'మిర్జాపూర్ ది మూవీ'.. థియేటర్లలో గ్యాంగ్‌స్టర్ డ్రామా రీసౌండ్
ఓటీటీలో గొప్ప ఆదరణ పొందిన సిరీస్ ని థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచన సరైనదేనా? అంటే గతానుభవాలకు భిన్నంగా మిర్జాపూర్ గ్యాంగ్ స్టర్ డ్రామా విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
ఓటీటీలో గొప్ప ఆదరణ పొందిన సిరీస్ ని థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచన సరైనదేనా? అంటే గతానుభవాలకు భిన్నంగా మిర్జాపూర్ గ్యాంగ్ స్టర్ డ్రామా విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. నిజానికి మిర్జాపూర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `మిర్జాపూర్ ది మూవీ` ట్రైలర్ విడుదలవుతూనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ వేదికగా దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ పొందిన ఈ సిరీస్ ఇప్పుడు మరింత వైలెంట్‌గా వెండితెరపైకి వస్తోంది. మిర్జాపూర్ సింహాసనం కోసం జరిగే అదే రక్తసిక్తం, పాత పాత్రలతో పాటు కొత్త శక్తుల రాకతో ఈసారి వెండితెరపై మరింత భారీగా స్ట్రైక్ అయ్యేలా కనిపిస్తోందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి నటించిన కాలీన్ భయ్యా తన శాంత స్వభావాన్ని కాపాడుకుంటూనే.. అవసరమైనప్పుడు ఎంత క్రూరంగా మారగలడో మరోసారి చూపించబోతున్నారు. ఇక అభిమానుల అభిమాన పాత్ర మున్నా భయ్యా (దివ్యేందు) అదే మాస్ ఎనర్జీతో.. తన ముందర ఎవరైనా ఎదిరిస్తే బూతులతో విరుచుకుపడే వైఖరితో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ట్రైలర్‌లో రాజకీయనాయకుడితో సాగే సన్నివేశం మున్నా మార్క్ క్యారెక్టరైజేషన్‌కు అద్దం పడుతోంది. వీరితో పాటు గుడ్డు, బాబ్లూల ప్రయాణం మొదటి నుండి సరికొత్తగా ఆవిష్కరించబడబోతోంది. అంతేకాకుండా, గొంతులు కోసే కంపౌండర్ పాత్ర కూడా ఈసారి మళ్లీ థియేటర్లలో రచ్చ చేయనుంది. అయితే ఈ ట్రైలర్‌లో అందరి దృష్టినీ ఆకర్షించి ప్రత్యేకంగా నిలిచింది మాత్రం రవికిషన్ పాత్రే! ఈ బలమైన గ్యాంగ్‌స్టర్ డ్రామాకు రవికిషన్ చేరిక ఒక ప్రధాన బలంగా మారింది. స్క్రీన్‌పై విలనిజంతో భయపెడుతూనే.. తన నవ్వు పూయించే డైలాగ్ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి ఆయన సిద్ధమయ్యారు. సిరీస్‌లోని హింస, రా రకమైన కంటెంట్‌ను సినిమాల్లో ఎక్కడా తగ్గించకుండా మేకర్స్ అలాగే కొనసాగించడంతో షో ప్రియులకు బిగ్ స్క్రీన్‌పై సంపూర్ణ వినోదం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
భారీ తారలు లేకపోవడంతో ఈ చిత్రాన్ని పరిమిత బడ్జెట్‌తోనే రూపొందించినప్పటికీ, సిరీస్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గతంలో ఓటీటీ సిరీస్‌లు సినిమాలుగా మారినప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ అడాప్టేషన్ ఎంతవరకు హిట్ కొడుతుందనే దానిపై విశ్లేషకులు జాగ్రత్తగా అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా సెప్టెంబర్ 4న థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇలా ఉంది: సోషల్ మీడియాలో హంగామా!
'మిర్జాపూర్ ది మూవీ' అఫీషియల్ హిందీ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైన క్షణం నుంచే రికార్డు స్థాయి వ్యూస్, కామెంట్లతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా 'మున్నా భయ్యా' (దివ్యేందు) పునరాగమనం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన కమ్‌బ్యాక్ కోసమే ఈ సినిమా తీసినట్లుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే `దేఖ్ రహా హై బినోద్.. సచివ్ జీ ఎలా గుండాగిరీ లైన్‌లోకి వచ్చారో!` అంటూ `పంచాయత్` సిరీస్ రిఫరెన్స్‌లతో మీమర్స్ చేస్తున్న కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రవికిషన్ పాత్రపై కూడా వీక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ భయాన్ని గొలుపుతూనే వినోదాన్ని అందిస్తుందని, 'పార్ట్ టైమ్ పాలిటీషియన్ - ఫుల్ టైమ్ యాక్టర్' అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి`కాలీన్ భయ్యా` గాంభీర్యం, మున్నా భయ్యా మాస్ ఎనర్జీ, రవికిషన్ నటన మేళవింపుతో వచ్చిన ఈ ట్రైలర్ దూసుకెళుతోంది.