క్రేజ్ ఉంది కానీ హిట్టు లేదు.. 'టాక్సిక్'తో వస్తుందా?
కియారా అద్వానీకి ప్రస్తుతం క్రేజ్ విషయంలో పెద్ద సమస్య లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు ఉంది. పెద్ద హీరోల సినిమాలు కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి.
కియారా అద్వానీకి ప్రస్తుతం క్రేజ్ విషయంలో పెద్ద సమస్య లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు ఉంది. పెద్ద హీరోల సినిమాలు కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ ట్రాక్ చూస్తే మాత్రం కొన్నేళ్లుగా ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇప్పుడు యష్ ‘టాక్సిక్’లో నాదియా పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఆమెకు కూడా చాలా అవసరమైన టైమ్‌లో పడింది.
బాలీవుడ్‌లో కియారాకు చివరి పెద్ద హిట్‌గా ‘భూల్ భులయ్యా 2’నే చెప్పాలి. 2022లో వచ్చిన ఆ సినిమా భారీ వసూళ్లు చేసింది. ఆ తర్వాత ‘జుగ్‌జుగ్ జీయో’, ‘సత్యప్రేమ్ కీ కథ’ సినిమాలు వచ్చాయి కానీ బ్లాక్‌బస్టర్ రేంజ్‌కు వెళ్లలేదు. 2025లో ‘వార్ 2’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తెలుగులో చూస్తే ‘భరత్ అనే నేను’ తర్వాత ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ ఆమెకు కలిసి రాలేదు. అంటే సౌత్‌లో కూడా చాలా కాలంగా ఒక పెద్ద విజయం బాకీ ఉంది.
అందుకే ‘టాక్సిక్’లో నాదియా పాత్ర కియారాకు రెగ్యులర్ హీరోయిన్ రోల్‌లా కనిపించడం లేదు. ఈ పాత్ర తన కెరీర్‌లోనే చాలా కొత్తగా ఉందని ఆమె ఇప్పటికే చెప్పింది. యష్ కూడా ప్రేక్షకులు కియారాను ఇంతకు ముందు చూడని విధంగా చూస్తారని చెప్పడం గమనించాల్సిన విషయం. ట్రైలర్‌లో కూడా గ్లామర్‌తో పాటు పాత్రకు కాస్త డార్క్ షేడ్ ఉన్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు కియారా వ్యక్తిగత జీవితంలో కూడా పెద్ద మార్పు వచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత 2025లో ఆమె తల్లి అయ్యారు. కూతురు సారాయాతో కొత్త జీవితంలోకి వెళ్లిన తర్వాత కూడా కెరీర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. ‘టాక్సిక్’ ప్రమోషనల్ కంటెంట్‌లో కూడా మునుపటిలాగే గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. తల్లి అయిన తర్వాత తన శరీరం, మనసు, ప్రాధాన్యతలపై కూడా ఓపెన్‌గా మాట్లాడారు.
ఒకప్పుడు హీరోయిన్ పెళ్లి చేసుకుంటే లేదా తల్లి అయితే కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయనే లెక్క బలంగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఆడియన్స్ కూడా ఆ విషయాలను పాత్రలతో పెద్దగా కలపడం లేదు. అలియా భట్ నుంచి నయనతార వరకు చాలామంది పెళ్లి, పిల్లల తర్వాత కూడా పెద్ద సినిమాల్లో అదే స్థాయిలో కొనసాగుతున్నారు. కియారా కూడా ఇప్పుడు అదే దశలో ఉంది. ఆమెకు కావాల్సింది ఇప్పుడు మరో హిట్ సినిమా. ‘టాక్సిక్’ ఆ అవకాశం ఇస్తుందా అన్నదే ఇప్పుడు చూడాలి. యష్ సినిమా కాబట్టి ఓపెనింగ్ రావడం ఒక విషయం. కానీ నాదియా పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతే కియారాకు అది ఇంకా ఉపయోగపడుతుంది.