అంజి మూవీ నుంచి అందుకే తీసేశారు!

మెగా డాట‌ర్ గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-03-26 16:58 GMT

మెగా డాట‌ర్ గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు లాంటి ప్రాజెక్ట్‌తో స‌క్సెస్‌ అందుకున్న నిహారిక, ఇప్పుడు రాకాస అనే కొత్త సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతుంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి సినీ అనుభవం గురించి నిహారిక చెప్పిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అంజి సినిమాలో న‌టించా!

నిహారిక‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం దక్కింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ ఫాంటసీ మూవీ అంజిలో తాను కూడా ఒక చిన్న పాత్రలో కనిపించాల్సి ఉందని వెల్లడించింది. ఈ సినిమాలో పలువురు చైల్డ్ ఆర్టిస్టులు నటించిన సంగతి తెలిసిందే. వారిలో నిహారిక కూడా ఒకరిగా ఎంపికై, కొద్ది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నట్లు నిహారిక రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది.

క‌థ‌లో మార్పుల వ‌ల్లే తీసేశారు

అయితే, షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత కథలో మార్పులు రావడంతో ఆమె పాత్రను పూర్తిగా తొలగించినట్లు నిహారిక వివరించింది. స్టోరీ డెవలప్ అవుతున్న సమయంలో, డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ టీమ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంద‌ని, అందులో భాగంగానే ఆర్టిస్టులు చాలా మంది మారిపోయార‌ని, ముఖ్యంగా సినిమాలో కనిపించే పిల్లల పాత్రలకు కొంచెం పెద్ద వయస్సు ఉండాలని, అలాగే డైలాగ్స్ చెప్పగలగాల‌ని డిసైడ్ అయ్యార‌ని, కానీ ఆ టైమ్ లో తాను చాలా చిన్న అమ్మాయి అవ‌డం వ‌ల్ల త‌న‌కు మాటలు రాలేద‌ని, దీంతో నిహారిక ప్లేస్ లో వేరే అమ్మాయిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

ఆ ఫుటేజ్ కోసం అడుగూతూనే ఉంటా

ఈ విషయాన్ని నిహారిక ఎంతో సరదాగా, ఒకింత ఎమోష‌న‌ల్ అవుతూ గుర్తు చేసుకుంది. ఆ సినిమా ఫుటేజ్ ని అయినా ఇవ్వ‌మ‌ని ప్రొడ్యూస‌ర్ శ్యామ్ ప్ర‌సాద్ అంకుల్ ని ఎన్నో సార్లు అడిగాన‌ని, కానీ అది దొర‌క‌లేద‌ని నిహారిక వెల్ల‌డించింది. ఈ ఎక్స్‌పీరియెన్స్ తనకు నిరాశ కలిగించినప్పటికీ, అదే సమయంలో సినిమా రంగంపై ఆసక్తిని మరింత పెంచిందని నిహారిక తెలిపింది. చిన్న వయస్సులోనే వచ్చిన ఈ అనుభవం, తర్వాత తన కెరీర్ ఎంపికలపై కూడా ప్రభావం చూపిందని ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొత్త కంటెంట్‌ను అందించడానికి కృషి చేస్తున్న నిహారిక, త్వ‌ర‌లోనే రాకాస అనే సినిమాతో నిర్మాత‌గా త‌న అదృష్టాన్ని మ‌రోసారి టెస్ట్ చేసుకోబోతుంది.

Tags:    

Similar News