లోకేష్ క‌న‌క‌రాజ్.. కోరుకుందొక‌టి, ద‌క్కిందొక‌టి

సౌత్ ఇండియాలో చాలా త‌క్కువ టైంలో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న ద‌ర్శ‌కుల్లో లోకేష్ క‌న‌క‌రాజ్ ఒక‌డు.

Update: 2026-08-11 06:08 GMT

సౌత్ ఇండియాలో చాలా త‌క్కువ టైంలో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న ద‌ర్శ‌కుల్లో లోకేష్ క‌న‌క‌రాజ్ ఒక‌డు. తొలి సినిమా మాన‌గరంతోనే అత‌ను మంచి పేరు సంపాదించాడు. ఇక రెండో సినిమా ఖైదీ ఇంకా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మూడో చిత్రం మాస్ట‌ర్ అనుకున్నంత‌గా ఆడ‌క‌పోయినా.. భారీ హైప్ తెచ్చుకుంది. నాలుగో చిత్రం విక్ర‌మ్ అయితే.. సౌత్ ఇండియా అంత‌టా త‌న పేరు మార్మోగేలా చేసింది. ఈ చిత్రంతో అత‌ను ప‌రిచ‌యం చేసిన ఎల్సీయూ యువ‌త ఊగిపోయేలా చేసింది. త‌న మీద అంచ‌నాలు ఎక్క‌డికో వెళ్లిపోయాయి.

సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద స్టార్ల‌తో స‌మానంగా అత‌ను క్రేజ్ సంపాదించాడు. త‌ర్వాతి చిత్రాల‌తో అత‌ను అద్భుతాలు చేసేస్తాడ‌ని ఆశించారు. కానీ లియో, కూలీ ఒక‌దాన్ని మించి ఒక‌టి నిరాశ‌ప‌రిచాయి. ముఖ్యంగా కూలీ చూశాక లోకేష్ మీద న‌మ్మ‌కం పోయింది ప్రేక్ష‌కుల‌కు. అంత‌కుముందు త‌న చుట్టూ ఉన్న‌ హైప్ చాలా వ‌ర‌కు ఈ సినిమా త‌ర్వాత క‌రిగిపోయింది. అల్లు అర్జున్‌తో త‌న కొత్త సినిమా అనౌన్స్ చేసిన‌పుడు కూడా ఆడియ‌న్స్ లైట్ తీసుకున్నారు. ఎగ్జైట్ అవ్వ‌లేదు.

ద‌ర్శ‌కుడిగా త‌న‌మీద పెట్టుకున్న అంచ‌నాల‌ను అందుకోలేక పై నుంచి కింద‌ప‌డిపోయిన లోకేష్ క‌న‌క‌రాజ్.. న‌టుడిగా త‌నపై ఏమాత్రం అంచ‌నాలు లేని స్థితిలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇవ్వ‌డ‌మే కాక‌, భారీ విజ‌యాన్ని కూడా ఖాతాలో వేసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. అత‌ను డీసీ అనే సినిమాతో హీరో అవ‌తారం ఎత్తాడు. ఈ సినిమా మొద‌లైన‌పుడు, మేకింగ్ ద‌శ‌లో ఉండ‌గా, రిలీజ్ ముంగిట పెద్ద‌గా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోయింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్ష‌కులైతే ఈ సినిమా ను లైట్ తీసుకున్న‌ట్లే క‌నిపించారు. అస‌లు లోకేష్‌కు హీరోగా చేయాల్సిన అవ‌స‌ర‌మేంటి అనుకున్నారు. కానీ డీసీ చిత్రంతో దేవ‌దాస్ పాత్ర‌లో లోకేష్ క‌న‌క‌రాజ్ అదిరిపోయే పెర్ఫామెన్స్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

అత‌ను పెద్ద‌గా న‌టించిన‌ట్లు క‌నిపించ‌దు కానీ.. పాత్ర‌కు త‌గ్గ‌ట్లు స‌టిల్‌గా పెర్ఫామ్ చేసి ఒప్పించ‌డం చిన్న విష‌యం కాదు. సినిమా అంతా అయ్యాక దేవ‌దాస్ పాత్ర ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌పై బ‌ల‌మైన ముద్ర వేస్తుంది. ఆ పాత్ర‌ను ఓన్ చేసుకుంటాం. కామ్‌గా క‌నిపిస్తూనే ఈ పాత్ర‌ను భ‌లేగా చేశాడే అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఈ సినిమా రోజు రోజుకూ క‌లెక్ష‌న్లు పెంచుకుంటూ బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా అడుగులు వేస్తోంది. లోకేష్ ద‌ర్శ‌కుడిగా చేసిన సినిమాల మీద ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న ప్రేక్ష‌కులు తీవ్రంగా నిరాశ‌చెంద‌గా.. హీరోగా అత‌డి సినిమా ఇలా అంచ‌నాల్లేకుండా వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించ‌డం పెద్ద ట్విస్ట్.

Tags:    

Similar News