ఇన్నోసెన్స్ పై ఓపెన్ అయిన మానస శర్మ.. అమాయకత్వం కాదు!

'రాకాస' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె, తన అమాయకత్వంతో కూడిన మాటతీరుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు.;

Update: 2026-04-10 07:41 GMT

టాలీవుడ్‌లో ఒకప్పుడు మహిళా దర్శకులు అంటే వేళ్లమీద లెక్కపెట్టేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నందినీ రెడ్డి లాంటి వారు సత్తా చాటుతున్న వేళ, తాజాగా శ్రీకాకుళం అమ్మాయి మానస శర్మ తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'రాకాస' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె, తన అమాయకత్వంతో కూడిన మాటతీరుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు. యూట్యూబ్ రైటర్‌గా మొదలై, నేడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా ఎదిగిన మానస ప్రయాణం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అమాయకత్వం కాదు.. పెంపకం ప్రభావం:

మానస శర్మ ఇంటర్వ్యూలు చూస్తుంటే చాలా పద్ధతిగా, తక్కువగా మాట్లాడుతూ ఎంతో ఇన్నోసెంట్‌గా కనిపిస్తారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పారు. తనది అమాయకత్వం మాత్రమే కాదని, అది తన పెంపకం వల్ల వచ్చిన లక్షణమని తెలిపారు. ఇక చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లు "కొత్త చోటుకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, ఎక్కువగా మాట్లాడకు" అని చెప్పిన మాటలే తనపై ప్రభావం చూపాయని ఆమె పేర్కొన్నారు. అయితే, తన వర్క్ స్పేస్ లో మాత్రం తాను అందరినీ కంట్రోల్ చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉంటానని, స్నేహితులతో మాత్రం ఎంతో ఓపెన్‌గా ఉంటానని క్లారిటీ ఇచ్చారు.

శ్రీకాకుళం నుంచి సినిమా సెట్ వరకు:

మానస శర్మ సొంత ఊరు శ్రీకాకుళం. అక్కడే చదువు పూర్తి చేసిన ఆమెకు చిన్నప్పటి నుంచే రాతపై ఆసక్తి ఉండేది. తన కెరీర్‌ను యూట్యూబ్ రైటర్‌గా మొదలుపెట్టి, 2019లో నిహారిక ప్రొడక్షన్‌లో ‘మ్యాడ్ హౌస్’ అనే సిరీస్‌కు రచయితగా పనిచేశారు. ఇక ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్‌తో తనలోని క్రియేటర్ ను పరిచయం చేశారు. ఆ తరువాత సోనీ లివ్‌లో వచ్చిన ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌తో దర్శకురాలిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, అందరి ప్రశంసలు పొందారు. ఈ క్రమశిక్షణే ఆమెను ఈరోజు టాలీవుడ్‌లో నిలబెట్టింది.

రాకాసతో వెండితెరపై మ్యాజిక్:

షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న మానసకు ‘రాకాస’ రూపంలో ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఈ సినిమాతో ఆమె ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజా విడుదల ఐన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఒకప్పుడు భానుమతి, విజయనిర్మల వంటి దిగ్గజాలు నడిచిన బాటలో, ఇప్పుడు మానస శర్మ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. తన సినిమాల్లో సహజత్వం ఉండేలా చూసుకోవడమే ఆమె సక్సెస్ మంత్రమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

కొత్త తరం దర్శకులకు ఇన్స్పిరేషన్:

మానస శర్మ కేవలం ఒక దర్శకురాలు మాత్రమే కాదు, పట్టుదల ఉంటే ఎక్కడైనా విజయం సాధించవచ్చని నిరూపించిన అమ్మాయి. తన మాటతీరులో ఉన్న రిజర్వ్డ్ నేచర్ చూసి చాలామంది ఆమెకు స్టార్ హీరోయిన్ల ఇమేజ్ ని ఆపాదిస్తున్నారు. ఇక అమాయకత్వం అనేది బలహీనత కాదు, అది ఒక వ్యక్తిత్వమని ఆమె నిరూపించారు. భవిష్యత్తులో టాలీవుడ్‌లో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలతో మానస ఒక ట్రెండ్ సెట్టర్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు. శ్రీకాకుళం మట్టిలో పుట్టిన ఈ టాలెంట్ ఇప్పుడు తెలుగు సినిమా గర్వించే స్థాయికి చేరుకుంటోంది.

Tags:    

Similar News