మ‌ళ్లీ పెళ్లి క‌చ్చితంగా..కానీ అప్పుడే కాదు!

మెగా డాటర్ నటి నిహారిక కొణిదెల వైవాహిక జీవితం గురించి తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో వివాహ బంధం ముగిసిన తర్వాత? నిహారిక‌ పూర్తి దృష్టిని కెరీర్‌పై మళ్లించి నిర్మాతగా బిజీ అయింది.;

Update: 2026-03-23 07:45 GMT

మెగా డాటర్ నటి నిహారిక కొణిదెల వైవాహిక జీవితం గురించి తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో వివాహ బంధం ముగిసిన తర్వాత? నిహారిక‌ పూర్తి దృష్టిని కెరీర్‌పై మళ్లించి నిర్మాతగా బిజీ అయింది. వెబ్ సిరీస్ నిర్మాణంతో పాటు సినిమాల‌ను యాక్టివ్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. య‌ధావిధిగా బుల్లి తెర ఎంట‌ర్ టైన్ మెంట్ షోల్లోనూ పాల్గొంటుంది.

అయితే నిహారిక రెండ‌వ పెళ్లి నెట్టింట చ‌ర్చ అంతే కామన్ గా మారింది. ఈ నేప‌థ్యంలో తాజాగా పెళ్లి గురించి వ‌స్తోన్న‌ వార్తలపై స్పందించింది. `భవిష్యత్తులో మళ్లీ పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ అప్పుడే కాదు` అని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి తన ప్రాధాన్యత కేవలం సినిమా నిర్మాణం ,నటనపైనే ఉందని నిహారిక తెలిపారు. `ప్రతి ఒక్కరూ పెళ్లి అనేది జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మనం ఊహించినట్లు ఉండవని` తన గత అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయని, ప్రస్తుతానికి తాను ఆ చాప్టర్ నుంచి బయటపడి కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకునే పనిలో ఉన్నానని పేర్కొన్నారు.

`పిల్లలను కనాలనే కోరిక తనకు ఉందని, దాని కోసం పెళ్లి అనేది తప్పనిసరి అని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఆ సమయం ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడే చెప్పలేనని కాలమే అన్ని నిర్ణయిస్తుంది` అని ఆసక్తికర సమాధానమిచ్చారు.

సరైన వ్యక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వైవాహిక బంధంలోకి అడుగుపెడతానని హింట్ ఇచ్చారు. అలాగే ఇంట్లో తన నిర్ణయాలకు తండ్రి నాగబాబు, అన్నయ్య వరుణ్ తేజ్ పూర్తి మద్దతు ఇస్తారని నిహారిక చెప్పుకొచ్చారు. అన్నయ్య వరుణ్ తేజ్, వదిన లావణ్య త్రిపాఠిల వివాహ బంధాన్ని చూస్తుంటే సంతోషంగా ఉంటుందన్నారు. తన విషయంలో కూడా అంతా మంచే జరుగుతుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాను పెద్దగా పట్టించుకోనని, తన వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తానని ధీటుగా సమాధానమిచ్చారు.

నిర్మాతగా `కమిటీ కుర్రోళ్లు` చిత్రంతో నిహారిక మంచి విజయాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం `రాకాస` అనే హారర్ కామెడీ సినిమాతో ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఆమె తన మనసులోని మాటను బయటపెట్టడం మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కెరీర్ పరంగా సక్సెస్ అవుతున్న నిహారిక, వ్యక్తిగత జీవితంలో కూడా త్వరలోనే స్థిరపడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News