ఎన్టీఆర్ స్పీచ్‌లో 'డ్రాగన్' అప్‌డేట్ ఉండేనా?
కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల సినిమా రెండు మూడు నెలలు షూటింగ్ నిలిచి పోయింది. దాంతో సినిమా విడుదల విషయమై గందరగోళం నెలకొంది.
'దేవర', 'వార్ 2' సినిమాలతో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌ను పూర్తి స్థాయిలో సంతృప్తి పర్చలేక పోయాడు. కానీ త్వరలో రాబోతున్న 'డ్రాగన్' సినిమాతో గత చిత్రాల లోటును కలుపుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ హిట్స్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా వస్తుందంటూ షూటింగ్ ప్రారంభించిన సమయంలో ప్రశాంత్ నీల్ ప్రకటించాడు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల సినిమా రెండు మూడు నెలలు షూటింగ్ నిలిచి పోయింది. దాంతో సినిమా విడుదల విషయమై గందరగోళం నెలకొంది. డ్రాగన్ మూవీ ఎప్పుడు అనే విషయమై క్లారిటీ లేదు.
ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ జంటగా డ్రాగన్...
ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ జంటగా నటిస్తున్న 'డ్రాగన్' సినిమాకు రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. జూన్ 11, 2027 అనే డేట్ ప్రచారంలో ఉంది, కానీ ఆ తేదీకి అయినా డ్రాగన్ వస్తాడా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఆ స్పష్టతను ఎన్టీఆర్ నేడు జరగబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చే అవకాశం ఉందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి అభిమానులు భారీ ఎత్తున హాజరు కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అందరి దృష్టి ఉంది. ఎన్టీఆర్ ఇలా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా, అభిమానుల సమక్షంలోకి రావడం చాలా రోజుల తర్వాత ఇదే కావడం వల్ల ఏం మాట్లాడుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ...
ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాను రాజమౌళి సమర్పిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాను ఆర్కా మీడియా సంస్థతో కలిసి రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ నిర్మించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. కార్తికేయ ఏకంగా వారణాసి సినిమా పనులను వారం పది రోజులు పక్కకు పెట్టి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. నేడు జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌తో పాటు రాజమౌళి సైతం పాల్గొనబోతున్నాడు. రాజమౌళి ఫ్యామిలీ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాబోతున్నాడు. ఎన్టీఆర్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ కి హాజరు అవుతున్నప్పటికీ అంతా కూడా డ్రాగన్ సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రాజమౌళి సమర్పణలో...
ఇప్పటికే చేసిన ప్రమోషన్‌తో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. పైగా రాజమౌళి సమర్పణ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ముఖ్య అథితిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 2న ఈ సినిమాను సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా గురించి ఎన్టీఆర్ ఏం మాట్లాడుతాడు, అలాగే తన డ్రాగన్ సినిమా గురించి ఎలా స్పందిస్తాడు అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. చాలా రోజులుగా డ్రాగన్ అప్‌డేట్ ను ఇవ్వలేదు. కనీసం చిన్న పోస్టర్ సైతం మేకర్స్ నుంచి రాలేదు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ అభిమానుల ముందుకు రాబోతున్నాడు కనుక కచ్చితంగా డ్రాగన్ నుంచి ఏదో ఒక అప్డేట్ అయినా ఇవ్వాలంటే ఫ్యాన్స్ అరిచే అవకాశం ఉంది, అప్పుడు ఎన్టీఆర్ చిన్న అప్డేట్ అయినా ఇచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి ఎన్టీఆర్ డ్రాగన్ గురించి కాస్త అయినా నోరు విప్పేనా చూడాలి.