రీల్స్ విప్లవం: 2026లో భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న కంటెంట్ ఇదే!
మెటా కోసం ఐపిఎస్ఓఎస్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. 2026లో భారతీయులు ఎక్కువగా ఏ రకమైన కంటెంట్‌ను చూస్తున్నారో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి
భారతదేశంలో షార్ట్-ఫార్మ్ వీడియోల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. మెటా కోసం ఐపిఎస్ఓఎస్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. 2026లో భారతీయులు ఎక్కువగా ఏ రకమైన కంటెంట్‌ను చూస్తున్నారో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 23 నగరాలు.. గ్రామీణ ప్రాంతాల్లోని 4000 మందిపై నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 97 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు ప్రతిరోజూ మెటా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలను వీక్షిస్తున్నట్లు తేలింది.
ఈ అధ్యయనం ప్రకారం... భారతీయులు రీల్స్ లో ఎక్కువగా బ్యూటీ అండ్ మేకప్ `ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్` కేటగిరీలను ఇష్టపడుతున్నారు. ఈ రెండు విభాగాల్లో సుమారు 52శాతం మంది వీక్షకులు నిమగ్నమై ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో లైఫ్‌స్టైల్ అండ్ ఫిట్‌నెస్ (42 శాతం), కామెడీ (39 శాతం), స్పోర్ట్స్ (38 శాతం), ట్రావెల్ (37 శాతం) కంటెంట్ నిలిచాయి. పట్టణ ప్రాంతాల్లో 98 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 94 శాతం మంది ప్రతిరోజూ వీడియోలు చూస్తుండటం విశేషం.
రీల్స్ ఇప్పుడు కేవలం వినోదానికే పరిమితం కాకుండా కొనుగోలు నిర్ణయాలను కూడా శాసిస్తున్నాయి. వినియోగదారులు కొత్త ఉత్పత్తులను కనుగొనడంలో రీల్స్ 81 శాతం మేర ప్రభావం చూపుతుండగా.. బ్రాండ్ల ఎంపికలో 66 శాతం.. తుది కొనుగోలు నిర్ణయాల్లో 47శాతం ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా జెన్ జీ యువతలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వారిలో 84 శాతం మంది మెటా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే కొత్త ఉత్పత్తులను తెలుసుకుంటున్నారు.
ఆటోమొబైల్ రంగంలో కూడా మెటా ప్లాట్‌ఫారమ్‌ల హవా కొనసాగుతోంది. కొత్త కార్ల గురించి తెలుసుకోవడంలో 82శాతం మంది వీటిపై ఆధారపడుతుండగా.. 50 శాతం మంది తుది కొనుగోలు నిర్ణయాలు వీటి ప్రభావంతోనే తీసుకుంటున్నారు. ఇతర షార్ట్-ఫార్మ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే.. రీల్స్ ద్వారా క్రియేటర్లతో వినియోగదారులు 60 శాతం అధికంగా మమేకమవుతున్నారని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.
భారతదేశంలో వీడియో విప్లవం ఇప్పుడు కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందని మెటా ఇండియా డైరెక్టర్ సౌగాతో భౌమిక్ పేర్కొన్నారు. బ్రాండ్లను కంటెంట్ ద్వారా మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తోందని అన్నారు. గ్రామీణ- పట్టణ ప్రాంత వీక్షకుల మధ్య అంతరాలు తగ్గిపోవడంతో క్రియేటర్లకు.. బ్రాండ్లకు అద్భుతమైన వేదిక లభించినట్లయింది.