జపానోళ్లు కూడా తెలుగు అభిమానుల్లా!
అయితే ఇప్పుడీ తెలుగు సినిమా పిచ్చి సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా పాకుతోంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌కు మాస్ జాతరను అలవాటు చేస్తున్న తెలుగు హీరోలిప్పుడు జపాన్ ప్రేక్షకులను కూడా మార్చేస్తున్నారు.
సినిమాను అమితంగా ప్రేమించడం.. థియేటర్లలో పదే పదే చూసి పండగలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు ఉన్న ప్రత్యేకమైన అలవాటు. ఇష్టమైన హీరో సినిమా వస్తే చాలు.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయడం, నచ్చితే థియేటర్లలోనే తిష్టవేసి పదుల సంఖ్యలో వీక్షించడం టాలీవుడ్‌లోనే ఎక్కువగా కని పిస్తుంది. భారతదేశంలో మరే ఇతర సినిమా ఇండస్ట్రీలోనూ ఇంతటి తీవ్రమైన అభిమాన సంస్కృతి కనిపించదు. అయితే ఇప్పుడీ తెలుగు సినిమా పిచ్చి సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా పాకుతోంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌కు మాస్ జాతరను అలవాటు చేస్తున్న తెలుగు హీరోలిప్పుడు జపాన్ ప్రేక్షకులను కూడా మార్చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో జపాన్ దేశంలో తెలుగు సినిమాలకు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఒకప్పుడు రజనీకాంత్ చిత్రాలకు మాత్రమే పరిమితమైన జపనీస్ మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడా మార్కెట్ టాలీవుడ్ హీరోల గుప్పిట్లోకి వచ్చింది. తాజాగా విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `పెద్దీ` సినిమా కోసం జపాన్ అభిమానులు హైదరాబాద్ వచ్చి సినిమా చూసిన సంగతి తెలిసిందే. అక్కడి అభిమానులు ఈ చిత్రాన్ని ఒక్కసారి చూసి వదిలేయడం లేదు. థియేటర్లకు వెళ్లి ఏకంగా పదిసార్లకు పైగా చూస్తూ తెలుగు ఫ్యాన్స్ తరహాలోనే హంగామా చేస్తున్నారు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, సినిమాలోని ఎమోషన్స్‌కు జపనీయులు ఫిదా అయిపోతున్నారు.
జపాన్ ప్రేక్షకులలో ఈ తరహా మార్పు రావడానికి ప్రధాన కారణం తెలుగు సినిమాల్లోని విజువల్ గ్రాండియర్ .. నమ్మశక్యం కాని ఎమోషన్స్. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` చిత్రం జపాన్‌లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌తో రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్‌లకు జపాన్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి వరకు కేవలం హాలీవుడ్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే జపనీయులు.. నాటి నుంచి తెలుగు సినిమాల్లోని మాస్ ఎలిమెంట్స్‌కు, సెంటిమెంట్‌కు కనెక్ట్ అయిపోతున్నారు. అచ్చం తెలుగు అభిమానుల్లాగే ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఈ ట్రెండ్ ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు.
రాబోయే రోజుల్లో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ - పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోయే చిత్రాలు జపాన్ మార్కెట్‌ను మరింత ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. తారక్ నెక్స్ట్ రాబోయే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ కోసం జపాన్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్స్ చేస్తున్నారు. ఆయన డాన్స్ .. డైలాగ్ డెలివరీకి అక్కడి ఆడియన్స్ ముగ్ధులవుతుండటంతో రాబోయే సినిమాలను జపానోళ్లు 20 సార్లకు పైగా చూసినా ఆశ్చర్యపోనక్కరలేదు అనే వాతావరణం కనిపిస్తోంది. మొత్తానికి భాషా బేధాలను దాటి తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్‌లో దూసుకుపోతోంది. తెలుగు స్టార్ హీరోల మాస్ ఇమేజ్, దర్శకుల మేకింగ్ స్టైల్ అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం తెలుగు ఫ్యాన్స్ లా థియేటర్ల వైపు పరుగులు తీయిస్తున్నాయి. ఒక సినిమాను పదే పదే చూస్తూ ఆరాధించే ఈ కల్చర్ జపాన్‌కు సైతం పాకడం అనేది తెలుగు సినిమా సత్తాకు ..టాలీవుడ్ ఇండస్ట్రీ గ్లోబల్ రీచ్‌కు దక్కిన అతిపెద్ద గౌరవంగా భావించొచ్చు.