సినిమాల నుంచి బిజినెస్ వరల్డ్: సీనియ‌ర్ల బాట‌లో జాన్వీక‌పూర్

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో మేకప్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తరచుగా కనిపిస్తున్నారు.

Update: 2026-10-11 07:38 GMT

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో మేకప్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తరచుగా కనిపిస్తున్నారు. దీంతో హాలీవుడ్ పాప్ ఐకాన్ కైలీ జెన్నర్ బాటలోనే జాన్వీ కూడా త్వరలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్యూటీ లేదా కాస్మోటిక్స్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తన ముద్ర వేయాలని, ఒక సక్సెస్ ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా రాణించాలని జాన్వీ కలలు కంటున్నారు.

సినిమా రంగంలో అగ్ర కథానాయికలుగా వెలుగొందుతున్న పలువురు నటీమణులు ఇప్పటికే వ్యాపార వేత్తలుగా మారి విజయం సాధించారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన ప్రసిద్ధ స్కిన్ కేర్ బ్రాండ్ 82°E తో మార్కెట్లో దూసుకెళ్తోంది. ప్రకృతి సిద్ధమైన పదార్థాలు, ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ బ్రాండ్ గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రారంభించిన కే బ్యూటీ డిజిటల్ మార్కెటింగ్ - నైకా భాగస్వామ్యంతో భారతీయ మేకప్ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ అత్యంత ప్రాచుర్యం పొందింది.

మరోవైపు నటి సన్నీలియోన్ కూడా తన సొంత కాస్మోటిక్ బ్రాండ్ `స్టార్‌స్ట్రక్ బై సన్నీలియోన్` ద్వారా బ్యూటీ - పెర్ఫ్యూమ్స్ విభాగాల్లో మంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నారు. అలాగే దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార `ది లిప్ బామ్ కంపెనీ` పేరిట ప్రత్యేకమైన లిప్ కేర్ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చి సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా నిలిచారు.

సెలబ్రిటీ బ్రాండ్ల జాబితాలో నేషనల్ క్రష్ ఆలియా భట్ తీరే వేరు. ఆలియా పిల్లల కోసం పర్యావరణ రహిత దుస్తుల బ్రాండ్ `ఎడ్-ఎ-మమ్మ` ను ప్రారంభించి, స్వల్ప కాలంలోనే వ్యాపార పరంగా పెద్ద ఎత్తున విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే కన్నడ కస్తూరి, పాన్-ఇండియా నటి రష్మిక మందన్న కూడా త్వరలోనే తన సొంత డ్రింక్- లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ను లేదా బ్యూటీ కేర్ ప్రాడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

వీరందరి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ జాన్వీ కపూర్ కూడా బ్యూటీ అండ్ కాస్మోటిక్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా గ్లామర్, సోషల్ మీడియాలో ఉన్న భారీ ఫాలోయింగ్‌ను వ్యాపారంగా మలుచుకుంటూ, వ్యాపార రంగంలోనూ తమ సత్తా చాటేందుకు నేటితరం కథానాయికలు ముందంజ వేస్తుండడం విశేషం.

Tags:    

Similar News