ఇండస్ట్రీలో ఫేక్ ప్రమోషన్స్ - వ్యూస్ హవా!

ఒక‌ప్పుడు సినిమా హిట్ అయిందంటే? ఆ చిత్రం వంద రోజులు ఆడేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

Update: 2026-05-28 19:30 GMT

ఒక‌ప్పుడు సినిమా హిట్ అయిందంటే? ఆ చిత్రం వంద రోజులు ఆడేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ఎలా ఉందనే దానికంటే? దానిని సోషల్ మీడియాలో ఎంతలా ఊదరగొడుతున్నారు అనేదే ముఖ్యం అన్నట్లుగా ప్రమోషన్ల పర్వం సాగుతోంది. టాలీవుడ్‌లో ఇప్పుడు సొంత డబ్బా సంస్కృతి విపరీతంగా పెరిగిపోతుంది. సినిమా విడుదలకు ముందే కాదు. విడుదలైన తర్వాత కూడా థియేటర్లలో పరిస్థితితో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో క్రియేట్ చేసే ఆర్టిఫిషియల్ హైప్ చూసి ప్రేక్షకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

ముఖ్యంగా యూట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్ లైక్స్, ఎక్స్ (ట్విట్టర్) ట్రెండ్స్ చుట్టూనే నేడు సినిమా ప్రమోషన్లు తిరుగుతున్నాయి. టీజర్ లేదా ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఇన్ని మిలియన్ల వ్యూస్, అన్ని లక్షల లైక్స్ అంటూ రికార్డుల పోస్టర్లు వచ్చేస్తున్నాయి. అయితే ఈ వ్యూస్‌లో చాలా వరకు పెయిడ్ యాడ్స్ బోట్స్ ద్వారా కృత్రిమంగా కొనుగోలు చేసినవేనని ఇండస్ట్రీ వర్గాలు సైతం బ‌లంగా న‌మ్ముతున్నాయి. ఆర్గానిక్‌గా కాకుండా డబ్బులు పెట్టి వ్యూస్ పెంచుకుంటూ దాన్నే ఓ పెద్ద రికార్డుగా ప్రచారం చేసుకోవడం టాలీవుడ్‌లో ఫ్యాషన్‌గా మారిపోయింది.

ఇక సినిమా విడుదలైన మొదటి రోజు మార్నింగ్ షో పడకముందే బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్ అంటూ భారీ పోస్టర్లు డిజైన్ చేసి వ‌దులుతున్నారు. థియేటర్లు ఖాళీగా ఉన్నా సరే వసూళ్ల లెక్కలను భారీగా పెంచి చూపిస్తూ త్వరితగతిన సక్సెస్ మీట్లు నిర్వహించడం మరీ విడ్డూరంగా మారింది. ఈ విధమైన సెల్ప్ డబ్బా ప్రచారం తాత్కాలికంగా కొంతమందిని నమ్మించగలిగినా? లాంగ్ రన్‌లో సినిమా అసలు రంగును దాచలేకపోతోంది. బాక్సాఫీస్ వద్ద గ్రౌండ్ రియాలిటీలోని వాస్తవ వసూళ్లకు, ప్రచార చిత్రాల్లో మేకర్స్ చూపించే నంబర్లకు అస్సలు పొంతన ఉండటం లేదు.

ఈ ఫేక్ ప్రమోషన్ల హవా వల్ల సాధారణ ప్రేక్షకుడు తీవ్రమైన అయోమయానికి గురవుతున్నాడు. ఆన్‌లైన్ రివ్యూలు, రేటింగులు, పెయిడ్ ట్వీట్లను నమ్మి థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ మోసపోయామని గ్రహిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీ విడుదల చేసే అధికారిక కలెక్షన్ల ప్రకటనలపై ప్రేక్షకులలో నమ్మకం పూర్తిగా సడలిపోతోంది. ప్రేక్షకులు ఇప్పుడు చాలా స్మార్ట్ అయ్యారు. కేవలం పోస్టర్లపై ఉండే నంబర్లను చూసి కాకుండా జెన్యూన్ మౌత్ టాక్ నమ్మకమైన రివ్యూల ఆధారంగానే థియేటర్లకు వెళ్లాలా? లేదా? అన్న‌ది నిర్ణయించుకుంటున్నారు.

మరోవైపు ఈ ఫేక్ ప్రమోషన్ల సంస్కృతి చిన్న సినిమాలకు ,నిజాయితీ గల నిర్మాతలకు పెద్ద శాపంగా మారుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు కోట్లాది రూపాయలు కుమ్మరించి డిజిటల్ స్పేస్‌ను, పబ్లిసిటీ ప్లాట్‌ఫార్మ్స్‌ను ఆక్రమించుకుంటుండటంతో మంచి కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు కనీసం జనాల్లోకి వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. అలాగే ప్రమోషన్ల కోసమే నిర్మాతలు అదనంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం వల్ల సినిమా మేకింగ్ బడ్జెట్ కంటే పబ్లిసిటీ బడ్జెట్ అనవసరంగా పెరిగిపోతోంది. ఇది ఇండస్ట్రీ ఆర్థిక ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

చివ‌రిగా కంటెంట్‌లో దమ్ముంటే ఎలాంటి ఫేక్ ప్రమోషన్లు, ఆర్టిఫిషియల్ వ్యూస్ అవసరం లేకుండానే సినిమాలు క్లాసిక్ హిట్లుగా నిలుస్తాయని టాలీవుడ్ చరిత్రలో ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ఆన్‌లైన్ భ్రమలతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని ఎవరూ కొనలేరు. టాలీవుడ్ మేకర్స్ ఇప్పటికైనా సెల్ప్ డబ్బా ట్రెండ్‌ను పక్కన పెట్టి కథలపై , జెన్యూన్ పబ్లిసిటీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే పరిశ్రమపై ప్రేక్షకులకు గౌరవం నిలబడుతుంది. సినిమా రంగం కూడా ఆరోగ్యకరమైన బాటలో పయనిస్తుంది.

Tags:    

Similar News