బాలయ్య ముంబైలో ఏం చేస్తున్నారు?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరసింహారెడ్డి మూవీ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, కొత్త షెడ్యూల్ కోసం మూవీ టీమ్ ముంబైకి వెళ్లినట్లు సమాచారం.
ఇటీవల హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన మూవీ టీమ్.. ఇప్పుడు ముంబైలో నెక్స్ట్ లాంగ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. అక్కడ బాలకృష్ణపై పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో బాలయ్యను పూర్తి భిన్నమైన గ్యాంగ్ స్టర్ లుక్ లో చూపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఆయనను ఓ పవర్ ఫుల్ రాజు గెటప్ లో చూపించడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇక సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అంశం పీరియాడిక్ యాక్షన్ ఎపిసోడ్. త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యాసివ్ వార్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందుకోసం కోట్ల రూపాయల వ్యయంతో కోటను తలపించే భారీ సెట్ నిర్మిస్తున్నారట. ఆ యుద్ధ సన్నివేశాల్లో బాలకృష్ణ లుక్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. అభిమానులకు థియేటర్లలో మాస్ ఫీస్ట్ ఇచ్చేలా ఆ ఎపిసోడ్ ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక సినిమాలో మరో పెద్ద హైలైట్ గా నటుడు మంచు మనోజ్ నిలుస్తారని వినికిడి. రీసెంట్ గా ఆ మూవీలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పవర్ ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్. దీంతో బాలయ్య-మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరిలో బాలయ్యతో కలిసి నటించిన కాజల్ కు ఇది రెండో సినిమా.
మొదట ఆ ప్రాజెక్ట్ లో నయనతార పేరు వినిపించినప్పటికీ, కథలో మార్పుల కారణంగా చివరకు కాజల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. భారీ మాస్ బీట్స్, ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మూవీని మరో రేంజ్ కు తీసుకెళ్లేలా తమన్ పనిచేస్తున్నారని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా, జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తారా? లేక పవర్ ఫుల్ డైలాగ్ తో కూడిన టీజర్ ను తీసుకురానున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యాక్షన్, ఎమోషన్, భారీ విజువల్స్ తో రూపొందుతున్న NBK111 బాలయ్య కెరీర్ లో మరో మాస్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.