25వ సినిమా.. చైతూ ఏ లెక్కలో వెళ్తాడో!
నాగచైతన్య కెరీర్ ఇప్పుడు 25వ సినిమా దగ్గరకు వచ్చేసింది. మైల్‌స్టోన్ నంబర్ కావడంతో సహజంగానే ఫ్యాన్స్‌లో కాస్త ఎక్కువ అంచనాలు ఉంటాయి.
నాగచైతన్య కెరీర్ ఇప్పుడు 25వ సినిమా దగ్గరకు వచ్చేసింది. మైల్‌స్టోన్ నంబర్ కావడంతో సహజంగానే ఫ్యాన్స్‌లో కాస్త ఎక్కువ అంచనాలు ఉంటాయి. అయితే అంతకంటే ముందు చైతూ చేస్తున్న వృషకర్మ కూడా చిన్న సినిమా కాదు. తండేల్ తో ఇప్పటికే వంద కోట్ల క్లబ్ చూసిన చైతూ, ఇప్పుడు తన కెరీర్‌లోనే పెద్ద కాన్వాస్‌లో కనిపించే సినిమాతో ముందుకు వస్తున్నాడు.
విరూపాక్షతో తొలి సినిమాకే వంద కోట్ల రేంజ్ చూసిన కార్తీక్ దండు వృషకర్మను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకు బయటకు వచ్చిన కంటెంట్‌లో మిస్టరీ, అడ్వెంచర్, గ్రాఫిక్స్‌కు మంచి స్పేస్ కనిపిస్తోంది. చైతూ కూడా ఇంతకుముందు చేయని ప్రపంచంలోకి వెళ్లాడు. సినిమా కంటెంట్ క్లిక్ అయితే తండేల్ తర్వాత ఆయన మార్కెట్‌ను మరో మెట్టు ఎక్కించే అవకాశం దీనికి ఉంది.
అందుకే వృషకర్మ తర్వాత వచ్చే 25వ సినిమా మీద ఫ్యాన్స్ లెక్క కూడా కాస్త వేరుగా ఉంటుంది. మైల్‌స్టోన్ కాబట్టి భారీ బడ్జెట్ ఉండాలనే రూల్ ఏమీ లేదు. కానీ ముందు సినిమా విజువల్‌గా పెద్ద స్థాయిలో ఉండి, బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి రిజల్ట్ ఇస్తే తర్వాత వచ్చే సినిమాకు అంచనాలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. అప్పుడు 25వ సినిమా కోసం చైతూ ఎలాంటి కథ ఎంచుకుంటాడన్నదే ఎక్కువ ఆసక్తి పెంచుతుంది.
ఇక్కడే వెంకీ అట్లూరి పేరు వినిపిస్తోంది. నాగవంశీ నిర్మాణంలో చైతూ 25వ సినిమాను వెంకీ డైరెక్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికారికంగా ఏమీ ఫిక్స్ కాలేదు. కానీ ఈ కాంబినేషన్ నిజమైతే ఫ్యాన్స్ లో అంచనాలు మళ్ళీ మరోలా పెరుగుతాయి. వృషకర్మ తరహా భారీ అడ్వెంచర్ తర్వాత వెంకీ అదే రూట్‌లో వెళతాడా అనేది అసలు డౌట్
వెంకీ ట్రాక్ రికార్డ్ చూస్తే ‘సార్’, ‘లక్కీ భాస్కర్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాల్లో భారీ మాస్ సెటప్ కంటే కథ, హీరో క్యారెక్టర్, ఎమోషన్‌నే ముందుకు పెట్టాడు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆ సినిమాలు ఆయనకు మంచి రేంజ్ ఇచ్చాయి. అంటే చైతూ 25వ సినిమా కుదిరితే మైల్‌స్టోన్ కోసం బలవంతంగా స్కేల్ పెంచే అవకాశం ఉండకపోవచ్చు. తనకు సెట్ అయ్యే కథలోనే ఏదైనా కొత్తగా ట్రై చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.
నిజానికి వెంకీకి చైతూతో సినిమా చేయాలనే ఆలోచన ఇప్పటిది కాదు. లక్కీ భాస్కర్ వరకు తాను రాసుకున్న కథలను ముందుగా చైతూకే వినిపించేవాడినని గతంలోనే చెప్పాడు. కానీ ఒక్క కథ కూడా ఇద్దరి కాంబినేషన్ వరకు వెళ్లలేదు. ఇప్పుడు ఇద్దరి పేర్లు చైతూ 25వ సినిమా దగ్గర వినిపించడం మాత్రం భలే కుదిరింది. ఒకవేళ సెట్ అయితే వెంకీ చైతూ కోసం ఎలాంటి కథ తీసుకొస్తాడో చూడాలి.