అల్లు బాస్ ను మెగా బ్రదర్స్ అవమానించారా? అసలు నిజమేంటి?
మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం చాలా కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం చాలా కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ఆ రెండు కుటుంబాలకు చెందిన ప్రముఖులు మాత్రం పబ్లిక్ గా తామంతా ఒక్కటేనని పలుమార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ అభిమానుల మధ్య మాత్రం తరచూ ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెగా 158 లాంఛింగ్ ఈవెంట్ లో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా అల్లు అరవింద్ కు మెగా బ్రదర్స్ గౌరవం ఇవ్వలేదంటూ కొందరు కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఆ కార్యక్రమానికి చిరంజీవితో పాటు నాగబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ముగ్గురు ఒకే సోఫాలో కూర్చుని అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా రోజుల తర్వాత ఆ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా వేడుకకు విచ్చేశారు. వేదికపైకి వచ్చిన ఆయన ముందుగా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ ముగ్గురూ లేచి నిలబడేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే అల్లు అరవింద్ చేతులతో వారిస్తూ పర్లేదన్నట్లుగా సూచించడంతో వారు తిరిగి కూర్చున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టుల్లో మాత్రం దీనిని వేరే కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. అల్లు అరవింద్ వచ్చాక కూడా మెగా బ్రదర్స్ లేచి నిలబడలేదని, పెద్దలను గౌరవించలేదంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అభిమానులుగా చెప్పుకునే కొందరు ఈ వీడియోను షేర్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి మెగా అభిమానులు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు.
వాళ్లు లేచి నిలబడేందుకు ప్రయత్నించగా, అల్లు అరవిందే వద్దన్నారని, ఇది పెద్దల మధ్య సహజమైన మర్యాద అని చెబుతున్నారు. దీనిని వివాదంగా మార్చడం అనవసరమటూ కౌంటర్ ఇస్తున్నారు. వీడియోను పూర్తిగా గమనిస్తే కూడా అదే విషయం తెలుస్తుందని వారు చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెచ్చి రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నట్లు చూపించడం కొత్తేమీ కాదు.
గతంలో కూడా పలు సందర్భాల్లో మెగా, అల్లు కుటుంబాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆధారంగా చేసుకుని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఆ కుటుంబాలకు చెందిన ప్రముఖులు మాత్రం ఎప్పటికప్పుడు ఒకరికొకరు మద్దతుగా కనిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియో విషయంలో కూడా వాస్తవానికి పెద్ద వివాదం కనిపించకపోయినా, సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ఒక సాధారణ సంఘటనను కొందరు తమకు నచ్చిన విధంగా అర్థం చేసుకోవడంతో వివాదం మరింత జరిగినట్లు తెలుస్తోంది.