OG 2.. 2028 వరకు భారంగా మారుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ సుజీత్ రిలీజ్ చేసిన OG యూనివర్స్ గ్లింప్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2026-09-03 23:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ సుజీత్ రిలీజ్ చేసిన OG యూనివర్స్ గ్లింప్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓజీ రెండో పార్ట్ పై అభిమానుల్లో హైప్ ఉన్న మాట వాస్తవమే. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడే ఇంత భారీ రేంజ్ లో హైప్ పెంచాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్న వినిపిస్తోంది.

వీడియోలో జపాన్ సమురాయ్ విజువల్స్, సుభాష్ చంద్రబోస్ లింక్, యోధుడి డ్రెస్సింగ్ లో ఓజాస్ గెటప్ వంటి అంశాలను చూపించారు. దీంతో ఓజీ రెండో పార్ట్ మరింత గ్రాండ్ గా ఉండబోతోందనే సిగ్నల్స్ ఇచ్చారు. అయితే ఇంత ముందుగానే ఓజీ 2పై భారీ అంచనాలు పెంచడం అవసరమా? అనే ప్రశ్న సినీ ప్రియుల్లో మొదలైంది. ఎందుకంటే మూవీ వెంటనే సెట్స్‌ పైకి వెళ్లే పరిస్థితి లేదు.

సుజీత్ ముందుగా నానితో చేయాల్సిన ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఓజీ 2పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరోవైపు పవన్ రాజకీయ బాధ్యతల్లోనూ బిజీగా ఉన్నారు. దీంతో షూటింగ్, హీరో డేట్స్, నిర్మాణం వంటి అంశాలన్నీ కలిపి చూస్తే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇప్పుడే ఒక భారీ యూనివర్స్ వీడియోతో అంచనాలను పెంచితే.. ఆ హైప్‌ ను అంత కాలం కొనసాగించడం మేకర్స్‌ కు సవాలుగా మారొచ్చు.

సాధారణంగా ఒక భారీ అప్డేట్ వచ్చిన తర్వాత అభిమానులు వెంటనే మరిన్ని ఇన్ఫో, గ్లింప్స్, ఫస్ట్ లుక్, షూటింగ్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తారు. కానీ సినిమా రావడానికి చాలా సమయం ఉంటే మధ్యలో వచ్చే గ్యాప్ ఆసక్తిపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. మరోవైపు పవన్ అభిమానులు ఓజీ 2 కోసం ఎదురుచూడటం నిజమే. కానీ ఇప్పుడు తప్పనిసరిగా భారీ అప్డేట్ ఇవ్వాల్సిందే అన్న పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా అదే సమయంలో పవన్ పాత సినిమా పంజా రీ-రిలీజ్‌ తో అభిమానులు ఇప్పటికే సెలబ్రేషన్ మూడ్‌ లో ఉన్నారు. థియేటర్లలో పవన్ అభిమానుల సందడి కనిపించింది. దీంతో ఆ రోజు ఓజీ 2 నుంచి అప్డేట్ రాకపోయినా అభిమానుల ఆసక్తికి పెద్దగా నష్టం ఉండేది కాదనే వాదన వినిపిస్తోంది. అయితే టీమ్ మాత్రం పుట్టినరోజును ఓజీ 2 హైప్‌ కు ఉపయోగించుకోవాలని భావించింది. అందుకే నార్మల్ అప్డేట్‌ కు బదులుగా ఓజీ యూనివర్స్‌ ను పరిచయం చేసే స్థాయిలో వీడియోను రూపొందించింది. కానీ ఫుల్ గా వర్కౌట్ అయిందని చెప్పలేం.

అందుకే ఓజీ 2 విషయంలో ఇకపై ఒక్కసారిగా హైప్ పెంచడం కంటే.. నెమ్మదిగా అప్డేట్లు ఇవ్వడం మేకర్స్‌ కు మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సెట్స్‌ పైకి వచ్చిన తర్వాత క్వాలిటీ కంటెంట్‌ ను విడుదల చేస్తే ప్రతి అప్డేట్‌ కు స్పెషాలిటీ ఉంటుంది. చివరగా ఓజీ 2పై ఆసక్తి లేదనేది విషయం కాదు.. చాలా ముందుగానే ఆ హైప్ ను పీక్‌ కు తీసుకెళ్లి, సినిమా వచ్చే వరకు దాన్ని అలాగే కొనసాగించగలరా? అనేదే అసలు ప్రశ్న.

Tags:    

Similar News