నిర్మాత హీరో అవ్వాలంటే హీరో డాడీ నిర్మాత అవ్వాలి: నాగవంశీ చమత్కారం!
సినిమా నిర్మాణంలో నిర్మాతలు పడే కష్టాలు.. బడ్జెట్ కేటాయింపులు.. నటీనటుల పారితోషికాల సర్దుబాట్లు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో టాలీవుడ్‌లో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది.
సినిమా నిర్మాణంలో నిర్మాతలు పడే కష్టాలు.. బడ్జెట్ కేటాయింపులు.. నటీనటుల పారితోషికాల సర్దుబాట్లు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో టాలీవుడ్‌లో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల `ఎపిక్` మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. తానే గనుక ఎప్పుడైనా హీరోగా నటించాల్సి వస్తే.. ఆ సినిమాకు దేవరకొండ తండ్రి నిర్మాతగా మారాలని ఆయన నవ్వులు పూయిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు. ఒక సినిమా తీసేటప్పుడు నిర్మాత పడే ఆర్థికపరమైన స్ట్రగుల్- ప్రెజర్ ఎలా ఉంటాయో హీరోలకు- వారి కుటుంబాలకు తెలియాలంటే హీరోల తండ్రులే స్వయంగా నిర్మాతలుగా మారాలని ఆయన చమత్కరించారనుకోవచ్చు. యాంకర్ సుమతో చిట్ చాట్ సమయంలో ఒక సరదా మూవ్ మెంట్ లో నాగవంశీ అలా స్పాంటేనియస్‌గా మాట్లాడేసారు.
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటుడు ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన `EPIC - ఫస్ట్ సెమిస్టర్` చిత్రాన్ని నిర్మాత నాగవంశీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల ముంగిట ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓవర్సీస్ కాపీలను సమయానికి పంపించడం నుండి.. థియేటర్ల కేటాయింపులు- బిజినెస్ డీల్స్ పూర్తి చేయడం వరకు అన్ని విషయాల్లో దగ్గరుండి మంతనాలు సాగిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా వేదికపై మాట్లాడిన నాగవంశీ.. విజయ్ దేవరకొండ - ఆనంద్ దేవరకొండల తండ్రి గోవర్ధన్ రావు గారు సినిమా నిర్మిస్తేనే తాను హీరోగా నటిస్తానని అనడం కేవలం వేదికపై ఫన్నీ పార్ట్.
నిజానికి దేవరకొండ కుటుంబానికి సినీ నిర్మాణ రంగం కొత్తేమీ కాదు. పూర్వంలో టెలివిజన్ సీరియల్స్, యాడ్ ఫిలిం దర్శకుడిగా పనిచేసిన అనుభవం విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావుకి ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా తుమ్మన్‌పేట నుండి హైదరాబాద్ వచ్చి సినీ రంగంలో స్థిరపడిన ఆయన ఇప్పుడు తన కుమారులు విజయ్ - ఆనంద్ హీరోలుగా రాణిస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే దేవరకొండ బ్రదర్స్ సొంత బ్యానర్ లో సినిమాలు తీస్తున్నారు. వాటి ప్రొడక్షన్ పనుల్లో వెనకుండి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. కాబట్టి ప్రొడక్షన్ వ్యాపారంలో ఉన్న సవాళ్లు ఆయనకు బాగా తెలుసు. నాగవంశీ వ్యాఖ్యలు నవ్వులు పూయించినా పరిశ్రమలో నిర్మాతగా నిలదొక్కుకోవడం వెనుక ఎంతటి కృషి ఉంటుందో చెప్పకనే చెప్పాయి.
ఏది ఏమైనా.. ప్రొడక్షన్ హడావుడి- రిలీజ్ స్ట్రగుల్స్ మధ్యలో కూడా నాగవంశీ అంత సరదాగా మాట్లాడటం ఇండస్ట్రీపై అతడికి ఉన్న పట్టును, కాన్ఫిడెన్స్‌ను తెలియజేస్తోంది. `ఎపిక్` సినిమా ప్రమోషన్ల సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
ఎపిక్ ట్రైలర్ కాంట్రవర్సీకి చెక్..
`ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్` చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సోషల్ మీడియాలో ట్రైలర్‌పై వస్తున్న చిన్న కాంట్రవర్సీపైనా వంశీ స్పష్టతనిచ్చారు. నైన్ టీస్ వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య ఈ చిత్రంలో ముద్దు సీన్స్ పెట్టడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఒక అమ్మాయి-అబ్బాయి మధ్య ఉండే ప్యూర్ రిలేషన్‌ను మాత్రమే ఇందులో చూపించామని తెలిపారు. కేవలం ఒక కిస్ సీన్ ఉన్నంత మాత్రాన ఇది అడల్ట్ సినిమా కాదని.. ఒక అమ్మాయి-అబ్బాయి మధ్య వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన పూర్తి కుటుంబ కథా చిత్రమని హామీ ఇచ్చారు.
ఈ సినిమాలో తాము ఒక సరికొత్త ప్రయోగం చేశామని.. 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న చిత్రంలో దాదాపు 1 గంట 40 నిమిషాలు వైష్ణవి, ఆనంద్ దేవరకొండల మాటలే ఉంటాయని నాగవంశీ వెల్లడించారు. రూరల్ తెలంగాణ నేపథ్యం ఉన్న అబ్బాయి.. ఒక కాన్ఫిడెంట్ అమ్మాయి మధ్య సాగే ఈ లవ్ స్టోరీని గర్ల్ ఫ్రెండ్, వైఫ్ లేదా మదర్‌తో కలిసి వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చని చెప్పారు. ఇక ప్రొడ్యూసర్‌గా కాకుండా ఒక ప్రేక్షకుడిగా తనకు రోమ్‌కామ్ .. ఫ్యామిలీ సినిమాలంటేనే చాలా ఇష్టమని తన వ్యక్తిగత ఇష్టాలను షేర్ చేసారు. అంతేకాకుండా సమయం దొరికితే త్రివిక్రమ్ , వెంకీ అట్లూరి లేదా పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే గంటల తరబడి మాట్లాడగలనని.. ఇంకెవరూ నన్ను అంత సమయం భరించలేరంటూ నాగవంశీ తనదైన శైలిలో చమత్కరించారు.