'డే డ్రింకర్' టీజర్: జానీ డెప్ కొత్త అవతారం.. థ్రిల్లింగ్ స్క్రీన్ ట్రీట్‌కి ఫ్యాన్స్ ఫిదా
హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ నటించిన `పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` సిరీస్ ఎంతటి సంచలనమో చెప్పాల్సిన పని లేదు. డెప్ వైవిధ్యమైన నటన, ఆహార్యానికి భారతదేశంలోను వీరాభిమానులేర్పడ్డారు.
హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ నటించిన `పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` సిరీస్ ఎంతటి సంచలనమో చెప్పాల్సిన పని లేదు. డెప్ వైవిధ్యమైన నటన, ఆహార్యానికి భారతదేశంలోను వీరాభిమానులేర్పడ్డారు. అయితే డెప్ ఇటీవల తన భార్యతో విడాకుల వ్యవహారంలో చాలా అగచాట్లు ఎదుర్కొన్నాడు. అయితే తనపై ఉన్న అన్ని కేసుల్లోను అతడు విజయం సాధించాడు. డెప్ చాలా కాలం తర్వాత మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై అదరగొట్టడానికి సిద్ధమయ్యారు. అతడు నటిస్తున్న తాజా థ్రిల్లర్ సినిమా `డే డ్రింకర్` టీజర్ ఇటీవల విడుదల కాగా అందులో జానీ డెప్ లుక్ పూర్తిగా మారిపోయి ఎవరూ గెస్ చేయలేనంత భిన్నంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆస్కార్ విజేత పెనెలోప్ క్రూజ్ , మడెలిన్ క్లైన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
`ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్` దర్శకుడు మార్క్ వెబ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రైవేట్ యాచ్‌లో పనిచేసే బార్ టెండర్ (మడెలిన్ క్లైన్) - యాచ్‌కి వచ్చే ఒక మిస్టరీ గెస్ట్ (జానీ డెప్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాను తప్పులు చేయడంలోనే జీవనం సాగిస్తున్నానని చెప్పుకునే డెప్ పాత్ర చివరకు ఒక ప్రమాదకరమైన నేరస్థురాలైన పెనెలోప్ క్రూజ్‌తో ఇరకాటంలో ఎలా చిక్కుకుందనేదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే మ్యాజిక్ కట్టి పడేస్తున్నాయి. డెప్ మరోసారి వినూత్నమైన ప్రదర్శనతో రక్తి కట్టించడం అభిమానులకు కన్నులపండువను తలపిస్తోంది.
ఈ టీజర్‌లో జానీ డెప్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతోంది. ``మీరు నేను పని అయిపోయిందని అనుకున్నారు.. నేను ఎప్పుడు ఆగిపోవాలో నేనే నిర్ణయించుకుంటాను`` అంటూ అతడు చెప్పిన మాస్ డైలాగ్ తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు అద్దం పడుతోందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ డైలాగ్ యూట్యూబ్ కామెంట్స్‌లోనూ ట్రెండింగ్‌గా మారింది.
గతంలో మాజీ భార్య ఆంబర్ హెర్డ్‌తో జరిగిన పరువు నష్టం వివాదం.. సుదీర్ఘ న్యాయపోరాటం కారణంగా జానీ డెప్ మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్ సినిమాలకు చాలా కాలం పాటు దూరంగా ఉన్నారు. 2018 నాటి `ఫాంటాస్టిక్ బీస్ట్స్` తర్వాత అతడు నటించిన మొట్టమొదటి మేజర్ స్టూడియో ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. వివాదాలన్నీ సద్దుమణిగిన తర్వాత అతడు తిరిగి పూర్వ వైభవాన్ని దక్కించుకునేలా దూసుకు వస్తున్నారు.
ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు జానీ డెప్ నటిస్తున్న మరో చిత్రం `ఎబెనేజర్` కూడా విడుదలకు సిద్దమవుతోంది. జానీ డెప్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు.