స్టార్ హీరోలను కడిగేసిన ట్రాన్స్ జెండర్!
అయితే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఒక క్లిష్ట దశలో ఉన్నప్పుడు ఆ పాత్రల ద్వారా లబ్ధి పొందిన హీరోలు కనీసం మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని నేఘా ఆవేదన చెందారు.;
ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త, నటి నేఘా షాహిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) సవరణ బిల్లు, 2026 ను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు కేవలం కాగితాలకే పరిమితమని, ఇది ట్రాన్స్‌జెండర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలోని అగ్ర హీరోలపై ఆమె విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, రాఘవ లారెన్స్, మరియు కాళిదాస్ జయరామ్ లపై నేఘా మండిపడ్డారు.
వీరంతా వెండితెరపై ట్రాన్స్‌జెండర్ పాత్రలు పోషించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. `సినిమాల్లో మా పాత్రలను పోషించి మీరు అవార్డులు, రివార్డులు ,కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు అందుకున్నారు. కానీ నిజ జీవితంలో మా హక్కుల కోసం పోరాటం జరుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు? అంటూ వారిని నిలదీశారు. విజయ్ సేతుపతి `సూపర్ డీలక్స్` లో శిల్ప అనే పాత్రతో మెప్పించారని, రాఘవ లారెన్స్ `కాంచన` లో మాస్ ఆడియన్స్‌ను అలరించారని, అలాగే కాళిదాస్ జయరామ్ `పావ కదైగల్` లో భావోద్వేగపూరితమైన నటన కనబరిచారని పేర్కొన్నారు.
ఆ పాత్రల వల్ల వారికి వచ్చిన క్రేజ్ సామాన్యమైంది కాదు. అయితే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఒక క్లిష్ట దశలో ఉన్నప్పుడు ఆ పాత్రల ద్వారా లబ్ధి పొందిన హీరోలు కనీసం మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని నేఘా ఆవేదన చెందారు. `మీరు కేవలం తెరపైనే హీరోలా? నిజ జీవితంలో మా సమస్యలు మీకు పట్టవా? అని నేఘా ప్రశ్నించారు. కేవలం మేకప్ వేసుకుని మాలా నటించినంత మాత్రాన మా కష్టాలు మీకు అర్థం కావు అని, కనీసం సాటి మనుషులుగా మా ఆవేదనను గుర్తించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తాలని ఆమె డిమాండ్ చేశారు.సినిమాల్లో చూపించే సానుభూతి నిజ జీవితంలో కూడా ఉండాలని ఆమె హితవు పలికారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ప్రకారం ఒక వ్యక్తి యొక్క లింగాన్ని నిర్ణయించే అధికారం మెడికల్ బోర్డుకు ఇవ్వడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని నేఘా వాదిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన అంశంపై సెలబ్రిటీలు స్పందిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని కానీ స్టార్ హీరోలు తమ ఇమేజ్ దెబ్బతింటుందని భయపడుతున్నారా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. నేఘా షాహిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోలు కేవలం తమ స్వలాభం కోసం ట్రాన్స్ పాత్రలను వాడుకుంటున్నారా అనే చర్చ మొదలైంది. మరి ఇప్పటికైనా హిజ్రా పాత్రలు పోషించిన నటులు స్పందిస్తారేమో చూడాలి.