చిరు భారీ రిస్క్.. హై యాక్షన్ ట్రీట్ పక్కానా?
మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్నా.. సిల్వర్ స్క్రీన్ పై తన ఎనర్జీ, యాక్షన్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడడం లేదు.
మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్నా.. సిల్వర్ స్క్రీన్ పై తన ఎనర్జీ, యాక్షన్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడడం లేదు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న మెగా 158 సినిమాలో చిరంజీవి మరోసారి పవర్ ఫుల్ యాక్షన్ అవతార్ లో కనిపించబోతున్నారనే వార్తలు ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో రూపొందిస్తున్న యాక్షన్ ఎపిసోడ్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఆ యాక్షన్ సీక్వెన్స్ ను ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ రూపొందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్టంట్ ఆర్టిస్టులు పాల్గొంటున్న ఆ ఫైట్ ను ఎంతో గ్రాండ్ గా షూట్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఏజ్ లో కూడా చిరంజీవి స్వయంగా కొన్ని రిస్కీ యాక్షన్ సీన్స్ చేయడానికి ముందుకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు బాబీ ఊహించిన యాక్షన్ విజన్ ను స్క్రీన్ పై అదే రేంజ్ లో చూపించేందుకు చిరంజీవి ఫుల్ గా కోపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ అందించిన చిరంజీవి- బాబీ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాను మించి యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇప్పుడు కొత్త చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక ఇటీవల సంగీత దర్శకుడు తమన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. "మెగా 158 చరిత్ర.. ఆగస్టు 22న కలుద్దాం" అంటూ ఆయన చేసిన పోస్టుతో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ లేదా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
సినిమాలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా, నివేదా పేతురాజ్ కూడా మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ఆ సినిమాను భారీ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు చిరంజీవి నటించిన విశ్వంభర విడుదల కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మాత్రం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 మూవీలో చిరంజీవి చేస్తున్న రిస్కీ యాక్షన్ సీన్స్ చర్చనీయాంశంగా మారింది. టైటిల్ టీజర్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.