టాప్ స్టోరి: లారెన్స్ బిష్ణోయ్ మారో దావూద్ అవ్వాల‌నుకున్నాడా?

లారెన్స్ బిష్ణోయ్ 1993లో పంజాబ్‌లో పోలీస్ కానిస్టేబుల్ కుటుంబంలో జన్మించి.. 2010లో యూనివర్సిటీ ఎన్నికల్లో ఓటమి తర్వాత హింసామార్గం పట్టి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు.

Update: 2026-10-20 06:12 GMT

80ల‌లో దావూద్ ఇబ్ర‌హీం గ్యాంగ్ అండ‌ర్ వ‌ర‌ల్డ్ కార్య‌క‌లాపాలు ఏ స్థాయిలో కొన‌సాగాయో.. దాని చ‌రిత్ర ఏమిట‌న్న‌ది ముంబై ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ఠంగా తెలుసు. ముఖ్యంగా సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో దావూద్ అరాచ‌కాలు అన్నీ ఇన్నీ కావు. అత‌డి కార‌ణంగా చాలా మంది ప్రముఖులు త‌మ ప్ర‌య‌త్నాల‌ను విర‌మించి గ్లామ‌ర్ ప్ర‌పంచం నుంచి దూర‌మ‌య్యామ‌ని అంగీక‌రించారు. క‌మ‌ల్ హాస‌న్ వంటి ప్ర‌ముఖుడు కూడా అండ‌ర్ వ‌ర‌ల్డ్ థ్రెట్ ఎదుర్కొన్నాన‌ని బ‌హిరంగంగా తెలిపారు. టీ సిరీస్ గుల్ష‌న్ ని మ‌ట్టు పెట్టింది దావూద్ గ్యాంగ్. హృతిక్ రోష‌న్ తండ్రిపైనా దాడుల‌కు తెగ‌బ‌డగా అత‌డు తృటిలో త‌ప్పించుకున్నాడు. ఇప్పుడు టైగ‌ర్ ష్రాఫ్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దాడులు.. అత‌డు తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ప‌బ్లిగ్గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే కార్ లో వెళుతున్న టైగ‌ర్ ష్రాఫ్ పై దుండ‌గులు తుపాకుల‌తో రెచ్చిపోయారు. ఏడు రౌండ్లు బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు. ఆ సీన్ చూస్తుంటే ఆర్జీవీ `స‌త్య‌` సినిమాని మించిపోయింది. ఒక‌సారి లారెన్స్ బిష్ణోయ్ గ‌తంలోకి వెళితే.. అత‌డికి స‌ల్మాన్ ఖాన్ తో ఉన్న కనెక్ష‌న్.. రాప‌ర్ సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీల హ‌త్య‌ల‌తో ఉన్న క‌నెక్ష‌న్, టైగ‌ర్ ష్రాప్ పై తాజా దాడికి మూలం ఇవ‌న్నీ అర్థ‌మ‌వుతాయి.

పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న 28 ఏళ్ల ప్రముఖ రాపర్ సిద్దు మూసేవాలాను 2022లో పంజాబ్‌లోని తన స్వగ్రామం వద్ద లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దారుణంగా కాల్చి చంపడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ హ‌త్య‌కు తామే బాధ్యులమ‌ని లారెన్స్ బిష్ణోయ్ రైట్ హ్యాండ్ గోల్డీ బ్రార్ అధికారికంగా ప్ర‌క‌టించారు. తమ మిత్రుడు విక్కీ మిడ్డుఖేరా హత్యకు ప్రతీకారంగానే త‌ల తీసామ‌ని వెల్ల‌డించారు. భారతీయ హిప్-హాప్ రంగాన్ని శాసించిన ఒక అంతర్జాతీయ గాయ‌కుడు కం నటుడిని ఇలా పగటిపూట దారుణంగా హత్య చేయడం ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్ తన క్రూరత్వాన్ని, విస్తరించిన నెట్‌వర్క్‌ను ప్రపంచానికి చాటిచెప్పింది.

లారెన్స్ బిష్ణోయ్ నేర ప్రస్థానాన్ని గమనిస్తే.. అతడు 1993లో పంజాబ్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చండీగఢ్ విశ్వవిద్యాలయంలో లా(న్యాయ శాస్త్రం) చదువుతున్న రోజుల్లో స్టూడెంట్ పాలిటిక్స్ ద్వారా తన అరాచకాలను ప్రారంభించి.. ఆపై క్రమంగా పెద్ద గ్యాంగ్ స్ట‌ర్‌గా అవతరించాడు. దశాబ్ద కాలానికి పైగా ప‌లు రాష్ట్రాల జైళ్లలోనే నిర్బంధంలో ఉన్నా అత‌డు రహస్యంగా సెల్‌ఫోన్‌లను ఉపయోగిస్తూ జైలు గోడల మధ్య నుంచే తన అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపిస్తుండటం పోలీసు- నిఘా వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఈ గ్యాంగ్ పేరు బాలీవుడ్‌లో ఎక్కువగా మార్మోగడానికి ప్రధాన కారణం నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న తీవ్రమైన పగ. 1998లో రాజస్థాన్‌లో `హమ్ సాత్ సాత్ హైం` సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింక‌ల్ని (బ్లాక్‌బక్) వేటాడారని ఆరోపణలు వచ్చాయి. బిష్ణోయ్ సమాజం కృష్ణ జింక‌ల‌ను దైవసమానంగా.. అత్యంత పవిత్రంగా పూజిస్తుంది. తమ సమాజ పవిత్రతను దెబ్బతీశారనే ఆగ్రహంతో సల్మాన్ ఖాన్ తమ ఆలయానికి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 2018లో బిష్ణోయ్ బహిరంగంగా చంపేస్తామ‌నే హెచ్చ‌రిక‌ల్ని జారీ చేశాడు. ఆ తర్వాత నుండి సల్మాన్ ఇంటిపై కాల్పులు జరపడం.. అత‌డికి సన్నిహితంగా ఉండే వారిపై దాడులు చేయడం ఈ గ్యాంగ్ నైజంగా మారింది.

బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం భారత్ వ‌ర‌కే పరిమితం కాదు. వీళ్ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మాఫియా అండ‌దండ‌లున్నాయి. డ్ర‌గ్ నెట్ వ‌ర్కులు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, కెన‌డా, స్పెయిన్ స‌హా ప‌లు పెద్ద దేశాల్లో నేర సామ్రాజ్యం విస్త‌రించి ఉంది. ఇది ఒక చెయిన్ నెట్ వ‌ర్క్. ఈ నెట్‌వర్క్ డ్రగ్స్ స్మగ్లింగ్, ఎక్స్‌టార్షన్, రాజకీయాల‌తో ముడిప‌డిన‌ హత్యలకు పాల్పడుతోందని అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక కూడా ఈ గ్యాంగ్ హస్తం ఉందనే ఆరోపణలు రావడం.. కెనడా-భారత్ దౌత్య సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ గ్లోబల్ క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఉపేక్షించకూడదనే ఉద్దేశంతో ఎఫ్‌బీఐ, డీఈఏ, కెనడియన్ రాయల్ మౌంటెడ్ పోలీస్ (RCMP), స్పానిష్ సివిల్ గార్డ్ వంటి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు కలిసి `ఆపరేషన్ హార్డ్ బాల్` పేరుతో భారీ దాడిని నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లతో పాటు డజన్ల కొద్దీ ముఠా సభ్యులపై అంతర్జాతీయ నేరాల కింద అమెరికాలో తీవ్రమైన అభియోగాలు మోపారు. జైలు నిబంధనలు, చట్టపరమైన లోపాలను ఆసరాగా చేసుకుని ఎదుగుతున్న ఇలాంటి గ్యాంగ్‌స్టర్ వ్యవస్థను అంతం చేసేందుకు అంతర్జాతీయ ఏజెన్సీలు ఇప్పుడు కఠిన చర్యలు చేపడుతున్నాయి.

బెయిల్ దేనికి.. జైలే సేఫ్:

లారెన్స్ బిష్ణోయ్ 1993లో పంజాబ్‌లో పోలీస్ కానిస్టేబుల్ కుటుంబంలో జన్మించి.. 2010లో యూనివర్సిటీ ఎన్నికల్లో ఓటమి తర్వాత హింసామార్గం పట్టి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. జగ్గు భగ్‌వాన్‌పూరియా తోడుతో లిక్కర్, డ్రగ్స్ మాఫియాతో పాటు బాలీవుడ్ ప్రముఖులను బెదిరిస్తూ కోట్లు సంపాదించిన అతడు 2016 నుంచి జైలులో ఉంటున్నా.. కెనడా, యూఎస్‌లలో తన గ్యాంగ్‌ను చురుగ్గా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉంటున్న బిష్ణోయ్ తన సోదరుల సహాయంతో వీపీఎన్ ద్వారా మెసేజులు పంపిస్తూ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నాడు. ముఖ్యంగా 16-30 ఏళ్ల యువకులను.. తక్కువ శిక్షతో సులువుగా బయటపడొచ్చనే ఉద్దేశంతో మైనర్లను నేరాల కోసం ఎంచుకుంటున్నారు. బయట ఎదురయ్యే ప్రాణభయం, రిస్క్ కంటే చట్టపరమైన లొసుగులతో జైలే సురక్షితమని భావించడం వల్లే ఇతడు ఇప్పటివరకు ఒక్క బెయిల్ పిటిషన్ కూడా వేయకపోవడం గమనార్హం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 700 మంది షూట‌ర్లు ప్ర‌స్తుతం లారెన్స్ బిష్ణోయ్ కోసం ప‌ని చేస్తుండ‌టం మ‌రో కొస‌మెరుపు. అయితే లారెన్స్ బిష్ణోయ్ కూడా మ‌రో దావూద్ ఇబ్ర‌హీం అవ్వాల‌నుకున్నాడ‌ని, అత‌డిలా ప్ర‌పంచాన్ని శాసించాల‌ని భావిస్తున్నాడ‌ని ప్ర‌చారం సాగుతుంటే, మ‌రోవైపు బిష్ణోయ్ గ్యాంగ్.. దావూద్ ని త‌మ ఇంటి కుక్కగా చూస్తామ‌ని పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ త‌మ ముందు పిల్ల కాకి అని చెప్ప‌క‌నే చెబుతున్నారు!

Tags:    

Similar News