సింగర్ గాంజావాల వెనుక గంజాయి మిస్టరీ!
మహాత్మా గాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి ఈ వృత్తికి పూర్తిగా స్వస్తి పలికినట్లు కునాల్ తెలిపారు.
బాలీవుడ్‌లో మధురమైన గొంతుతో ఎన్నో చార్ట్‌బస్టర్ పాటలను అందించిన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ కునాల్ గంజావాలా తన ఇంటిపేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ఆయన పేరులో ఉన్న `గంజావాలా` అనే పదంపై ఇప్పటి వరకు ఎన్నో జోకులు, సందేహాలు వ్యక్తమైనప్పటికీ దాని వెనుక ఒక చారిత్రక నేపథ్యం ఉందని గాంజావాలా క్లారిటీ ఇచ్చారు. బ్రిటిష్ కాలం నాటి తమ కుటుంబ వృత్తికి సంబంధించిన నిజాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బ్రిటిష్ రాజ్ కాలంలో తమ పూర్వీకులు వైద్య అవసరాల కోసం మాత్రమే గంజాయి మొక్కలను పండించేవారని కునాల్ వెల్లడించారు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం కావడానికి ముందు ఈ వృత్తి చట్టబద్ధంగా కొనసాగిందని తెలిపారు. ఆ కాలంలో తాము పండించిన పంటను ప్రభుత్వానికి అందజేసేవాళ్ళమని, ఆ సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం తమ కుటుంబానికి పన్ను మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు బ్రిటిష్ ప్రభుత్వం తమ పూర్వీకులకు రావ్ సాహెబ్ అనే బిరుదును కూడా ప్రదానం చేసిందని కునాల్ గుర్తు చేసుకున్నారు. నాటి కాలంలో క్యాన్సర్ బాధితుల కోసం తయారు చేసే ఓపియం ఆధారిత ఇంజెక్షన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను తమ కుటుంబమే ప్రభుత్వానికి సరఫరా చేసేదని ఆ విధంగా వారు లైసెన్సెస్ పొందిన ఫార్మాసిస్టులుగా బాధ్యతలు నిర్వర్తించేవారని వివరించారు.
మహాత్మా గాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి ఈ వృత్తికి పూర్తిగా స్వస్తి పలికినట్లు కునాల్ తెలిపారు. అయితే గాంజావాలా అనే ప్రత్యేకమైన ఇంటిపేరు కారణంగా తన జీవితంలో ఎదురైన సరదా అనుభవాలను కూడా గుర్తు చేసుకున్నారు. కొందరు ఈ పేరు అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ఆసక్తి చూపితే, మరికొందరు మాత్రం సరదాగా తనను టీజ్ చేస్తుంటారని కునాల్ సరదాగా చెప్పుకొచ్చారు. ఎవరైనా వచ్చి `ఏంటో భాయ్.. గంజెవాలా, గూడ్స్ ఏమైనా ఉన్నాయా? అని జోకులు వేస్తుంటారని.. అయితే తాను ఎలాంటి మత్తు పదార్థాలను తీసుకోనని, పొగ తాగనని వారికి స్పష్టంగా చెబుతుంటానని కునాల్ వెల్లడించారు.
ఈ విచిత్రమైన ఇంటిపేరు తన కెరీర్ ప్రారంభ రోజుల్లో జింగిల్స్ పరిశ్రమలో త్వరగా గుర్తుండిపోవడానికి ఎంతగానో సహాయపడిందని తెలిపారు. వివాదాస్పదంగా అనిపించే ఈ పేరు వెనుక ఇంతటి చారిత్రక, వైద్యపరమైన సేవ దాగుండటం విశేషమని కునాల్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే జోకులను పట్టించుకోకుండా, తన కుటుంబం నాటి కాలంలో చేసిన చట్టబద్ధమైన వృత్తిని కునాల్ గర్వంగా పంచుకున్నారు.
మొత్తంగా చూస్తే సెలబ్రిటీల ఇంటిపేర్లపై రకరకాల ఊహాగానాలు వస్తున్న తరుణంలో కునాల్ గంజావాలా స్వయంగా ముందుకొచ్చి చెప్పిన నిజాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చారిత్రక ఆధారాలతో కూడిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాటి కుటుంబ వృత్తికి, నేటి ఆయన సింగింగ్ కెరీర్‌కు మధ్య ఉన్న ఆసక్తికరమైన జ్ఞాపకం అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.