చేతిలో గులాబీ పువ్వుతో తెర వెనుక నిలబడ్డాను!

తొంభైల దశకంలో గోవిందా - కరిష్మా కపూర్ జోడీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2026-10-06 13:30 GMT

తొంభైల దశకంలో గోవిందా - కరిష్మా కపూర్ జోడీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే? ఇద్ద‌రి మధ్య ఉన్న అనుబంధం కెమెరాకే పరిమితం కాలేదు. ఇండస్ట్రీలోకి రాకముందు చేతిలో గులాబీ పువ్వుతో ఓ సాధారణ అభిమానిలా తెర వెనుక నిలబడి గోవిందా డ్యాన్స్‌ను ఆరాధిం చిన అరుదైన జ్ఞాపకాన్ని కరిష్మా కపూర్ తాజాగా గుర్తు చేసుకున్నారు.

క‌రిష్మా ఇండస్ట్రీలోకి రాకముందు జరిగిన ఓ స్టేజ్ షో లో గోవిందాను మొదటిసారి చూసాన‌న్నారు. ఆ సమయంలో గోవిందా వేదికపై అప్పటి స్టార్ హీరోయిన్ నీలం కొఠారితో కలిసి `స్ట్రీట్ డ్యాన్సర్` పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ ప్రదర్శన సమయంలో తాను వేదిక వెనుక చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని నిలబడ్డానని కరిష్మా చెప్పుకొచ్చారు. వేదిక వెలుపల నుంచి తెరల చాటుగా తొంగి చూస్తూ గోవిందా డ్యాన్స్‌ను ఎంతగానో ఆస్వాదించానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లోనే గోవిందా డ్యాన్స్ స్టెప్పులకు, ఎనర్జీకి తాను ఫిదా అయ్యానని తెలిపారు.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే కరిష్మా కపూర్ బాలీవుడ్‌లో నటిగా అడుగుపెట్టారు. అనుకోకుండా అదే గోవిందాతో స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశం లభించింది. తొలి రోజుల్లో ఒక అభిమానిలా గోవిందా డ్యాన్స్‌ను తెర వెనుక నుంచి చూసిన తాను కొద్ది కాలంలోనే ఆయన సరసన కథానాయికగా నటించడం అదృష్టంగా భావించాన‌ని కరిష్మా పేర్కొన్నారు.

గోవిందా- కరిష్మా కపూర్ కలయికలో వచ్చిన `రాజా బాబు`, `కూలీ నెం. 1`, `హీరో నెం. 1` వంటి చిత్రాలు అప్పట్లో సంచలన విజయాలు సాధించాయి. ఇద్ద‌రి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, కామిక్ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేటికీ ఈ జోడీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సినిమాల పరంగా బిజీగా ఉన్నా? పాత జ్ఞాపకాలను, తోటి నటులతో ఉన్న అనుబంధాన్ని కరిష్మా కపూర్ ఇలా అభిమానులతో పంచుకోవడం విశేషం. ఒకప్పటి ఆ మధురమైన జ్ఞాపకం తన మనసులో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలిపారు.

కేవలం ఆన్-స్క్రీన్ జోడీగానే కాకుండా ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు చూపించుకునే ఈ రకమైన అంతులేని గౌరవం, అపురూపమైన ప్రయాణమే తారలను నేటికీ ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తోంది. తారల మధ్య ఉండే ఇలాంటి వ్యక్తిగత భావోద్వేగాలు, నాస్టాల్జిక్ జ్ఞాపకాలే సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లను ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచేలా చేస్తాయి.

Tags:    

Similar News