కంగారూ దేశంలో కాన్సెర్ట్ వాయిదా.. మెగాస్టార్ కేనా? టాప్-10షోలు ఇలానే!
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించాల్సిన తన ప్రతిష్టాత్మక లైవ్ షో `వైకిట్టు ఎంత పరిపాడి` వీసా ఆలస్యం కారణంగా ఆఖరి నిమిషంలో వాయిదా పడింది.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించాల్సిన తన ప్రతిష్టాత్మక లైవ్ షో `వైకిట్టు ఎంత పరిపాడి` వీసా ఆలస్యం కారణంగా ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. దాదాపు 50 ఏళ్ల సినీ ప్రయాణంలో తనకు ఎప్పుడూ ఎదురుకాని ఈ విచిత్ర పరిస్థితిపై మోహన్‌లాల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఆస్ట్రేలియన్ అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. సాంకేతిక బృందం ఇప్పటికే సిడ్నీ చేరుకున్నా.. వీసా మంజూరు కాకపోవడంతో లాల్ సింగపూర్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. క్లరికల్ లోపాల వల్ల జరిగిన ఈ అవాంఛనీయ పరిణామానికి చింతిస్తూ... నిర్వాహకులు త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
అయితే విదేశాల్లో ఉండే ఎన్నారై అభిమానులకు ఇటువంటి షోలు ఆఖరి నిమిషంలో రద్దయినప్పుడు కేవలం టికెట్ డబ్బులు మాత్రమే కాక అమూల్యమైన సమయం, శ్రమ వృధా అవుతాయి. షోకి వెళ్లడానికి ముందుగానే ఉద్యోగాల్లో లీవ్‌లు పెట్టడం.. వర్క్ షిఫ్ట్‌లను అడ్జస్ట్ చేసుకోవడం చేస్తారు. ఇతర నగరాలు, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు విమాన టికెట్లు, హోటల్ రూమ్‌లను ముందుగానే బుక్ చేసుకుంటారు. షో వాయిదా పడటం వల్ల ఈ ప్రయాణ ఖర్చులు, క్యాన్సిలేషన్ ఛార్జీలు తిరిగి రావు. అంతేకాకుండా.. ఆర్గనైజర్లు తదుపరి తేదీలను ప్రకటించినా అందరూ మళ్లీ అదే సమయాన్ని కేటాయించలేక తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు.
వీసా నిబంధనలు.. అధికారిక అనుమతులు.. రెగ్యులేటరీ సమస్యల కారణంగా విదేశాల్లో భారతీయ- అంతర్జాతీయ ప్రముఖుల షోలు ఆగిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో ప్రధానంగా మోహన్‌లాల్ సిడ్నీ షో (2026)... హ్యూస్టన్‌లో దిల్‌జీత్ దొసాంజ్ యూఎస్ఏ టూర్ (2019),.. కెనడాలో ప్రముఖ డ్యాన్సర్ రాకేష్ సురేష్ ఫెస్టివల్ ప్రదర్శన (2023),.. యూకేలో అంకిత్ తివారీ & మహమ్మద్ ఇర్ఫాన్ మ్యూజిక్ షో (2015),.. డెట్రాయిట్‌లో ఏ.ఆర్. రెహమాన్ జై హో టూర్ (2010) వంటివి ప్రధానంగా నిలిచిపోయాయి.
మరికొన్ని సందర్భాలను పరిశీలిస్తే.. కెనడియన్ రాక్ బ్యాండ్ `నికెల్ బ్యాక్` యూకే టూర్ (2015).. హెవీ మెటల్ బ్యాండ్ `మేహెమ్ ఇండియా టూర్`(2025).... అమెరికాలో నటులు సూర్య, కమల్ హాసన్ ఫ్యాన్ మీట్స్-కల్చరల్ ఈవెంట్స్, విశాల్-శేఖర్ యూఎస్ లైవ్ కాన్సెర్టులు.. చెన్నైలో నిర్వహించిన ఏ.ఆర్. రెహమాన్ మార్క్కుమా నెన్జమ్ కాన్సెర్ట్ (2023) వంటివి వీసాలు, ట్రాఫిక్-పోలీస్ పర్మిషన్ల లోపాల వల్ల ఆగిపోవడం లేదా రీ-షెడ్యూల్ కావడం జరిగింది.
ఏది ఏమైనా విదేశీ పర్యటనలు.. అంతర్జాతీయ స్టేజ్ షోలను నిర్వహించేటప్పుడు నిర్వాహకులు వీసా ప్రక్రియలను, అధికారిక అనుమతులను ముందస్తుగా క్లియర్ చేసుకోవడం అత్యంత అవసరం. ఆఖరి నిమిషంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు అటు కళాకారుల సమయాన్ని... ఇటు వేలాది మంది అభిమానుల నమ్మకాన్ని, కష్టాన్ని వృధా చేస్తాయని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.