మెట్ గాలా 2026 : కిమ్ కర్దాషియన్ మునుపెన్నడూ చూడని లుక్!

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక మెట్ గాలా-2026లో రియాలిటీ టీవీ క్వీన్ కిమ్ కర్దాషియన్ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు.;

Update: 2026-05-08 13:55 GMT

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక మెట్ గాలా-2026లో రియాలిటీ టీవీ క్వీన్ కిమ్ కర్దాషియన్ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే బోర్ కొడుతుందని నమ్మే కిమ్ తన ఫ్యాషన్ సెన్స్‌ను ఈసారి సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. గతంలో అంబానీల వివాహ వేడుకలో తన సోదరి ఖలోతో కలిసి ముంబైలో సందడి చేసిన ఈ గ్లోబల్ ఐకాన్ ఇప్పుడు మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై తన బాడీ హగ్గింగ్ డ్రెస్ లో మెరిసి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. గాజు బొమ్మలా సరికొత్త డిజైనర్ దుస్తుల్లో కిమ్ లుక్ చూసి అభిమానులు `మునుపెన్నడూ ఇలా చూడలేదే` అంటూ కామెంట్లతో రెచ్చిపోతుస్తున్నారు.

ఈ అదిరే లుక్ వెనుక కిమ్ నెలల తరబడి చేసిన కసరత్తు ఒక అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టును తలపిస్తుంది. ఈ దుస్తుల తయారీ కేవలం ఒక స్టూడియోకో లేదా వర్క్‌షాప్‌కో పరిమితం కాలేదు. వివిధ ఖండాలలోని డిజైనర్లు, నిపుణులు దీని కోసం పనిచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ డ్రెస్ ఫినిషింగ్ కోసం చివరికి ఒక ఆటో బాడీ షాప్‌లో కూడా పనులు జరగడం గమనార్హం. రెడ్ కార్పెట్ మీద కనిపించే ఆ మెరుపుల వెనుక ఎంతటి గందరగోళం, ఒత్తిడి, శ్రమ దాగి ఉంటాయో కిమ్ సిద్ధమైన తీరును చూస్తే అర్థమవుతుంది.

కిమ్ తన ఫైనల్ ఫిట్టింగ్‌ను న్యూయార్క్‌లో ఈవెంట్‌కు కేవలం రెండు రోజుల ముందు రెడీ చేశారు. ఈ ప్రక్రియలో పాపుల‌ర్ బ్రిటిష్ పాప్ ఆర్టిస్ట్ అలెన్ జోన్స్‌ను ఆహ్వానించడం విశేషం. ఫ్యాషన్ ప్రపంచంలో అలెన్ జోన్స్ ఆర్ట్ వర్క్‌ను చాలా మంది రిఫరెన్స్‌గా వాడుతుంటారని.. తాను కూడా ఆయనకు పెద్ద అభిమానినని కిమ్ ఈ సందర్భంగా వెల్లడించారు. తన చుట్టూ ఎప్పుడూ ఉండే డజన్ల కొద్దీ కెమెరాలను ఉద్దేశించి ``30 కెమెరాలు లేకుండా నేను ఎక్కడికీ ప్రయాణించను.. నా ప్రపంచంలోకి స్వాగతం`` అంటూ అలెన్ జోన్స్‌తో సరదాగా వ్యాఖ్యానించారు.

సాధారణ దుస్తుల తయారీకి భిన్నంగా ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్ కోసం కిమ్ ఒక అసాధారణమైన సృజనాత్మక ప్రయాణాన్ని ఎంపిక చేసుకున్నారు. కేవలం అందంగా కనిపించడమే కాకుండా... తన దుస్తుల ద్వారా ఒక కళాఖండాన్ని ప్రదర్శించాలనేది తాపత్రయంగా కనిపిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే పాప్ ఆర్టిస్టులను.. ప‌లు రంగాల నిపుణులను భాగస్వాములను చేశారు. అందుకే మెట్ గాలా వేదికపై ఎందరో అందగత్తెలు భారీ డిజైనర్ దుస్తుల్లో మెరిసినా కిమ్ ఎంచుకున్న యూనిక్ లుక్ మాత్రం ప్రత్యేకంగా నిలిచి అందరి మతులు చెడగొడుతోంది.

కిమ్ కర్దాషియన్ మరోసారి ఫ్యాషన్ ప్రపంచానికి తానే క్వీన్ అని నిరూపించుకున్నారు. ముంబై పర్యటనలో ఖరీదైన నెక్లెస్ పోగొట్టుకున్న వార్తతో చర్చల్లో నిలిచిన కిమ్ ఇప్పుడు మెట్ గాలా లుక్‌తో గ్లోబల్ ట్రెండ్‌లో నిలిచారు. యువతను ఆకట్టుకోవాలన్నా.. కెమెరాల కళ్లు ఎప్పుడూ తన వైపే ఉండాలన్నా తనకే సాధ్యమని ఆమె చాటిచెప్పారు. ఈ వినూత్నమైన ఆలోచనా దృక్పథమే త‌న‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఫ్యాషన్ ఐకాన్‌లలో ఒకరిగా నిలబెట్టింది. కిమ్ క‌ర్ధాషియ‌న్ ఇండియ‌న్ ఫ్యాన్స్ ఈ లుక్ ని జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

Tags:    

Similar News