మెగా 158 మేకర్స్ మాలీవుడ్ డెబ్యూ.. తెలుగులో మాస్టర్ ప్లాన్?
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ మెగా 158తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ.. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ తో మాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ మెగా 158తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ.. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ తో మాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. మంజుమ్మెల్ బాయ్స్ వంటి ఇండస్ట్రీ హిట్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్న బాలన్ ది బాయ్ తో కేవీఎన్ ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ చిత్రాన్ని థెస్పియన్ ఫిల్మ్స్ తో కలిసి నిర్మిస్త్తోంది.
మాలీవుడ్ లో ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఆ సినిమాకు ఇప్పుడు తెలుగులో కూడా అదిరిపోయే బ్యాకప్ దక్కింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఆ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఇటీవల కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో.. బాలన్ ది బాయ్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
మంజుమ్మెల్ బాయ్స్ ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకపోయినా కేవలం కంటెంట్, ఎమోషన్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ కు వచ్చిన మౌత్ టాక్ భారీ వసూళ్లను తెచ్చిపెట్టింది. అదే నమ్మకంతో ఇప్పుడు దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్న బాలన్ ది బాయ్ పై అందరి దృష్టి పడింది. ఫ్యామిలీ ఎమోషన్స్, నేటివిటీ, హార్ట్ టచింగ్ సెంటిమెంట్ తో సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ప్రేమలు, ఆవేశం వంటి మలయాళ డబ్బింగ్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మాలీవుడ్ కంటెంట్ కు తెలుగు మార్కెట్లో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆ ట్రెండ్ ను క్యాష్ చేసుకునే దిశగా కేవీఎన్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. డబ్బింగ్ సినిమాగా కాకుండా, స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు తగ్గట్టే భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఇక సినిమా విడుదలకు ముందే ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ బిజినెస్ వింగ్ అయిన మార్షే డు ఫిల్మ్ లో ఆ చిత్రాన్ని ప్రదర్శించడం ద్వారా కేవీఎన్ సంస్థకు మాలీవుడ్ లో గ్రాండ్ వెల్ కమ్ లభించినట్లే. టెక్నికల్ గా కూడా హై స్టాండర్డ్స్ తో సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. జూన్ 19న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాకప్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో మలయాళ కంటెంట్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ గా మారనుంది. ఒకవైపు మెగా 158 లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తూ, మరోవైపు మాలీవుడ్ లోనూ స్ట్రెయిట్ సినిమాతో అడుగుపెడుతున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి గతంలో మంజుమ్మెల్ బాయ్స్ చేసిన మ్యాజిక్ ను బాలన్ ది బాయ్ కూడా రిపీట్ చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.