టాలీవుడ్ జర్నీపై నాని మనసులో మాట!
నేచురల్ స్టార్ నాని సినీ ప్రయాణం మొదలై దాదాపు 18 ఏళ్లు పూర్తవుతోంది.
నేచురల్ స్టార్ నాని సినీ ప్రయాణం మొదలై దాదాపు 18 ఏళ్లు పూర్తవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, తన సహజసిద్ధమైన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకుని నేడు టాలీవుడ్‌లో అత్యంత నమ్మకమైన నటులలో ఒకరిగా ఎదిగారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, భారీ విజయాలు సాధించినప్పటికీ, ఇప్పటికీ అంతే నిరాడంబరంగా ఉండే నాని కెరీర్, వ్యక్తిగత జీవితం , స్టార్‌డమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `సినిమా నా జీవితాన్ని మార్చేసింది. కానీ ఒక మనిషిగా నన్ను మాత్రం మార్చలేదు` అని పేర్కొన్నారు.
తన తొలి చిత్రం `అష్టా చమ్మా` నాటి రోజులను గర్తు చేసుకున్నారు. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుందని తాను అప్పట్లో అస్సలు ఊహించలేదని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన తాను సరదా కోసం, భవిష్య త్తులో జ్ఞాపకంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ సినిమాలో నటించానన్నారు. అయితే ఐదారు సినిమాలు పూర్తయ్యాకనే నటన అనేది తన జీవితంలో ఒక భాగమని, తాను ఇందులో రాణించగలనని గ్రహించినట్లు వెల్లడించారు.
పరిశ్రమలో ఏదో ఒక నిర్దిష్టమైన ఇమేజ్‌కు పరిమితం కాకపోవడమే తన విజయ రహస్యమని నాని పేర్కొన్నారు. ప్రేక్షకులు , దర్శకులు తనను ఒకే రకమైన పాత్రల్లో టైప్‌కాస్ట్ చేయకుండా చూడటం వల్ల విభిన్నమైన కథాంశాలను ఎంచుకునే వీలు కలిగిందన్నారు. `అంటే సుందరానికి`, `జెర్సీ`, `హాయ్ నాన్న` వంటి భావోద్వేగపూరితమైన చిత్రాల నుంచి `దసరా`, `హిట్ 3`, `ది ప్యారడైజ్` వంటి భారీ యాక్షన్ చిత్రాల వరకు అన్ని జోనర్లను ప్రయత్నించడానికే మొగ్గు చూపినట్లు తెలిపారు.
ఇటీవల నాని యాక్షన్ ఆధారిత చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నా? త్వరలోనే మళ్లీ మనసుకు హత్తుకునే సున్నితమైన కుటుంబ కథా చిత్రాలకు తిరిగొస్తానని నాని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `బ్లడీ రోమియో` చిత్రం వినోదం, యాక్షన్ సమ్మేళనంగా స్టైలిష్‌గా ఉంటుందని వివరించారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా? వ్యక్తిగత జీవితానికి , కుటుంబానికి సమాన ప్రాధాన్యం ఇస్తానని నాని తెలిపారు. షూటింగ్ లేని రోజుల్లో కుమారుడు జున్ను స్కూల్ ఈవెంట్స్, పేరెంట్-టీచర్ మీటింగ్‌లలో తప్పకుండా పాల్గొంటానని తెలిపారు. ఎంత స్టార్‌డమ్ వచ్చినా సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతానని నాని పేర్కొన్నారు. మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని అందించడమే నటుడిగా తన లక్ష్యమని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా పిల్లలను అలరించేలా ఓ తీపి ప్రేమకథా చిత్రాన్ని కూడా చేయబోతున్నట్లు ఈ సందర్భంగా నాని వెల్లడించారు.