ఇన్నాళ్లు కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు!

ఇన్నాళ్లు తమిళ సినిమాటోగ్రాఫర్లు తెలుగు స్టార్ హీరోల సినిమాలకు పని చేయడం ఎక్కువగా కనిపించగా, ఇప్పుడు పరిస్థితి తిరుగుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Update: 2026-06-27 05:12 GMT

ఒకప్పుడు భారీ తెలుగు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ ఎంపిక అంటే ముందుగా తమిళ చిత్రసీమ వైపే చూపు వెళ్లేది. విజువల్ గ్రాండియర్‌కు పేరుగాంచిన కోలీవుడ్ సినిమాటోగ్రాఫర్లు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకోవడం సాధారణంగా కనిపించేది. అయితే ఇప్పుడు ఆ దృశ్యం క్రమంగా మారుతోంది. తెలుగు టెక్నీషియన్లు కూడా తమ టాలెంట్ తో ఇతర భాషల స్టార్ ప్రాజెక్టుల్లో చోటు దక్కించుకుంటుండగా, తాజాగా సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి పేరు ఆ లిస్ట్ లో ప్రత్యేకంగా నిలుస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ధర్మన్ కు నికేత్ సినిమాటోగ్రాఫ‌ర్ గా ఎంపిక కావడం కేవలం మరో అవకాశం మాత్రమే కాదు, తెలుగు టెక్నికల్ టాలెంట్‌కు దక్కుతున్న గుర్తింపుగా కూడా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లు తమిళ సినిమాటోగ్రాఫర్లు తెలుగు స్టార్ హీరోల సినిమాలకు పని చేయడం ఎక్కువగా కనిపించగా, ఇప్పుడు పరిస్థితి తిరుగుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భాష, ప్రాంతం కంటే టాలెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న కొత్త ట్రెండ్‌కు ఈ ఎంపిక మరో ఉదాహరణగా మారింది.

నికేత్ బొమ్మి జ‌ర్నీ కూడా ఆసక్తికరంగానే సాగింది. షార్ట్ ఫిలిమ్స్ ప్రపంచంలో తన విజువల్ సెన్స్‌ను నిరూపించుకున్న ఆయన, తర్వాత ఫీచర్ ఫిలిమ్స్‌లో అడుగుపెట్టి క్రమంగా తనదైన గుర్తింపును సంపాదించారు. భారీ సెట్లు, కృత్రిమ విజువల్స్ కంటే కథకు అనుగుణంగా సహజమైన ఫ్రేమింగ్, ఎమోష‌న్స్ ను ప్రతిబింబించే లైటింగ్, విజువల్ టోన్‌పై ఆయన చూపే శ్రద్ధ ప్రత్యేకంగా నిలిచింది. అదే శైలి ఆయనను తెలుగు సినిమాల నుంచి కోలీవుడ్ వరకు తీసుకెళ్లిందని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తమిళంలో చేసిన సినిమాల ద్వారా నికేత్ టాలెంట్ ను బాగా దగ్గరగా గమనించిన డైరెక్ట‌ర్ అశ్వత్ మారిముత్తు, స్టార్ హీరో సినిమా కోసం పెద్ద పేరున్న సినిమాటోగ్రాఫర్‌ను వెతకకుండా మరోసారి తన నమ్మకాన్ని నికేత్‌పైనే ఉంచారు. ఇద్దరి మధ్య ఏర్పడిన క్రియేటివ్ అండర్‌స్టాండింగ్‌నే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గతంలో డ్రాగ‌న్ సినిమాకు కలిసి పనిచేసిన అనుభవం, విజువల్ లాంగ్వేజ్‌పై ఇద్దరికీ ఉన్న అవగాహన ఈ కొత్త ప్రాజెక్టులో కూడా కొనసాగనుంది.

ఇటీవలి కాలంలో భారతీయ సినీ పరిశ్రమలో టెక్నీషియన్ల ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రాంతీయ గుర్తింపుకు ప్రాధాన్యం ఉండగా, ఇప్పుడు డైరెక్ట‌ర్లు తమ కథకు సరిపోయే విజువల్ స్టైల్‌ను అందించగల వ్యక్తినే ఎంపిక చేస్తున్నారు. హీరోలు, డైరెక్ట‌ర్ల‌ మాదిరిగానే సినిమాటోగ్రాఫర్లు, మ్యూజిక్ డైరెక్ట‌ర్లు, ఎడిటర్లు కూడా భాషల హద్దులు దాటి పని చేయడం సాధారణంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో రజినీకాంత్ వంటి స్టార్ హీరో సినిమాలో నికేత్ బొమ్మికి అవకాశం రావడం ఆయన ప‌ర్స‌న‌ల్ కెరీర్‌కు మాత్రమే కాకుండా, తెలుగు టెక్నీషియన్ల సామర్థ్యంపై దేశవ్యాప్తంగా పెరుగుతున్న నమ్మకానికి కూడా నిదర్శనంగా చెప్పవచ్చు. ధర్మన్ విజువల్స్ అంచనాలకు తగ్గట్టుగా నిలిస్తే, నికేత్ బొమ్మి పేరు సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో మోస్ట్ వాంటెడ్ సినిమాటోగ్రాఫర్ల లిస్ట్ లో చేరడం ఆశ్చర్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News