంది. మొదటి రెండు సీజన్లు ఇచ్చినంత ఎమోషన్, డెప్త్.. మూడు, నాలుగు సీజన్లలో కనిపించలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కథలో మునుపటి అంత పట్టు లేకపోవడం వల్లే ఫ్యాన్స్ ఈ కొత్త సీజన్ గురించి కాస్త ఆందోళన చెందుతున్నారు.

బోర్ కొడుతున్న కథ.. ముగించేస్తే బెటర్:

ఒకప్పుడు స్వచ్ఛమైన పల్లెటూరి కథగా మొదలైన ఈ సిరీస్, ఇప్పుడు కేవలం రాజకీయ గొడవలు, గ్రూపు తగాదాల చుట్టూనే తిరుగుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఫులేరా గ్రామంలోని ఆ పాత ఫ్రెష్‌నెస్ ఇప్పుడు కనిపించడం లేదని, కథ సాగతీతగా అనిపిస్తోందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కథను ఇలాగే లాగుతూ వెళ్లే బదులు, సీజన్ 5తో దీన్ని గౌరవప్రదంగా ముగించేస్తే బాగుంటుందని ఒక సెక్షన్ ఆడియన్స్ మేకర్స్‌కు సలహాలు ఇస్తున్నారు. ఇక అదే సీన్లను పదే పదే చూపిస్తే షో పాపులారిటీ తగ్గే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

సీజన్ 5 మీద ఉన్న ఆశలు.. సచివ్ జీ కమ్ బ్యాక్:

నెగటివ్ కామెంట్స్ ఉన్నప్పటికీ, నాలుగో సీజన్‌లోని కామెడీని కొందరు మెచ్చుకున్నారు. ఫులేరాలో ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది కాబట్టి, సచివ్ జీ ఎలా నెట్టుకొస్తాడనేది ఆసక్తికరంగా మారనుంది. కొత్త లీడర్‌షిప్ వల్ల కథలో కొత్తదనం వచ్చే అవకాశం ఉందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పటికీ మోస్ట్ పాపులర్ షోగా ఉన్న పంచాయత్‌కు ఈ ఐదో సీజన్ చాలా కీలకం. ఇక ఈసారి గనుక కథ ఆకట్టుకుంటే ఈ సిరీస్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది, లేదంటే మాత్రం ఫులేరా ప్రయాణానికి పుల్‌స్టాప్ పడక తప్పదు.

Tags:    

Similar News