లస్ట్ స్టోరీస్ 3: సీజన్ -3పై తగ్గిన ఆసక్తి.. కారణం అదేనా?
నెట్‌ఫ్లిక్స్ ప్రసిద్ధ ఆంథాలజీ సిరీస్‌లో మూడవ భాగమైన `లస్ట్ స్టోరీస్ 3` విడుదలకు సిద్ధమవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ ప్రసిద్ధ ఆంథాలజీ సిరీస్‌లో మూడవ భాగమైన `లస్ట్ స్టోరీస్ 3` విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేమ, సాన్నిహిత్యం, మానవ సంబంధాలలోని విభిన్న కోణాలను ఆవిష్కరించే ఈ సిరీస్ ఈ సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకుని బత్రా, విశాల్ భరద్వాజ్ వంటి అగ్ర దర్శకులు తెరకెక్కించిన నాలుగు విభిన్న కథలతో.. కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టే, విజయ్ వర్మ, సిద్ధార్థ్ వంటి భారీ నటీనటుల తారాగణంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.
అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటన, ఫస్ట్ లుక్ - ట్రైలర్ విడుదలైనా సోషల్ మీడియాలో దీనిపై మునుపటి స్థాయిలో ఆసక్తి కనిపించడం లేదు. ముఖ్యంగా `లస్ట్ స్టోరీస్ 2` ప్రేక్షకాదరణ పొందడంలో విఫలం కావడమే ఈ సీక్వెల్‌పై బజ్ తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్, రెండో భాగం రాకతో పూర్తిగా నీరుగారిపోయిందనే అభిప్రాయం నెటిజన్లలో బలంగా వినిపిస్తోంది.
రెడ్డిట్ వంటి వివిధ సోషల్ మీడియా వేదికలపై ఈ సిరీస్ గురించి జరుగుతున్న చర్చలను పరిశీలిస్తే...వీక్షకుల నుండి తీవ్రమైన ప్రతికూల -మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. `లస్ట్ స్టోరీస్ 2`లో నటి కొంకణా సేన్ శర్మ దర్శకత్వం వహించిన ఒక్క షార్ట్ ఫిల్మ్ తప్ప మిగిలిన కథలేవీ ఆకట్టుకోలేకపోయాయని మెజారిటీ నెటిజన్లు తెగేసి చెప్తున్నారు. పైగా మునుపటి భాగం తీవ్రంగా నిరాశపరచడంతో చాలామంది ప్రేక్షకులు ఈ ఫ్రాంచైజ్ పై ఆసక్తిని కోల్పోయి..ఈ మూడో భాగాన్ని సులభంగా స్కిప్ చేయవచ్చనే చర్చ సాగుతోంది.
ఓటీటీ ఆడియన్స్ అభిరుచులలో వచ్చిన మార్పు కూడా ఈ సీక్వెల్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేవలం బోల్డ్‌నెస్‌ను లేదా విభిన్నమైన కాన్సెప్ట్‌లను ప్రచార చిత్రాల్లో చూపించినంత మాత్రాన నేటి వీక్షకులు కనెక్ట్ అవ్వడం లేదు. కథలో బలమైన ఎమోషన్ .. నిజాయితీని కోరుకుంటున్నారు. రెండవ భాగంలో నాణ్యమైన కంటెంట్ లోపించడం వల్ల.. మూడవ భాగంలో ఎంత పెద్ద దర్శకులు లేదా నటీనటులు ఉన్నప్పటికీ ఆడియన్స్‌లో ఆరంభంలోనే ఒక రకమైన అనాసక్తి నెలకొంది.
మునుపటి సీక్వెల్స్ తెచ్చిన నిరాశ.. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న విమర్శల మధ్య రాబోతున్న `లస్ట్ స్టోరీస్ 3` ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. దిగ్గజ దర్శకులు అందించబోయే కొత్త కథలు, స్టార్ నటుల ప్రదర్శనలు ఈసారి నెగెటివ్ టాక్‌ను దాటుకుని.. గతంలో కోల్పోయిన ఆదరణను తిరిగి తెచ్చిపెడతాయో లేదో త్వరలోనే తేలనుంది.