శ్రీవిష్ణు ప్రతి సినిమాకి 10 మెట్లు ఎక్కుతున్నాడు!- కోన వెంకట్
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న `కామ్రేడ్ కళ్యాణ్` చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో వేడుకగా జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది.
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న `కామ్రేడ్ కళ్యాణ్` చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో వేడుకగా జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ముందుగా `కామ్రేడ్` అనే పదానికి అర్థవంతమైన నిర్వచనాన్ని అందించారు. కష్టంలో, ఆపదలో, అవసరంలో, ఆనందంలో మన చెయ్యి వదలకుండా చివరిదాకా నిలబడేవారే అసలైన కామ్రేడ్స్ అని నిర్వచించడం ఆసక్తిని కలిగించింది. తన పిలుపునందుకుని ఈ వేదికపైకి వచ్చిన మిత్రులు, దర్శకులు, చిత్ర పరిశ్రమ శ్రేయోభిలాషులందరూ తన దృష్టిలో నిజమైన కామ్రేడ్స్ అని ఆయన ఎంతో ఆత్మీయంగా పలకరించారు.
హీరో శ్రీవిష్ణు ఎదుగుదలపైనా కోన వెంకట్ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీవిష్ణు ప్రతీ సినిమాకూ 10 మెట్లు పైకి ఎక్కుతూ తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారని కొనియాడారు. ఆయన ఆడియన్స్ బేస్- బాక్స్ ఆఫీస్ సామర్థ్యం నిలకడగా పెరగడం వల్లే శ్రీవిష్ణు కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించగలిగామని గర్వంగా వెల్లడించారు. తన కథల ఎంపిక... కష్టపడే తత్వంతో మరో రెండేళ్లలో శ్రీవిష్ణు తెలుగు చిత్రసీమలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారనే ధీమాను కోన వెంకట్ వ్యక్తం చేశారు.
ఈ వేదికపై రెడ్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గురించి కోన వెంకట్ మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. `కామ్రేడ్` అనే పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆర్. నారాయణమూర్తి గారేనని.. అందుకే ఆయనను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించామని చెప్పారు. నారాయణమూర్తి లాగా నిరాడంబరంగా జీవించడం ఎవరికీ సాధ్యం కాదని.. ఇప్పటికీ ఆయన ఒక రూమ్ కోసం లాడ్జ్‌లోనే ఉంటూ సినిమాలు రాసుకుంటున్నారని తెలిపారు. నారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన రాసే తదుపరి చిత్రాన్ని నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ వేదికపై బహిరంగంగా ఆఫర్ ఇచ్చారు.
అలాగే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారిపై తనకున్న గౌరవాన్ని- అనుబంధాన్ని కోన వెంకట్ బహిర్గతం చేసారు. విజయేంద్ర ప్రసాద్ గారు తన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి అని.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆయనతో మాట్లాడటం తనకు ఒక అలవాటుగా మారిందని తెలిపారు. ఆయన ఇచ్చే సలహాలు, మార్గదర్శకత్వం తనకు నిరంతరం కొండంత అండగా ఉంటాయని చెప్పారు.
చివరగా `కామ్రేడ్ కళ్యాణ్` సినిమాలోని వినోదం- కంటెంట్‌పై ఆయన పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గతంలో తాను రచయితగా పనిచేసిన డి, రెడీ, దూకుడు, బాద్‌షా, కింగ్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లోని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని కూడా 100 శాతం ఆస్వాధిస్తారని హామీ ఇచ్చారు. ఈ సినిమాలోని ప్రతి పాట- ప్రతి విజువల్ ప్రేక్షకులను కట్టిపడేసి థియేటర్లకు రప్పించేలా ఉంటుందని చెప్తూ చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
`కామ్రేడ్ కళ్యాణ్` టీజర్ ఆవిష్కరణ మహోత్సవంలో చిత్రబృందం తరఫున కథానాయకుడు శ్రీవిష్ణు, రచయిత-నిర్మాత కోన వెంకట్, దర్శకుడు జానకి శ్రీరామ్, సంగీత దర్శకుడు, గీత రచయితలు పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా- పరిశ్రమ శ్రేయోభిలాషులుగా విప్లవాత్మక నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి, ప్రఖ్యాత విజనరీ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకులు బాబీ (కే.ఎస్. రవీంద్ర), శివ నిర్వాణ, నందిని రెడ్డి, రామ్ తాళ్లూరి, ఆదిత్య తదితర ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తుండగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలకానుంది.