లేడీస్‌లోకి శోభన్ బాబులా వెళ్లడం నాట్ ఈజీ: మోహన్ బాబు
ఫైటింగ్ సినిమాలు ఎవరైనా చేయగలరని, కానీ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా సవాలుతో కూడుకున్నపని అని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు.
సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ లెజెండరీ నటుడు శోభన్ బాబు సినిమాల గురించి.. లేడీస్ హృదయాల్లో హీరో సంపాదించే ఇమేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభన్ బాబు గారు ఇతర నటులతో పోలిస్తే ఎక్కువ కుటుంబ కథా చిత్రాలు చేశారని మోహన్ బాబు ప్రశంసించారు. ఏ హీరో అయినా ఫైటింగులు, డ్యాన్సులు చేయగలరు కానీ.. మహిళా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం అంత సులువైన విషయం కాదని.. కానీ శోభన్ బాబు ఆ ఫీట్ ను ఎంతో సమర్థవంతంగా సాధించారని కొనియాడారు.
ఫైటింగ్ సినిమాలు ఎవరైనా చేయగలరని, కానీ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా సవాలుతో కూడుకున్నపని అని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. ఆ ప్రత్యేకమైన పాత్రలతో శోభన్ బాబు కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారని తెలిపారు. నేటితరం నటులలో నానీని కొన్నిసార్లు చూస్తున్నప్పుడు ఇతడు శోభన్ బాబులా నటిస్తున్నాడే అనుకున్నానని కూడా మోహన్ బాబు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇదే సందర్భంలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడిన ఆయన.. తాను పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్ల కష్టాలను, ఈ స్థాయికి రావడానికి పడిన శ్రమను గుర్తుచేసుకున్నారు.
తాను ఏ విషయాన్నయినా ముఖం మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతానని..తన మాటల్లో ఎప్పుడూ ఎలాంటి కల్మషం ఉండదని మోహన్ బాబు స్పష్టం చేశారు. టాలీవుడ్‌లో కొత్త తరం దర్శకులు, నటులు ప్రయోగాత్మక చిత్రాలతో అద్భుతాలు సృష్టిస్తున్నారని అభినందించారు. అలాగే చలనచిత్ర పరిశ్రమకు పునాదులు వేసిన సీనియర్ దిగ్గజాలను, టెక్నీషియన్లను ఎప్పుడూ మరువకూడదని.. వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు.
తనపై వచ్చే విమర్శలను.. నెగెటివిటీని తాను ఎప్పుడూ పట్టించుకోనని.. కేవలం తన పని ద్వారానే వాటికి సమాధానం చెబుతానని తేల్చిచెప్పారు. సమాజంలో రాణించాలంటే కేవలం విద్య మాత్రమే కాకుండా క్రమశిక్షణ, పెద్దల విషయంలో విధేయత చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. మాతృభాష తెలుగు గొప్పతనాన్ని కొనియాడుతూ.. మన సంస్కృతిని.. భాషను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.
జీవితంలో ఏ రంగంలోనైనా కష్టపడే తత్వం, నిజాయితీ ఉంటేనే శాశ్వతమైన గుర్తింపు లభిస్తుందని తన అనుభవంతో వివరించారు. టాలీవుడ్ పరిశ్రమలో అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని..ఒకరి విజయాన్ని మరొకరు అభినందించుకోవాలని ఆకాంక్షించారు. దశాబ్దాలుగా తనను ఆదరిస్తూ తన ప్రతి సినిమాను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న అభిమానులకే తన జీవితంలో అత్యున్నత స్థానం ఉంటుందని భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. నేచురల్ స్టార్ నాని, మోహన్ బాబు ప్రధాన పాత్రలలో నటించిన `ది ప్యారడైజ్` భారీ ఓపెనింగులతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. నెగెటివ్ సమీక్షలతో పని లేకుండా తొలి నాలుగు రోజులు వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పేర్కొంది.