క్రిస్టోఫర్ నోలాన్ దృష్టిలో పడ్డ ఘట్టమనేని ప్రిన్స్ : 'ది ఒడిస్సీ' టీమ్‌తో గౌతమ్ కృష్ణ

సూపర్‌స్టార్ మహేష్ బాబు వారసుడు ఘట్టమనేని గౌతమ్ కృష్ణ ముంబైలో జరిగిన హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం `ది ఒడిస్సీ` ప్రీమియర్ వేడుకలో త‌ళుక్కున మెరిసాడు.

Update: 2026-07-12 10:42 GMT

సూపర్‌స్టార్ మహేష్ బాబు వారసుడు ఘట్టమనేని గౌతమ్ కృష్ణ ముంబైలో జరిగిన హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం `ది ఒడిస్సీ` ప్రీమియర్ వేడుకలో త‌ళుక్కున మెరిసాడు. ఈవెంట్ కే అత‌డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆల్-బ్లాక్ సూట్‌లో ఎంతో స్టైలిష్‌గా ఆత్మవిశ్వాసంతో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. తన తండ్రి మహేష్ బాబును పోలిన రాజసం, చార్మింగ్‌తో మీడియా, అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించారు. లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ హాజరైన ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌లో గౌతమ్ ముంబై స్పాట్‌లైట్‌ను దొంగిలించాడ‌ని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

గౌతమ్ కృష్ణ గతంలోనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `1-నేనొక్కడినే` చిత్రంలో బాలనటుడిగా వెండితెర ఆరంగేట్రం చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తండ్రితో కలిసి కొన్ని ప్రకటనల్లోనూ కనిపించిన గౌతమ్.. ప్రస్తుతం లండన్‌లో తన ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారు. మిగిలిన సినీ లవర్స్ లాగే తాను కూడా క్రిస్టోఫర్ నోలన్‌కు వీరాభిమాని కావడంతో ముంబైలో జరిగిన `ది ఒడిస్సీ` వేడుకలో ఆయన టీమ్‌ను కలవడం గౌతమ్‌కు ఒక అద్భుతమైన అనుభవంగా నిలిచింది.

విశేషం ఏంటంటే... ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన `స్పైడర్‌మ్యాన్` ఫేమ్ టామ్ హాలండ్ తో పోల్చిన‌ప్పుడు గౌతమ్ విజువల్స్ చూసి వీరిద్దరూ అన్నదమ్ముల్లా (బ్రదర్స్ లా) ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మన టాలీవుడ్ స్టార్లు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరువవుతున్న ఈ తరుణంలో భవిష్యత్తులో క్రిస్టోఫర్ నోలన్ తీయబోయే సినిమాలో ఈ `తెలుగు చియాన్` ఒక అద్భుతమైన పాత్రతో హాలీవుడ్‌కు పరిచయమైతే ఆ లెక్కే వేరే లెవల్లో ఉంటుందని...ఇందుకోసం మహేష్ ప్లానింగ్స్ కూడా గట్టిగానే ఉంటాయని ఘట్టమనేని అభిమానులు బలంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

20 ఏళ్లుగా మోస్తున్న ఒక అప్పు లాంటిది: డామ‌న్

ముంబైలో జరిగిన `ది ఒడిస్సీ` మూవీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హాలీవుడ్ స్టార్ మ్యాట్ డామన్ ప్రఖ్యాత భారతీయ దర్శకుడు శేఖర్ కపూర్‌పై తనకున్న గౌరవాన్ని.. పాత జ్ఞాపకాలను షేర్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో శేఖర్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన `ది ఫోర్ ఫెదర్స్` సినిమాలో నటించే అవకాశం వచ్చినా అప్పట్లో `బార్న్` చిత్ర సిరీస్ కమిట్‌మెంట్స్ వల్ల తాను ఆ ప్రాజెక్ట్‌ను వదులుకోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ నిర్ణయం తనను ఎంతగానో బాధించిందని చెబుతూ.. శేఖర్ కపూర్‌తో సినిమా చేయలేకపోవడం అనేది నా జేబులో 20 ఏళ్లుగా మోస్తున్న ఒక అప్పు లాంటిది. ఆయన నా విష్‌లిస్ట్‌లో ఎప్పటికీ ఉంటారు! అని మ్యాట్ డామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక జులై 17న విడుదల కానున్న `ది ఒడిస్సీ` సినిమా మేకింగ్ విశేషాల గురించి మాట్లాడుతూ.. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌తో ఈ స్థాయిలో పనిచేయడం లెజెండరీ మేకర్ డేవిడ్ లీన్ చిత్రంలో నటించినట్లుగా అనిపించిందని మ్యాట్ డామన్ పేర్కొన్నారు. గ్రీస్, ఐస్లాండ్, మొరాకో, ఇటలీ వంటి విభిన్న దేశాలలో ఎంతోమంది అంతర్జాతీయ నిపుణులతో కలిసి ప్రాక్టికల్‌గా.. ఇన్-కెమెరా పద్ధతిలో ఈ చిత్రాన్ని షూట్ చేశామని ఆయన చెప్పారు. ఈ సినిమా ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ సాధారణమైనది కాదని.. దాదాపు 6-7 సినిమాలతో సమానమైన భారీ శ్రమ, సమన్వయం దీని వెనుక ఉన్నాయని డామన్ ప్రశంసించారు.

Tags:    

Similar News