దృశ్యం 4 లో ఇదే ఉంటుందా?

మలయాళ సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ మూవీ 'దృశ్యం' నుంచి ఇప్పటి వరకు మూడు పార్ట్‌లు వచ్చిన విషయం తెల్సిందే.

Update: 2026-10-03 05:49 GMT

మలయాళ సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ మూవీ 'దృశ్యం' నుంచి ఇప్పటి వరకు మూడు పార్ట్‌లు వచ్చిన విషయం తెల్సిందే. మూడో పార్ట్‌ను చివరి పార్ట్‌గా మొదట భావించారు. కానీ దర్శకుడు జీతూ జోసెఫ్‌ నాల్గవ పార్ట్‌ ఉంటుందని ప్రకటించాడు. మొదటి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్‌కి భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక మొదటి రెండు పార్ట్‌లతో పోల్చితే దృశ్యం 3 కి అత్యధిక వసూళ్లు నమోదు అయిన విషయం తెల్సిందే. మోహన్‌ లాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ దక్కించుకోవడం మాత్రమే కాకుండా, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. మోహన్‌ లాల్‌ అభిమానులతో పాటు, దృశ్యం ను అభిమానించే ప్రతి ఒక్కరు ఇప్పుడు దృశ్యం 4 కోసం వెయిట్‌ చేస్తున్నారు. జార్జ్‌ కుట్టీ తన కుటుంబంను ఆ హత్య కేసు నుంచి పూర్తిగా ఎలా బయట పడేశాడు అనేది దృశ్యం 4 లో చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్‌ జోరు...

హిందీలో దృశ్యం 3 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రెండు పార్ట్‌లు మలయాళ వర్షన్‌కు మక్కీ కి మక్కీ రీమేక్‌గా రూపొందింది. కానీ దృశ్యం 3 మాత్రం కొత్త కథతో రూపొందించారు. పాత్రలు, నేపథ్యం అదే తీసుకుని కథను హిందీ దర్శకుడు అభిషేక్ పాఠక్‌ ఈ పార్ట్‌తో ముగించాడు. మొదటి రెండు పార్ట్‌లతో పోల్చితే మూడో పార్ట్‌లో కథ మరింత సీరియస్ టర్న్‌ తీసుకుంది, హీరో తన కుటుంబంను కాపాడుకునేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. కొడుకుని కోల్పోయిన తల్లి ఏళ్లు గడుస్తున్నా ఆ బాధ నుంచి బయటకు రాలేక పోయింది. తన కొడుకు హత్యకు ప్రతికారం తీర్చుకోవడంకు విజయ్‌కి అతడ ఫ్యామిలీకి శిక్ష పడాల్సిందే అని ఒక పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌ ను కేసు ఎంక్వౌరీ కోసం వేయిస్తుంది. ఫెయిల్యూర్ ఎరగని ఆ పోలీస్‌ ఆఫీసర్‌ హీరో ఫ్యామిలీని ఎలా టార్గెట్‌ చేస్తాడు అనేది హిందీ దృశ్యం 3 కథ.

అజయ్‌ దేవగన్‌ హీరోగా బాలీవుడ్‌ మూవీ....

మలయాళం ప్రేక్షకులు దృశ్యం ప్రాంచైజీ నుంచి వరుసగా సినిమాలు వస్తున్నా ఆధరణ చూపుతున్నారు. అందుకని మరో మూడు నాలుగు పార్ట్‌లు తీసుకు వచ్చే ఉద్దేశం లేదని దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఆ మధ్య ఒక చిట్‌ చాట్‌ సందర్భంగా అన్నారట. ఆయన మాటలను బట్టి చూస్తే త్వరలోనే దృశ్యం ప్రాంచైజీ కి ఫుల్‌ స్టాప్ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదేదో దృశ్యం 4తో మలయాళ దృశ్యంకి కూడా ఎండ్ కార్డ్‌ వేస్తే బాగుంటుంది కదా అని చాలా మంది భావిస్తున్నారు. దృశ్యం 4 ను దర్శకుడు జీతూ జోసెఫ్‌ ప్రకటిస్తే హిందీ దృశ్యం 3 కథను తీసుకోవాలంటూ చాలా మంది కోరుతున్నారు. హిందీ దృశ్యం 3కి బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన దక్కిన విషయం తెల్సిందే. సినిమాకు రివ్యూలు సైతం పాజిటివ్‌గా వచ్చాయి, అంతే కాకుండా సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

మోహన్‌ లాల్‌, జీతూ జోసెఫ్‌ల 'దశ్యం 4'

అజయ్‌ దేవగన్‌ మరోసారి దృశ్యం తో సర్‌ప్రైజ్ చేశాడు. ఒరిజినల్ వర్షన్‌ లో చేసిన మోహన్‌ లాల్‌ కి ఏమాత్రం తగ్గకుండా అజయ్‌ దేవగన్ హిందీ ప్రేక్షకులను అలరించాడు అనే టాక్‌ వచ్చింది. అందుకే బాక్సాఫీస్ వద్ద హిందీ దృశ్యం భారీ వసూళ్లను రాబడుతోంది. హిందీ దృశ్యం ఫైనల్‌ పార్ట్‌కి ఎలాగూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది కనుక, మలయాళ దృశ్యం ఫైనల్‌ పార్ట్‌కి పెద్దగా కష్టం లేకుండా ఆ కథను తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మొదటి రెండు పార్ట్‌లను మలయాళ దృశ్యం నుంచి హిందీ ఫిల్మ్‌ మేకర్స్ రీమేక్‌ చేశారు. ఇప్పుడు హిందీ దృశ్యం నుంచి మలయాళం దృశ్యం ను రీమేక్ చేయడం లో తప్పేం లేదు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వచ్చే ఏడాదిలో మలయాళ దృశ్యం 4 షూటింగ్‌ ప్రారంభం కానుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో హిందీ దృశ్యం 3 కథను జీతూ జోసెఫ్ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకు జీతూ జోసెఫ్‌, మోహన్‌ లాల్‌ ఒప్పుకుంటారా అనేది చూడాలి.

Tags:    

Similar News