మాధురిపైనే కాదు.. ఐశ్వ‌ర్యారాయ్‌పైనా ఇలాంటి ప్ర‌చారం!

సంజయ్ లీలా భన్సాలీ విజువల్ వండర్- 2002 నాటి బ్లాక్‌బస్టర్ హిస్టారికల్ చిత్రం `దేవదాస్` లోని `డోలా రే డోలా` సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

Update: 2026-06-01 18:30 GMT

సంజయ్ లీలా భన్సాలీ విజువల్ వండర్- 2002 నాటి బ్లాక్‌బస్టర్ హిస్టారికల్ చిత్రం `దేవదాస్` లోని `డోలా రే డోలా` సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ జోడీ అసాధార‌ణ క్లాసిక్ నృత్యం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. అయితే ఇటీవల ఈ ఐకానిక్ సాంగ్ షూటింగ్ సమయంలో మాధురీ దీక్షిత్ `నాలుగు నెలల గర్భవతి` అని, అందువల్లే ఆమె కొన్ని డ్యాన్స్ స్టెప్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడిందంటూ దివంగత కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అసోసియేట్ రుబినా ఖాన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వైరల్ మ్యాట‌ర్‌పై తాజా ఇంటర్వ్యూలో మాధురీ దీక్షిత్ స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు.

తన ప్రెగ్నెన్సీ పుకార్లను పూర్తిగా కొట్టిపారేస్తూ మాధురి నవ్వుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసారు. నా పెద్ద కొడుకు ఆరిన్ 2003లో జన్మించాడు. కాబట్టి మీరే లెక్కలు వేసుకోండి .. అని క్లారిటీ ఇచ్చారు. మాధురీ దీక్షిత్ పెద్ద కుమారుడు ఆరిన్ నేనే 17 మార్చి 2003న జన్మించగా.. `దేవదాస్` సినిమా అంతకంటే ఎంతో ముందుగానే అంటే 23 మే 2002న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయ్యి 12 జూలై 2002న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ టైమ్‌లైన్ ప్రకారం చూస్తే.. ఆ పాట చిత్రీకరణ సమయంలో మాధురి గర్భవతి అనడం కేవలం అపోహ మాత్రమేనని స్పష్టమవుతోంది.

అయితే ఆ పాట షూటింగ్ సమయంలో తానూ కొంత అనారోగ్యానికి గురైన మాట వాస్తవమేనని మాధురి అంగీకరించారు. ఆ రోజుల్లో తను ముంబై -డెన్వర్ (అమెరికా) మధ్య నిరంతరం ప్రయాణాలు చేయాల్సి వచ్చేదని, ప్రయాణాల అలసట వల్ల శరీరం సహకరించలేదని తెలిపారు. దానికి తోడు `డోలా రే డోలా` పాట షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ రాత్రి వేళల్లోనే జరిగాయని, ఆ నైట్ షూట్స్ వల్ల చాలా అలసిపోయానని వివరించారు. కేవలం విపరీతమైన ప్రయాణాలు, రాత్రి పగలు తేడా లేని షూటింగ్స్ వల్లే అప్పట్లో కాస్త నీరసంగా అనిపించిందే తప్ప ప్రెగ్నెన్సీ వల్ల కాదని ఆమె స్పష్టం చేశారు.

ఈ వివాదానికి మూల కారణమైన రుబినా ఖాన్ అంతకుముందు ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ``డోలా రే డోలా పాటలో మాధురి మ్యాడమ్ గుండ్రంగా తిరిగి కింద కూర్చునే ఒక క్లిష్టమైన స్టెప్ ఉంటుంది. ఆమె నాలుగు నెలల గర్భవతి కావడం వల్ల సరిగ్గా తిరగలేక కళ్లు తిరిగినట్లు అయ్యేది... అందుకే ఆ ఒక్క షాట్ కోసం ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు షూట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు జ్వరంగా ఉన్నా కూడా సరోజ్ ఖాన్ మాస్టర్ చెప్పిన స్టెప్‌ను మార్చమని ఎప్పుడూ అడగలేదు! అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ కావడంతోనే మాధురి స్వయంగా రంగంలోకి దిగి వాస్తవాలను బయటపెట్టాల్సి వచ్చింది.

మాధురీ దీక్షిత్ 1999లో ప్రఖ్యాత హార్ట్ సర్జన్ డాక్టర్ శ్రీరామ్ నేనేను వివాహం చేసుకున్న తర్వాత యూఎస్‌లోని డెన్వర్‌కు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా ఈ న‌టి సినిమాల కోసం ముంబై, డెన్వర్ మధ్య తిరుగుతూనే ఉన్నారు. ఆమె తన ఇద్దరు కుమారులు ఆరిన్, ర్యాన్ నేనేలకు జన్మనివ్వడానికి ముందు పూర్తిస్థాయిలో నటించిన చివరి చిత్రం కూడా ఈ `దేవదాస్` కావడం విశేషం. శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన ప్రసిద్ధ బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మాధురి `చంద్రముఖి`గా, ఐశ్వర్య `పారో`గా న‌టించ‌గా, షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్‌లో నటించి మెప్పించారు. మొత్తానికి దశాబ్దాల కాలంగా వినిపిస్తున్న ఒక పెద్ద బాలీవుడ్ రూమర్‌కు మాధురి అధికారికంగా తెరదించారు.

సినిమా పరిశ్రమలో ఒక నటి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు లేదా ఒక భారీ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆమె ప్రెగ్నెన్సీపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఐశ్వర్యా రాయ్ `కరోనల్` సినిమా ఒప్పుకున్న సమయంలో గర్భం దాల్చడం వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి రావడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. అలాగే కరీనా కపూర్ ఖాన్ `వీరే ది వెడ్డింగ్` షూటింగ్ సమయంలో గర్భవతిగా ఉన్నా.. ఆ పాత్రకు తగ్గట్టుగా తన షెడ్యూల్స్‌ను పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఒక స్టార్ హీరోయిన్ శారీరక మార్పులపై లేదా షూటింగ్స్ సమయంలో ఆమె తీసుకునే చిన్న విరామాలపై మీడియా- సోషల్ మీడియా వర్గాలు విపరీతమైన స్క్రూటినీ చేయడం... పాత సంఘటనలను తప్పుగా అంచనా వేస్తూ పుకార్లు పుట్టించడం గ్లామర్ ప్రపంచంలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది.

Tags:    

Similar News