మానవత్వం లేకుండా ట్రాన్స్జెండర్ను హింసిస్తావా? ప్రశ్నించిన స్టార్ డైరెక్టర్!
ఈ సందర్భంగా సమాన గౌరవం, మానవ హక్కుల గురించి మాట్లాడిన ఆయన ఒక వ్యక్తి విలువను వారు పిల్లలను కనే సామర్థ్యం ఆధారంగా మాత్రమే అంచనా వేయడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు.
తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, మరో దర్శకుడు మోహన్ జి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల `డోరథి` సినిమాకు సంబంధించి జరిగిన ఒక రౌండ్టేబుల్ డిస్కషన్లో మోహన్ జి, తిరునంగై (ట్రాన్స్జెండర్) నటి నేఘా ఎల్జీబీటీక్యూ సమాజంపై చేసిన ట్రాన్స్ఫోబిక్ వ్యాఖ్యలను కార్తీక్ సుబ్బరాజ్ బహిరంగంగా ఖండించారు. సమాజంలో మార్పు చెందిన లైంగికత కలిగిన వ్యక్తులపై ఇలాంటి వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
ఒక బహిరంగ వేదికపై తోటి మనుషుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం శారీరక హింస కంటే దారుణమైన మానసిక హింసతో సమానమని కార్తీక్ సుబ్బరాజ్ అభివర్ణించారు. ఏ వ్యక్తికీ ఇతరులను అందరి ముందూ కించపరిచే లేదా చిన్నచూపు చూసే హక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం.. విమర్శించడం వేరని.. కానీ చర్చల పేరుతో మానవత్వాన్ని మరిచిపోయి వ్యక్తిగత దాడులకు దిగడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని కార్తీక్ సుబ్బరాజు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సమాన గౌరవం, మానవ హక్కుల గురించి మాట్లాడిన ఆయన ఒక వ్యక్తి విలువను వారు పిల్లలను కనే సామర్థ్యం ఆధారంగా మాత్రమే అంచనా వేయడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లు కూడా ఈ సమాజంలో అందరిలాగే స్వేచ్ఛగా, గౌరవంగా బతికే హక్కు కలిగి ఉన్నవారని బలంగా సమర్థించారు. కేవలం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పబ్లిసిటీ పొందాలని చూసే సంస్కృతికి స్వస్తి పలకాలని.. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్తీక్ సుబ్బరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో ముఖ్యంగా రెడ్డిట్ వేదికగా నెటిజన్ల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఒక ప్రధాన స్రవంతి దర్శకుడిగా సమాజంలో ఉన్న వివక్షను ధైర్యంగా ప్రశ్నించినందుకు నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. గతంలో `ద్రౌపది`, `బకాసురన్` వంటి వివాదాస్పద చిత్రాలు తీసిన మోహన్ జి ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ పబ్లిసిటీ పొందుతుంటారని చాలామంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
అయితే మోహన్ జి వంటి వారి వ్యాఖ్యలకు స్పందించడం ద్వారా వారికి మరింత అనవసరమైన గుర్తింపు.. ప్రాచుర్యం దక్కుతుందేమోనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయినా ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం, సమాజంలో సమానత్వం కోసం మాట్లాడిన కార్తీక్ సుబ్బరాజ్ వైఖరిని మెజారిటీ సినీ ప్రియులు అభినందిస్తున్నారు. తమిళ చిత్రసీమలో బాధ్యతాయుతమైన చర్చకు ఈ ఘటన ఒక వేదికగా మారింది.