కాపీ పేస్ట్ లకు కాలం చెల్లింది..ఎవరి స్లైల్ వారిదే!
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ట్రెండ్స్‌ను నిర్దేశించడంలో ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్ జోహార్ పాత్ర ఎప్పుడూ ప్రత్యేకమైనదే.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ట్రెండ్స్‌ను నిర్దేశించడంలో ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్ జోహార్ పాత్ర ఎప్పుడూ ప్రత్యేకమైనదే. తెరపైనే కాదు నిజజీవితంలోనూ నటీనటుల దుస్తులు, శైలిపై ఆయనకు మంచి అవగాహన ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు బాలీవుడ్ ఫ్యాషన్ ప్రపంచంలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఇటీవల అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు కరీనా కపూర్ ,అలియా భట్ వంటి టాప్ హీరోయిన్ల స్టైల్‌ను అభిమానులు గుడ్డిగా అనుకరించేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.
ప్రస్తుత తరం యువత , ఫ్యాషన్ ప్రియులు సెలబ్రిటీ రూపాన్ని కాపీ చేయడానికి ఇష్టపడటం లేదన్నారు. `ఇప్పుడు ఎవరికీ ఇతరుల శైలిని అనుకరించడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. కరీనా కపూర్ ఐకానిక్ పాత్రలైన `గీత్` (జబ్ వి మెట్) లేదా (కభీ ఖుషీ కభీ గమ్) ద్వారా దేశవ్యాప్తంగా సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ సృష్టించింది. అలియా భట్ కూడా తన కాన్ఫిడెంట్ లుక్స్‌తో ఎందరినో ఆకట్టుకుంది. కానీ నేడు సామాన్య ప్రజలు సైతం తమ సొంత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే దుస్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు.
ఈ మార్పుకు ప్రధాన కారణం సోషల్ మీడియా విప్లవం వ్యక్తిగత శైలి పై పెరిగిన అవగాహనే అని చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్, పిన్‌ట్రెస్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల తో ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ ప్రపంచంపై అపారమైన అవగాహన లభిస్తోంది. వెండితెరపై కనిపించే తారలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులు, స్ట్రీట్ స్టైల్ ను యువత నిరంతరం గమనిస్తోంది. దీంతో తమ శరీర ఆకృతికి , వ్యక్తిత్వానికి సరిపోయే విభిన్నమైన శైలిని స్వయంగా డిజైన్ చేసుకునే లేదా ఎంచుకునే స్వేచ్ఛ వారికి లభిస్తోంది. పైగా సెలబ్రిటీల ఫ్యాషన్ నేడు చాలా వరకు పిఆర్ స్ట్రాటజీలలో భాగమైపోయింది.
విమానాశ్రయాల్లో కనిపించే ఎయిర్‌పోర్ట్ లుక్స్ నుండి జిమ్ రూపాంతరాల వరకు ప్రతిదీ స్టైలిస్ట్‌లచే ముందుగానే ప్లాన్ చేయబడుతోంది. ఈ కృత్రిమత్వం సాధారణ ప్రజలకు సులభంగా అర్థమవుతోంది. దీంతో సెలబ్రిటీల ఫ్యాషన్ అనేది కెమెరా ప్రదర్శన మాత్రమేనని.. నిజజీవితంలో ప్రతిరోజూ ధరించడానికి అది సౌకర్యవంతంగా ఉండకపోవచ్చనే ప్రాక్టికల్ ఆలోచన కూడా ప్రజల్లో పెరిగింది. ఈ క్రమంలోనే కరీనా కపూర్, అలియా భట్ వంటి అగ్ర నటీమణులు కూడా రోజువారీ జీవితంలో అత్యంత సాధారణమైన సౌకర్యవంతమైన దుస్తులకే మొగ్గు చూపుతున్నారు. అయినా? ప్రజలు వారిని ఫ్యాషన్ మోడల్‌గా చూడటం మానేసి.. వారి నటనను , ప్రతిభను మాత్రమే ఆదరిస్తున్నారు.
ఫ్యాషన్ అనేది ఒకరిని అనుకరించడం కాదు. మనల్ని మనం వ్యక్తపరుచుకోవడం అనే భావన సమాజంలో బలంగా నాటుకుపోవడమే దీనికి నిదర్శనమని కరణ్ జోహార్ అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటీనటులు ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినా? నేడు ఆ పట్టు సడలింది. ఆధునిక కాలంలో ఐడెంటిటీ క్రిసిస్ కంటే ఐడెంటిటీ క్రియేషన్ ముఖ్యమైంది. ఎవరికి వారు తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మార్పు దుస్తుల ఎంపికలోనే కాకుండా? సమాజంలో వ్యక్తుల ఆలోచనా విధానంలో వస్తోన్న పరిణితికి కూడా అద్దం పడుతోంది. సెలబ్రిటీల ప్రభావం తగ్గినా? ఫ్యాషన్ రంగం మరింత ప్రజాస్వామ్యయుతంగా మారడం ఆహ్వానించదగ్గ పరిణామం.